సార్వత్రిక ఎన్నికల ముందు.. అసెంబ్లీ కోటాలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం అసెంబ్లీలో బలాబలాలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లనూ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైన ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని రాజ్యసభలో జీరోగా మారుస్తున్నాయి. రాజ్యసభలో అధికారికంగా కనకమేడల ఒక్కరే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన పదవీ కాలం కూడా ఏప్రిల్ రెండుతో ముగుస్తోంది. తద్వారా టీడీపీ రాజ్యసభలో జీరో కానుంది.
అయితే చింత చచ్చినా పులుపు చావనట్టుగా రాజ్యసభలో ఇప్పుడు ప్రాతినిధ్యం సంపాదించుకునే అవకాశం లేని నేపథ్యంలో కూడా టీడీపీ తన అభ్యర్థిని అయితే బరిలోకి దింపనుందని తెలుస్తోంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం.. ఒక్క రాజ్యసభ సీటును పొందాలన్నా 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో దక్కింది 23 మంది ఎమ్మెల్యేలు. వారిలో రెబల్స్ తదితరులు పోనూ ఇప్పుడు టీడీపీ బలం 18 వరకూ ఉంది. మరి 44 మంది ఎమ్మెల్యేల మద్దతుకు టీడీపీ చాలా దూరంలో ఉంది!
అయితే ఇటీవల అభ్యర్థుల ప్రకటనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పలువురు అసంతృప్తులు సహజంగానే తయారయ్యే అవకాశం ఉంది. మరి అలాంటి వారందరికీ ఒక రేటు కట్టడమో, లేదా టికెట్ హామీనో ఇస్తే తెలుగుదేశం పార్టీ పాచిక విసిరే అవకాశం ఉంటుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇది వరకే నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు వెళ్లారు. వారిపై అనర్హత వేటు కత్తి వెంటాడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. టీడీపీకీ వారిపై ఆశలు లేనట్టే! అయితే ఇటీవల పలువురు సిట్టింగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. వారి సంఖ్య సుమారుగానే ఉంది! మరి అలాంటి వారందరినీ తెలుగుదేశం పార్టీ తన వైపుకు తిప్పుకునేందుకు శతాథా ప్రయత్నించవచ్చు! అందునా ఇలాంటి రాజకీయాల్లో చంద్రబాబు తలపండిన వ్యక్తి!.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాల్లో, అదే రాజకీయం అనుకునే వారిలో చంద్రబాబుకు మించిన వ్యక్తి ఇప్పుడు దేశ రాజకీయంలోనే లేరు. కాబట్టి ఆయన తనకు అలవాటైన ఆ రాజకీయాన్ని మరోసారి చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు!