కాపీ కొట్ట‌డం.. త్రివిక్ర‌మ్ నుంచి నేర్చుకోవాలి మ‌రి!

స్వాతి బుక్ మంచి ఊపు మీద ఉన్న రోజుల్లో 72 పేజీల ఆ ప‌త్రిక‌లో క‌నీసం నాలుగు సీరియ‌ల్స్ ప్ర‌చురితం అయ్యేవి! ఆ బుక్ ను చ‌దివే వారిలో కూడా ఎంత‌మంది ఆ సీరియ‌ల్స్…

స్వాతి బుక్ మంచి ఊపు మీద ఉన్న రోజుల్లో 72 పేజీల ఆ ప‌త్రిక‌లో క‌నీసం నాలుగు సీరియ‌ల్స్ ప్ర‌చురితం అయ్యేవి! ఆ బుక్ ను చ‌దివే వారిలో కూడా ఎంత‌మంది ఆ సీరియ‌ల్స్ ను చ‌దువుతారో, వాటిని రెగ్యుల‌ర్ గా ఫాలో అవుతారో ఎవ‌రికీ తెలీదు! అందునా.. తెలుగునాట న‌వ‌ల‌లు, పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు మాయ‌మై దాదాపు రెండు ద‌శాబ్దాలు గ‌డుస్తున్నాయి! ఇర‌వై యేళ్ల కింద‌టి నాటికే న‌వ‌ల‌లు, మ్యాగ్జైన్ల ప‌తనావ‌స్థ మొద‌లైంది. 

అలాంటి కాలం చాలా గ‌డిచిన త‌ర్వాత ఒక వీక్లీలో ప్ర‌చురితం అయిన న‌వ‌లను కొర‌టాల కాపీ కొట్టార‌నేది అభియోగం. ఇది ఈనాటిది కూడా కాదు!. దాదాపు ప‌దేళ్లు కావొస్తున్నాయి.  ఇంత వ‌ర‌కూ ఆ ర‌చయిత పోరాడంటే గొప్ప సంగ‌తే! అయితే కొన్ని యూనివ‌ర్స‌ల్ కాన్సెప్ట్ లు ఉంటాయి. వాటిని ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరు! 

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీ గురించి వ‌చ్చిన అప‌రిచితుడు లాంటిదే ఒక తెలుగు న‌వ‌ల ఉంటుంది. వాసిరెడ్డి సీతాదేవి న‌వ‌ల రాగ‌హేల అని ఒకటి ఉంటుంది. దాంట్లో స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీతో ఒక వ్య‌క్తి ఒకే అమ్మాయిని రెండు మ‌నస్త‌త్వాల‌తో ప్రేమిస్తూ ఉంటాడు. రెమో, రామం త‌ర‌హాలో! ఆ న‌వ‌ల ముగింపు కూడా చాలా బాగుంటుంది! మ‌రి అప‌రిచితుడుకు ఆ న‌వ‌ల కూడా ఆధారం అని వాదించ‌లేరు. కానీ ఎవ‌రైనా కేసు వేస్తే.. రెండింటి మ‌ధ్య‌న సాప‌త్యంతో క‌నీసం ప‌దేళ్ల పాటు కేసును న‌డిపించడం క‌ష్టం కాక‌పోవ‌చ్చు!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఒక‌వేళ కొర‌టాల కాపీ కొట్టి ఉంటే? అది ఆయ‌న క్రెడిబులిటీని మ‌రింత దెబ్బ‌తీస్తుంది. కోర్టు క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌కు ఆదేశించ‌డం అంటే మాట‌లేమీ కాదు! 

అయినా కాపీ కొడితే.. గిడితే.. అది త్రివిక్ర‌మ్ లా చేయాలి! గురూజీ ఎన్ని కాపీలు కొట్టినా.. సీన్ల‌ను సీన్లే దించేసినా, న‌వ‌ల‌ల నుంచి కాన్సెప్ట్ ను కాపీ కొట్టేసినా.. ఎక్క‌డైనా చిన్న కేసు కానీ, ఫిర్యాదు కానీ న‌మోదైందా? ఆ రేంజ్ లో ఉంటుంది గురూజీ కాపీ ప‌నిత‌నం! టెన్త్ ప‌రీక్ష‌ల్లో ఒక‌ప్పుడు చిట్టీల‌ను పెట్ట‌డంలో కొంద‌రు ప్ర‌తిభ‌ను చూపించే వారు. అలాంటి ప‌నిత‌నం ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ లోనే క‌నిపిస్తుంది!

హాలీవుడ్ సినిమాల నుంచి సీన్ల‌కు సీన్ల‌నే దించేసుకొచ్చినా, య‌ద్ధ‌న‌పూడి న‌వ‌లల నుంచి క‌థా, క‌థ‌నాల‌ను కొట్టుకొచ్చినా.. ఇష్యూ లేకుండా చూసుకోవ‌డం గురూజీకే సాధ్యం! అఆ సినిమా వివాదం అప్పుడు కూడా వివాదం పెద్ద‌ద‌వుతున్న ద‌శ‌లో య‌ద్ధ‌న‌పూడి సులోచ‌న‌రాణి పేరును టైటిల్స్ లోకి తీసుకొచ్చారు. ఇక గుంటూరు కారం క‌థ‌లో కూడా య‌ద్ధ‌న‌పూడి దినుసులున్నాయి. ఆమె మ‌ర‌ణించారు పాపం! కాబట్టి ఇప్పుడు ఆ బాధ కూడా లేదు! ముందు ముందు.. య‌ద్ధ‌న‌పూడి న‌వ‌ల‌ల నుంచి మ‌రింత పిండుకోవ‌చ్చు!

ఇందు మూలంగా అర్థం అవుతున్న‌దేమిటంటే.. కాపీ కొట్ట‌డం ఎలాగో టాలీవుడ్ ఔత్సాహిక ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్ నుంచి నేర్చుకోవాలి!