ఇప్పటికిప్పుడు వేటు వేయడం కష్టం!

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది అంతగా ఆసక్తికరమైన సంచలనాత్మకమైన సంగతి ఎంత మాత్రమూ కాదు. సాధారణంగా శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి.. వారు…

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది అంతగా ఆసక్తికరమైన సంచలనాత్మకమైన సంగతి ఎంత మాత్రమూ కాదు. సాధారణంగా శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి.. వారు ఎంపీ సీట్లను దక్కించుకుంటారు. అందులో ఎలాంటి మొహమాటమూ లేదు.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. పార్టీలకు సంబంధించి కనిపించే బలాబలాలు, వాస్తవమైన బలాబలాలకు మధ్య వ్యత్యాసం ఉంది. కనిపించే బలాన్ని బట్టి వేసే అంచనాలు మారిపోయే అవకాశమూ ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాన్ని నివారించడానికి గడువు ముగిసిపోయిందా ? అనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో వ్యక్తం అవుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పంచన చేరి కుటిల రాజకీయం చేస్తున్నారు. వారి మీద ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎన్నడో ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదులను ఇటీవలే స్పీకరు తమ్మినేని సీతారాం బయటకు తీయడం ఒక కీలక పరిణామం. ఆయన వారికి నోటీసులు ఇవ్వడమూ, తమకు సంజాయిషీకి ఇంకా సమయం కావాలని వారు జవాబు రాయడమూ, ఈలోగా వారు హైకోర్టును కూడా ఆశ్రయించడమూ జరిగింది. ఇప్పుడు షెడ్యూలు కూడా విడుదల అయిపోయింది. 

షెడ్యూలు వచ్చిన తర్వాత.. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద వేటు వేస్తే వివాదాస్పదం అవుతుంది. కేవలం రాజ్యసభ ఎన్నికల్లో తమను ఓటు చేయనివ్వకుండా అడ్డుకోడానికి మాత్రమే షెడ్యూలు విడుదలైన తర్వాత వేటు వేశారని ఆ ఎమ్మెల్యేలు కోర్టులో వాదిస్తే జవాబు ఉండదు.

అదే సమయంలో- తాము పార్టీ ఫిరాయించాం అని.. ఎంతో కాలం కిందట ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కుట్రపూరితం అని సదరు ఎమ్మెల్యేలు అనగలరు. ఇలాంటి నేపథ్యంలో మరో రకం న్యాయపరమైన చిక్కుల్లో ఎదుర్కోకుండా ఉండాలంటే.. ఇప్పుడు వేటు వేయడం కుదరకపోవచ్చు.

తెలుగుదేశం, జనసేన పార్టీ కూడా తమ ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి స్పీకరుకు ఫిర్యాదు చేసి ఉన్నారు. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉండగా. ప్రత్యర్థి పార్టీల తరఫున అయిదుగురు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సి ఉంది. 

ఇప్పుడు షెడ్యూలు వచ్చేసింది గనుక.. ఇప్పటికిప్పుడు ఎవ్వరిమీద వేటుపడదని అనుకుంటే గనుక.. వైసీపీకి నలుగురు నష్టం.. అయిదుగురు లాభం అవుతుంది. వారి బలం స్థిరంగానే ఉంటుంది. మొత్తం మూడు ఎంపీ స్థానాలను నిశ్చింతగా వారు గెలుచుకోగలరు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల గోల తప్ప ఇతరత్రా పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప ఫలితం మారదు.