వైఎస్సార్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకుని వెళ్ళడంలేదు అంటూ మాజీ మంత్రి జనసేనలో చేరుతున్న నేత కొణతాల రామక్రిష్ణ ఆరోపించారు. జగన్ విషయంలో ఇప్పటికే చాలా మంది విమర్శలు చేస్తూ వస్తున్నారు. కుడి ఎడమల తేడా లేకుండా రాజకీయ పార్టీలు జగన్ మీద నిప్పులే చెరుతున్నాయి.
రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్న వారు కూడా జగన్ విషయంలో ఒక్కటై ఒకే లైన్ తీసుకోవడమే రాజకీయ విచిత్రంగా చూస్తున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మరో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అనకాపల్లిలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధులు. ఇద్దరూ వేరు వేరు పార్టీలలో ఉంటూ రాజకీయాలు నెరిపారు.
ఇప్పుడు దాడి టీడీపీలో చేరితే ఆ పార్టీ మిత్రపక్షం అయిన జనసేనలో కొణతాల చేరుతున్నారు. ఇద్దరి టార్గెట్ జగన్. ఇద్దరి విమర్శలు జగన్. జగన్ అన్నింటా ఫెయిల్ అంటున్నారు కొణతాల రామక్రిష్ణ. ఉద్ధానంలో జగన్ అభివృద్ధి చేశారు. అక్కడ ఇటీవలే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఏడు వందల కోట్ల రూపాయలతో వంశధార నుంచి ఎత్తిపోతల పధకం ద్వారా రక్షిత మంచి నీరు ఇచ్చారు.
అయితే ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ దే అంటున్నారు కొణతాల. ఉద్ధానం సమస్య మీద మొదట పోరాటం చేసింది పవన్ అని ఆయన అంటున్నారు. ఉద్ధానం విషయంలో పవన్ సమస్య లేవనెత్తితే కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పనిచేసి మంత్రులుగా చేసిన కొణతాల లాంటి వారు ఏమి చేశారో కూడా చెప్పాలని అంటున్నారు.
ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకం పూర్తి చేయడంతో జగన్ విఫలం అయ్యారని కొణతాల అంటున్నారు. అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో కూడా అది పూర్తి చేయలేదు, కానీ 2019 ఎన్నికలలో టీడీపీకి కొణతాల మద్దతు ఇచ్చిన సంగతిని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
కొణతాల అసలు అయిదేళ్ళ పాటు అజ్ఞానంలో ఉండి ఇప్పుడు ఎన్నికల వేళ బయటకు వచ్చారని అంటున్నారు. గోదావరి జిల్లాలను తీసుకుని వెళ్ళి ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన చోట శుద్ధి చేస్తామని కొణతాల చెబుతున్నారు.
మాజీ మంత్రి కొణతాల వైసీపీని విమర్శించడానికి ఇప్పటి దాకా సరైన రాజకీయ వేదిక దొరకలేదు, ఇప్పుడు జనసేన నుంచి ఆయన ఘాటు విమర్శలు చేయబోతున్నారు అని అంటున్నారు. జనసేన తరఫున ఎంపీ టికెట్ సాధించి పోటీ చేయాలని చూస్తున్న కొణతాల రాజకీయాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. జనాల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.