‘కొరటాల’కు కష్టకాలం

కాపీ కొట్టినంత సులువు కాదు, తన సృజనను కాపీ కొట్టారని నిరూపించడం. కానీ శరత్ చంద్ర అనే ఆ రచయిత మాత్రం పట్టు వదలకుండా పోరాడుకుంటూ వస్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా, డబ్బు కాదు ముఖ్యం,…

కాపీ కొట్టినంత సులువు కాదు, తన సృజనను కాపీ కొట్టారని నిరూపించడం. కానీ శరత్ చంద్ర అనే ఆ రచయిత మాత్రం పట్టు వదలకుండా పోరాడుకుంటూ వస్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా, డబ్బు కాదు ముఖ్యం, పేరు ముఖ్యం, క్రెడిట్ కీలకం అని పట్టుదలగా పోరాడారు. శ్రీమంతుడు సినిమా సంగతే ఇదంతా. స్వాతి పత్రికలో అనుబంధ నవలగా వచ్చిన తన రచనను కాపీ కొట్టేసి దర్శకుడు కొరటాల శివ శ్రీమంతుడు సినిమా తీసారని శరత్ చంద్ర ఆరొపించారు.

అప్పట్లో తొలిసారిగా ఈ ఉదంతాన్ని ‘గ్రేట్ ఆంధ్ర’ వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఆ రచయిత పోరాడుతూనే వున్నారు. ఆఖరికి కోర్టులో విజయం సాధించారు. అక్కడితో ఆగకుండా కొరటాల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోరాటం సాగించారు. దానికి కోర్టు అనుమతి లభించింది.

కానీ దాని మీద దర్శకుడు కొరటాల సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే ఇప్పుడు దాని మీద తీర్పు వచ్చింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందే అంటూ తీర్పు చెప్పడంతో, ఇప్పుడు ఇక్కడి పోలీసులు ఆ మేరకు ముందుకు వెళ్తారు. క్రిమినల్ కేసు నమోదు అయితే జరిగే పర్యవసానాలను కూడా కొరటాల ఎదుర్కోవలసి వుంటుంది.

ఇది చూసి అయినా కాపీ తమ హక్కు అనుకునే దర్శకులు కాస్త మారాలి. నవలల్లో పాయింట్లు తీసుకుని, వాటిలోని పాత్రలను మగ, ఆడ మార్చేసి, పల్లెను పట్నం చేసి, ఇలా రకరకాలుగా మార్చి, తమది వేరు, వాళ్లది వేరు అనిపించుకుని కాపీ కొట్టేసే వాళ్లు ఇకనైనా జాగ్రత్త పడాలి. అందరూ కోర్టు మెట్లు ఎక్కలేకపోవచ్చు. లేదా ఎక్కినా కొస వరకు పోరాడలేకపోవచ్చు. కానీ కొందరయినా శరత్ చంద్రలు వుంటారు.