ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రుల సీట్లకు చెక్ పెట్టే యోచనలో తెలుగుదేశం అధినాయకత్వం ఉందా అంటే ప్రచారం ఆ స్థాయిలో సాగుతోంది. మాజీ మంత్రులుగా టీడీపీకి విధేయులుగా ఉన్న కిమిడి కళా వెంకటరరావు ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు మీద ఆశలు పెంచుకున్నారు. అక్కడ తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు.
అయితే ఆ సీటుని జనసేనకు ఇస్తారని తాజా సమాచారం. టీడీపీలో రెండు వర్గాలు ఇక్కడ సీటు కోసం ఫైట్ చేస్తున్నాయి. మధ్యేమార్గంగానూ జనసేన కోరిక మేరకు ఈ సీటు గాజు గ్లాస్ ఖాతాలోనికి వెళ్లబోతోంది అంటున్నారు. దాంతో కళా వర్గం డీలా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
అదే విధంగా పలాస సీటు కూడా మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం నుంచి చేజారనుంది అని ప్రచారం ఉంది. ఈ సీటులో 2009, 2014లలో గౌతు శ్యామ సుందర శివాజీ పోటీ చేశారు. 2019లో ఆయన రాజకీయ వారసురాలిగా గౌతు శిరీష పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2024లో ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నా గ్రాఫ్ బాగాలేదని అంటున్నారు.
దాంతో జనసేనకు ఈ సీటు ఇస్తారని చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు ఇక్కడ పవన్ ప్రచారం చేసి ఈ సీటు మీద గురి పెట్టారు. ఇప్పుడు జనసేన ఆశలు నెరవెరబోతున్నాయని అంటున్నారు. అదే జరిగితే శిరీష ప్రత్యక్ష ఎన్నికల రాజకీయం అన్నది ఆగినట్లేనా అన్నది ఆమె వర్గంలో కలవరం రేపుతోంది అంటున్నారు.
మరో సీటు రాజాంని కూడా జనసేనకు ఇస్తున్నారు అని అంటున్నారు ఈ సీటు నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు టీడీపీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సీటుని జనసేన కోరుతోంది అని తెలుస్తోంది. ఇక్కడ కూడా టీడీపీలో వర్గ పోరు ఉంది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ ఇదే సీటు కోరుతున్నారు. దాంతో మధ్యేమార్గంగా జనసేనకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు. ఇలా మాజీ మంత్రులు ఆశలు పెట్టుకున సీట్లు గాజు గ్లాస్ పార్టీకి ఇవ్వబోతున్నారు అని ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది.