ఇన్ని గెంతులు వేస్తున్నా.. ప్రజల గౌరవం ఎలా?

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు.. ఇంత తరచుగా తన స్టాండ్ మార్చుకుంటూ ఉండడం.. తిట్టిన వారిని వాటేసుకోవడం, మళ్లీ…

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు.. ఇంత తరచుగా తన స్టాండ్ మార్చుకుంటూ ఉండడం.. తిట్టిన వారిని వాటేసుకోవడం, మళ్లీ దూరం జరగడం, మళ్లీ వాటేసుకోవడం.. ఇన్ని రకాలుగా గెంతులు వేయడం అనేది మరొకరి విషయంలో మనం చూడలేం. వారి భావజాలాలు ఎలాగైనా ఉండవచ్చు గానీ.. నిజాయితీగా ఉన్నంతవరకు, ప్రజలకోసం వంచనలేకుండా పనిచేస్తున్నంత వరకు, ఒక స్థిరత్వం లేకుండా ఎన్ని గెంతులు వేస్తున్నా సరే.. ప్రజలు గౌరవిస్తూనే ఉంటారా? ఆదరిస్తూనే ఉంటారా? అనే అభిప్రాయం కలుగుతోంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాజాగా తన జీవితంలో తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేయడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. బీహార్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఒక రకంగా బయటినుంచి చూసినప్పుడు కంపరం కలిగిస్తాయి. బీహార్ ముఖ్యమంత్రి తరచుగా జాతీయ స్థాయి రాజకీయ కూటముల్లో ఒకదాని నుంచి మరొకదానిలోకి విచ్చలవిడిగా మారిపోతున్నారు.

ప్రస్తుతానికి బిజెపి ఎన్డీయే జట్టులో చేరి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. దేశంలో ఎక్కడా కూడా కాంగ్రెసు పార్టీ లేనేలేదని ఈ సందర్భంగా ఆయన సెలవిచ్చారు. ఇలా ఏ గొడుగు కిందకు చేరితే ఆ పాట పాడడం అనేది నితీశ్ కుమార్ కు కొత్త సంగతి కాదు. అందులో ఆయన ఆరితేరిపోయారు.

గతంలో నితీశ్ ఎన్డీయేలోనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. మోడీ ప్రధాని కాక ముందు నుంచి అక్కడే ఉన్నారు. ఆ కూటమి తరఫున మోడీ కాకపోతే.. ప్రధాని అభ్యర్థిగా తగిన భాజపాయేతర నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ ప్రధాని అయిన వైనం జీర్ణించుకోలేదు. ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. తర్వాత మళ్లీ ఎన్డీయే మద్దతుతోనే ఆయన బీహార్ లో తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు.

కానీ 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనకు ఆ కూటమి మీద విరక్తి పుట్టింది. లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీని ఉపముఖ్యమంత్రిగా చేసి.. వారి పార్టీ మద్దతు తీసుకుని మహాఘటబంధన్ లో భాగమై ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. అదొక్కటే కాదు.. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడడంలో చాలా కీలక భూమిక పోషించారు. మోడీ సర్కారును కూలదోయాల్సిన అవసరం దేశానికి చాలా ఉన్నదని కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగారు. రాహుల్ ను ప్రధాని చేయాల్సిందేనని వారి భజన చేశారు. అన్ని పార్టీలను ఒక్కటి చేశారు. కానీ ఇప్పుడు వారి మీద అలిగారు.

ఇండియా కూటమి కన్వీనర్ గా మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసిన నాటినుంచి నితీశ్ అలకమీద ఉన్నారనే ప్రచారం ఉంది. నిజానికి ఇండియా అని పేరు పెట్టిన నాడే ఆయనలో అలక మొదలైందనే వాదన కూడా ఉంది. నిజానికి ఈ అలకలే కారణమో లేదా, బీహార్లో తన ముఖ్యమంత్రి పీఠానికి ఈ మహాఘటబంధన్ పార్టీలే ప్రమాదంగా మారుతాయని అనుకున్నారో తెలియదు గానీ.. అక్కడినుంచి బయటకు వచ్చి.. మళ్లీ బిజెపి మద్దతు తీసుకున్నారు. సీఎం అయ్యారు.

ఇన్నిసార్లు అటూ ఇటూ గెంతుతున్నా.. తమాషా ఏంటంటే, ఆ రాష్ట్రంలో ప్రజలు తమ ముఖ్యమంత్రిని ఛీత్కరించుకోవడం లేదు. తనవరకు అవినీతి మరకలు లేని పరిపాలన అందిస్తుండడమే అందుకు కారణం అయి ఉండవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. రాజకీయ గెంతులు ఎలా ఉన్నా.. స్వార్థ ప్రయోజనాలు కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేసే నేత కావడం వల్లనే ప్రజలు మన్నిస్తున్నారనే వాదన కూడా ఉంది.