జగన్ కి ముందున్న నాలుగు సవాళ్లు

జగన్ మోహన్ రెడ్డి “సిద్ధం” ప్రసంగంలో తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎవరు ఏ పద్మవ్యూహం పన్నినా అందులో చిక్కుకుని దెబ్బతినడానికి తాను అభిమన్యుడిని కానని, ఏ వ్యూహాలనైన ఛేదించగల అర్జునుడినని చెప్పారు. ఇదేదో…

జగన్ మోహన్ రెడ్డి “సిద్ధం” ప్రసంగంలో తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎవరు ఏ పద్మవ్యూహం పన్నినా అందులో చిక్కుకుని దెబ్బతినడానికి తాను అభిమన్యుడిని కానని, ఏ వ్యూహాలనైన ఛేదించగల అర్జునుడినని చెప్పారు. ఇదేదో హీరో పంచ్ డైలాగ్ మాదిరిగా వదిలేయకుండా..ఆ వెంటనే దానికి కారణం పైనున్న దేవుడు, ఎదురుగా ఉన్న మీరు..అంటూ ప్రజల్ని ఉద్దేశిస్తూ అన్నారు. 

ఇది ఇప్పటి మాట కాదు. 2019 నుంచీ జగన్ నోట వినిపిస్తున్న మాటలు రెండే- దైవం, ప్రజలు. ఈ రెండింటినీ నమ్మి ఆయన తన పని చేస్తున్నారు. ప్రజల్ని కూడా “మీ ఇంటిలో నా పాలన వల్ల ఏ మంచి జరిగిందో ప్రశ్నించుకోండి. జరిగిందనుకుంటేనే ఓటేయండి. లేకపోతే వేయొద్దు” అని చెబుతూ వస్తున్నారు. అది మొండిధైర్యమా, ఆత్మస్థైర్యమా అనేది ఎవరికి వారు నిర్ధారించుకోవచ్చు. 

ఒక పక్కన తెదేపా కాపు ఓట్లని కన్సాలిడేట్ చేసుకుంటూ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయినా జగన్ చీమ కుట్టినట్టు కూడా కనిపించడంలేదు. 

మరో పక్క షర్మిల కాంగ్రెసులో చేరి తన మీద యుద్ధం ప్రకటించింది. అయినా అదంతా తన ఇంటిలో పోరు పెట్టిన కాంగ్రెస్ దుశ్చర్య అని కొట్టి పారేసాడే తప్ప చెల్లెలితో వ్యక్తిగత వైరాన్ని ప్రదర్శించడంలేదు. తన మేనల్లుడు, షర్మిల కొడుకు అయిన రాజారెడ్డి నిశ్చితార్ధానికి కూడా సతీసమేతంగా వెళ్లి కుటుంబ బాంధవ్యాలకి అంటిపెట్టుకుని ఉన్నట్టే కనిపిస్తున్నాడు. 

అంటే ఏవిటి? రాజకీయంగా తననెవరూ ఏదీ చేయలేని స్థితిలో ఉన్నారని పూర్తిగా నమ్ముతున్నట్టేనా? 

తాను ప్రజలకి చేసిన దానికి కచ్చితంగా మళ్లీ ఓట్లేసి గెలిపిస్తారన్న విశ్వాసాన్ని పట్టుకుని ఉన్నట్టేనా?

పజల్ని ఎంతవరకూ నమ్మొచ్చు? దైవంపై ఎంతవరకూ భారం వేయొచ్చు? ఎన్నికల ముందు చేయాల్సిన రాజకీయం కొంతైనా ఉంటుంది కదా? 

ఆ మాటకొస్తే దేశం మొత్తానికి సర్వంసహా చక్రవర్తిలా ఉన్న నరేంద్రమోదీ కూడా కాంగ్రెస్ ని తక్కువ అంచనా వేయకుండా సరిగ్గా ఎన్నికల ముందు లక్షద్వీప్- మాల్దీవుల వివాదం, అయోధ్య రామాలయం, కాశీలో జ్ఞానవాపి వంటి అంశాలతో అసలు కాంగ్రెస్ ఊసే లేకుండా కమ్మేయలేదా? ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడాన్ని అదనుగా చేసుకుని ఎన్నికల ముందు పెట్రోల్-డీజిల్ ధరల్ని తగించేందుకు సన్నాహాలు చేయడంలేదా? 

చేయాల్సిన రాజకీయం చేసి బీహారులో నితీష్ కుమార్ ని తన ఎండీయే గూటిలోకి చేర్చుకోలేదా? ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ కాంగ్రెస్ కి ఎదురుదెబ్బలో, పక్కదెబ్బలో కొట్టడంలేదా? 

మరి ఇలాంటి రాజకీయం జగన్ మోహన్ రెడ్డి చేయడమే లేదు ఆంధ్రాలో. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. మరి పదవి చేతిలో ఉండి ఎన్నికల ముందు జనాల దృష్టిలో తాను తప్ప ఇంకెవరూ లేకుండా చేసే ప్రయత్నాలేవి? కాస్త పరికించి చూస్తే ప్రధానంగా జగన్ ముందున్న సవాళ్లు ఇవే:

1. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష ధోరణి. పర్ఫామెన్స్ సరిగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవట్లేదని పైకి చెబుతున్నా, 175 నియోజకవర్గాల్లోనూ తన ఫొటో చూసే జనం ఓటేస్తారు తప్ప అభ్యర్థిని బట్టి కాదు అనే ధోరణిలో టికెట్ల కేటాయింపులు జరగడం. 

