పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం తెలంగాణ సర్కారు ప్రకటించిన మెగా లోక్ అదాలత్ కు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. గడువు పెంచినప్పటికీ చలాన్లు పూర్తిస్థాయిలో క్లియర్ అవ్వలేదు. గడువు ముగియడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. ఇక పెండింగ్ చలాన్లు పెద్దగా క్లియర్ అవ్వవని రవాణా శాఖ దాదాపు ఓ నిర్ణయానికొచ్చేసింది.
గతంలో 75శాతం డిస్కౌంట్ తో క్లియరెన్స్ ప్రకటించినప్పుడు దాదాపు 65శాతం చలాన్లు క్లియర్ అయ్యాయి. అలా ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈసారి మాత్రం ఇప్పటివరకు 136 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. మిగిలిన ఈ కొద్ది గడువులో మహా అయితే మరో కోటి రూపాయలు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రం మొత్తమ్మీద 3.59 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారీగా డిస్కౌంట్ మేళా ప్రకటించింది ప్రభుత్వం. ఈసారి ఏకంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80శాతం రాయితీ ఇచ్చింది. అంటే, వంద రూపాయలు ఫైన్ ఉంటే 20 రూపాయలు కడితే సరిపోతుందన్నమాట.
ఇక ఆర్టీసీ బస్సుల పెండింగ్ చలాన్ల మొత్తంలో 10 శాతం కడితే చాలు. భారీ వాహనాలు, 4 చక్రాల వాహనాలపై ఉన్న చలాన్ మొత్తంలో 40 శాతం కడితే సరిపోతుంది. ఇలా భారీగా డిస్కౌంట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అటుఇటుగా 2 కోట్ల చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి.