245 మంది సభ్యులున్న భారత ఎగువసభలో ప్రస్తుతం కమలం పార్టీకి ఎన్డీయే రూపంలో 114 మంది ఎంపీలున్నారు. వీరిలో 56 మంది సభ్యులు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు ఈ ఏప్రిల్ రెండుతో. ఈ నేపథ్యంలో శాశ్వత సభ ఎన్నికల బలాబలాల్లో స్వల్ప తేడాలుండబోతున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీ కోటాలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తంగా కమలం పార్టీ అదనంగా ఆరు స్థానాలను సొంతం చేసుకోబోతోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మారిన బలాబలాలతో బీజేపీ ఆరు సీట్లను అదనంగా పొంది తన బలాన్ని 120కి పెంచుకోబోతోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయేది, సంపాదించుకునేది పెద్దగా ఏమీ లేనట్టుగా ఉంది! ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి బలం 90 సీట్లు. వీటిల్లో కాంగ్రెస్ వాటా 30. మిగిలిన సీట్లు దాని మిత్రపక్షాలవి. ఒక ఎన్డీయే, ఇండియా కూటమితో సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ ఇతరుల సీట్లు కలిపి 31 ఉన్నాయి. వీటిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం మరో మూడు సీట్లు పెరగనుంది.
మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గం మద్దతుతో, దాని సొంత బలాన్ని కలుపుకుని బీజేపీ మూడు రాజ్యసభ స్థానాలను అదనంగా పొందనుంది. బిహార్ లో కూడా జేడీయూ కలయికతో బీజేపీకి లాభం కలగనుంది. గుజరాత్ అసెంబ్లీలో బలం పెరగడం ద్వారా కూడా బీజేపీకి అదనపు సీట్లు కలిసి వస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ కు తెలంగాణలో గెలుపుతో రెండు సీట్లు కలిసి వస్తున్నాయి. కానీ బిహార్, వెస్ట్ బెంగాల్ ల నుంచి కాంగ్రెస్ రెండు సీట్లను కోల్పోనుంది. కర్ణాటకలో విజయంతో మూడు రాజ్యసభ స్థానాలు కలిసి రానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఏకైక స్థానాన్ని కోల్పోనుంది. దాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. స్థూలంగా కాంగ్రెస్ కు లాభనష్టాల్లో పెద్ద తేడా లేదు. బీజేపీ మాత్రం అదనంగా ఆరు సీట్లను పొందనుంది. ఈ ఎన్నికకు ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ రానుంది, ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.