2. ప్రతిరోజూ ఊదరగొడుతున్న తెదేపా సానుకూల మీడియా కథనాలు. ఇవి ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతాయోనన్న ఆలోచన లేకపోవడం. 

3. తేదేపా-జనసేన కూటమి, షర్మిల కలిసి ఎన్ని ఓట్లు చీలుస్తాయన్న దానిని ఖాతరు చేయకపోవడం.

4. పార్టీలో అసంతృప్తిపరుల్ని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవడం.  

ఈ సవాళ్లల్లో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. 

ముఖ్యమైన సవాలుగా మారిన ప్రయోగం మొదటిదే. జనం తనని చూసే ఓటేస్తారని అనుకుని, అభ్యర్థుల విషయంపై సీరియస్ గా ఆలోచించక కేసీయార్ తాజా తెలంగాణా ఎన్నికల్లో భంగపడ్డాడు. 

ఇక్కడ పర్ఫార్మెన్స్ పాయింటులో అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జగన్ మళ్లీ టికెట్ ఇవ్వకపోవడం బాగానే ఉందనుకున్నా, కొత్త అభ్యర్థుల బలాబలాలే ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. పార్టీలో రిబెల్స్ ని పుట్టించేలా ఉంది పరిస్థితి. జగన్ ఈ సవాలను ఎలా అధిగమిస్తారో, అసలు దీనిని సవాలుగా భావిస్తున్నారో లేదో ఆయనకే తెలియాలి. ఫలితాన్ని బట్టే నిర్ణయాన్ని మంచో, చెడో చెప్పడం కుదురుతుంది తప్ప ఎన్నికలయ్యి ఫలితాలు వచ్చే వరకు ఆగాలంతే. 

ఇక రెండో సవాలు తెదేపా సానుకూల మీడియా కథనాలు. జగన్ దృష్టిలో వీటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇవి ఎప్పటినుంచో ఉన్నవే. 2019లో కూడా ఇలాంటి ఊక దంపుడే దంచాయి. అయినా ఫలితం 23-3 అయింది తెదేపాకి. కనుక తెదేపా మీడియాని తాటాకు చప్పుళ్లలాగానే భావిస్తూ ఉండొచ్చు జగన్. కానీ కాలం అన్నిసార్లూ ఒకేలా ఉండకపోవచ్చు. 2019లో ఆ కథనాలకి లొంగని జనం 2024లో లొంగే అవకాశముండదని ఎందుకనుకోవాలి. ఒక రకంగా అర్బన్ ఓటర్లని విపరీతంగా ప్రభావితం చేసింది ఈ మీడియా. కనుక జగన్ దృష్టిలో కాకపోయినా అన్యుల దృష్టిలో ఇది సవాలే. 

మూడోది… తేదేపా-జనసేన కూటమి, షర్మిల కలిసి ఎన్ని ఓట్లు చీలుస్తాయన్న దానిని ఖాతరు చేయకపోవడం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎన్నున్నా అవన్నీ తేదేపా-జనసేన కూటమి, షర్మిల మధ్యనే చీలతాయి తప్ప తన వైకాపా ఓటు బ్యాంకునుంచి ఒక్కటి కూడా వాళ్లకి పడదని జగన్ ధీమా కావొచ్చు. అది నిజంలాగే అనిపిస్తున్నా…రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు, అవ్వదనీ కాదు. షర్మిల ప్రసంగాలకి ఎందరు క్రిష్టియన్ ఓటర్లు కనెక్టవుతారు? వైకాపా వైపునున్న వారి ఓట్లు ఆమెకు పడవని గ్యారెంటీ ఏమిటి అనేది ఒక సవాలు. ఎంత చిన్న లీకేజున్నా సరే, కుండ నిండదు కదా! ఆ దిశగా ఆలోచించాలి.

ఇక ఆఖరి సవాలు- పార్టీలో అసంతృప్తిపరుల్ని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవడం. దీనివల్ల రిబెల్స్ పెరిగి తమ స్థానంలో నిలబడ్డ కొత్త అభ్యర్థుల ఓటమికి కృషి చేసే ప్రమాదముంది. ఇది సర్వసాధారణం కూడా. ఇది కచ్చితంగా చాలా పెద్ద సవాలు. 

చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి సవాలుకీ చెక్ పెట్టినప్పుడే మానవప్రయత్నం పూర్తిగా చేసినట్టు. అప్పుడే దైవం కూడా సహకరిస్తుంది. అంతే తప్ప పూర్తిగా దేవుడే చూసుకుంటాడు, నమ్ముకున్న ప్రజలే ఓట్లేస్తారు అని శంఖం ఊది కూర్చుంటే సరిపోదు. 

ఏది ఏమైనా ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీ. 84% మంది జనాభాకి రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చి, మునుపెన్నడూ ఏ పార్టీ చేయనంతగా 95% మ్యానిఫెస్టో హామీలను నిలబెట్టున్న పార్టీ తమది అని చెబుతోంది వైకాపా. అలాంటప్పుడు మళ్లీ అదే మెజారిటీతో పదవిలోకొస్తుందా? లేక ఎంతిచ్చినా, ఏమిచ్చినా జనం ఆలోచన ఊహించినట్టుగా ఉండదా..అనేది తేలుతుంది! వేచి చూడాలి. 

శ్రీనివాసమూర్తి