తెలంగాణలో విపక్ష భారత రాష్ట్ర సమితికి ప్రమాద ఘంటికలు మోగడం షురూ అయినట్టుగానే కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని, వందరోజుల్లోగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి చూపించకపోతే.. ఆ ప్రభుత్వాన్ని బొంద పెట్టి తీరుతామని ఒక వైపు గులాబీ అగ్ర నాయకులు హెచ్చరిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత.. భారాసనుంచి కాంగ్ర్రెసులోకి భారీగా వలసలు ఉంటాయని మరోవైపు అధికార పార్టీ నాయకులు అంటున్నారు. మరి ఈ రెండు పార్టీల వారు చెబుతున్న గడువులకు కూడా అర్థం లేకుండా పోయేట్లుంది.
ఈలోగానే భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వలసలు వచ్చే పర్వం పూర్తయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ ను ఆయన నివాసంలో కలవడం, ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి మరీ సత్కరించడం గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
2018 ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను గంపగుత్తగా తమలో కలిపేసుకుని, కాంగ్రెసు పార్టీని మళ్లీ లేవలేని స్థాయికి దెబ్బకొట్టేశాం అని గులాబీదళం సంబరపడింది. అయిదేళ్లలో ఆ పార్టీ తిరిగి కోలుకున్నదో లేదా, గులాబీ అహంకారాన్ని భరించలేక ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయంగా వారినే ఎంచుకున్నారో తెలియదుగానీ.. మొత్తానికి గద్దెమీదకు వచ్చారు. 2018లో భారాస చేసిన పనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారని అనుకోవడం భ్రమ.
అయితే కాంగ్రెస్ ముందుగా మునిసిపాలిటీల మీద ఫోకస్ పెడుతూ.. ఇప్పటికే చాలా వాటిని హస్తగతం చేసుకుంది. ఎమ్మెల్యేల చేరికలు రెండో దశలో ఉటాయని అంతా భావించారు. కాంగ్రెస్ మంత్రుల మాటల్ని బట్టి.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉండవచ్చునని అనుకున్నారు. అయితే మంతనాలు ఇప్పుడే జరుగుతున్నాయి. స్పష్టమైన సంకేతాలు కూడా వస్తున్నాయి.
ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు భారాస ఎమ్మెల్యేలు వెళ్లి రేవంత్ ను కలిసి వచ్చారు. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి.. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని.. పార్టీ మారేది లేదని సెలవిచ్చారు. కానీ ప్రజల్లో అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ ను ఆయన ఇంట్లో కలిశారు. పార్టీ కండువా కూడా కప్పించుకున్నారు. అయినా సరే.. ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం లేదని, కాంగ్రెసులో చేరినట్టు వస్తున్న వార్తలు నిజం కాదని అంటున్నారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫునే గెలిచారు. అప్పట్లో కేసీఆర్ లోబరచుకుని భారాసలో చేర్చుకున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీ పరంగా పాతమిత్రుడే లెక్క. 2018, 2023 ఎన్నికల్లో భారాస తరఫున గెలిచిన ఆయన ఇప్పుడు పార్టీ మారుతుండడం దాదాపుగా ఖరారైనట్లేనని అనుచరులు చెబుతున్నారు.