Advertisement

Advertisement


Home > Politics - Opinion

‘సిద్ధం..’ నిజమేనా?

‘సిద్ధం..’ నిజమేనా?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఒకరకంగా నిజమే. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీల కంటె ముందుగా ఆయన పూర్తిచేశారు. కానీ నిజంగానే సిద్ధంగా ఉన్నారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న!

తాను సిద్ధం అని జగన్ అంటున్నారు సరే.. మిగిలిన పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? జగన్ వ్యూహాల పర్యవసానంగా విపక్షాలు కూడా ఆయన బాటలోనే అనివార్యంగా నడవాల్సిన పరిస్థితి ఉన్నదా? అనేది కీలకమైన చర్చనీయాంశం. వర్తమాన రాజకీయ స్థితిగతుల విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సిద్ధం.. నిజమేనా?’!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఇంకా సుమారు మూడునెలల దూరంలో ఉండగా.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొత్తం దాదాపుగా పూర్తిచేసేసి ‘యుద్ధానికి సిద్ధం’ అంటూ అధికారిక ప్రకట‌న చేయడం, ఆ మేరకు వాల్ పోస్టరును కూడా విడుదల చేయడం అనేది చిన్న సంగతి కాదు. ఇది జగన్ దూకుడుకు నిదర్శనం. తమ ప్రభుత్వం చేపడుతున్న అపరిమితమైన సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తనను మళ్లీ గెలిపిస్తాయనే ఆత్మవిశ్వాసానికి ఇది తార్కాణమా? పార్టీ తరఫున ఎవరిని పోటీచేయించినా గెలిచి తీరుతాం గనుక.. సామాజికవర్గాల సమతూకం పాటించి, సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక చేపడితే.. పార్టీకి అన్ని వర్గాల్లోనూ సమానమైన ఆదరణ, స్థిరమైన భవిష్యత్తు ఉంటాయనే వ్యూహమా? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది.

కారణాలు ఏవైనా కావొచ్చు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థుల కంటె చాలా అడుగులు ముందుగానే ఉన్నారు. ఏపీలో ఉన్న ఇతర రాజకీయ పక్షాలు ఏవీ ఈ స్థాయిలో కాదు కదా.. ఇందులో నాలుగోవంతు సంసిద్ధతతో కూడా ఇప్పటిదాకా లేవు. సోదిలో ఉండనిపార్టీలు కాంగ్రెస్, బిజెపి ఇప్పుడే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తుల సేకరణ ప్రహసనాన్ని ప్రారంభించాయి. జగన్ ను మట్టి కరిపించి అధికారంలోకి రాబోయేది తామే అని విర్రవీగుతున్న తెలుగుదేశం- జనసేన తమ మధ్య సీట్ల పంచాయతీ తేల్చుకోలేని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఇప్పుడిప్పుడే ఆ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొట్లాటలు షురూ అవుతున్నాయి. ముందు ఈ కొట్లాటలు ఒక కొలిక్కి రావాలి. ఏ సీట్లు ఎవరికో తేల్చుకోవాలి! అసలక్కడ వారికి అభ్యర్థులు ఉన్నారో లేదో.. అభ్యర్థులు  ఎక్కువైపోయారో.. వారి మధ్య ఎన్నిరకాల కొత్త రచ్చలు పుడతాయో అన్నీ తేలాలి. ఆ తర్వాత గానీ వారు ఎన్నికలకు సన్నద్ధం కావడం జరగదు. ఆ రకంగా చూస్తే.. తన నిర్ణయాలను నిర్మొగమాటంగా ప్రకటించేస్తూ, ఉండేవారు ఉంటారు పోయేవారు పోతారు అనే నిర్లిప్త ధోరణిని ప్రదర్శిస్తూ, పార్టీలో మిగిలిన వారే మనవారు అనుకునే తాత్విక దృక్పథంతో ముందుకు సాగుతున్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టే, లేదా, అవుతున్నట్టే అనుకోవాలి.

ఇక్కడ ఇంకో సంగతి కీలకంగా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం అయిన తీరు.. ఇతర పార్టీలకు అనుసరణీయమైనదిగా మారుతోంది. అలా అని చెప్పుకోవడానికి వారి వారి ఈగోలు దెబ్బతినవచ్చు గానీ.. అంతిమంగా వారందరూ కూడా జగన్ బాటలో నడవాల్సిందే. 

జగన్ పథకాలను కాదనలేని దైన్య స్థితి!

అధికారంలోకి రావాలని కలలుకంటున్న తెదేపా-జనసేన ఇప్పుడు విచిత్రమైన స్థితిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదని పొద్దస్తమానం బురద చల్లుతూ గడిపేస్తున్న ఈ పార్టీల నాయకులు.. జగన్ ముద్ర ఉన్న పథకాలలో ఏ ఒక్కదానిని కూడా తప్పుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఏ ఒక్క వ్యవస్థను కూడా తప్పుపట్టే ధైర్యం చేయలేకపోతున్నారు.

పెన్షన్లు అనేవి.. ఒకటోతేదీ ఉదయం నుంచి వాలంటీరు మన ఇంటికి వచ్చి నిద్దురలేపి, తలుపు తట్టి మరీ చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోతున్నారు. రేషన్ సరుకులు అర్ములైన ప్రతి ఇంటి ముంగిటకు వచ్చి.. వారి వంటగదిలోకి చేరుతున్నాయి. ఏ నిరుపేద కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బంది వలన నిరాశకు గురయ్యే పరిస్థితి లేని వాతావరణం అనేక పథకాలు కల్పిస్తున్నాయి.

తమాషా ఏంటంటే.. జగన్ ను విపక్ష నేతలు బహుధా దూషిస్తారు. కానీ.. ఆయన చేస్తున్న పనుల్లో ఏ ఒక్కదానిని కూడా పల్లెత్తు మాట అనలేరు. దానిని మారుస్తాం అనే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు. ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అలాగే కొనసాగతాయి .. అని పరోక్షంగా జగన్ కు జై కొడితే తప్ప.. మనుగడ లేదని వారికి అర్థమైపోయింది. అందుకే చంద్రబాబు అదే మాటలు అంటున్నారు.

ఫరెగ్జాంపుల్, తెలంగాణలో పూర్తయిన ఎన్నికల సంగతి చూద్దాం. అక్కడి పాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అనుకున్న నిర్ణయాల్లో ధరణి పోర్టల్ ఒకటి. దానిద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని వారు చాటుకుంటూ వచ్చారు. వారితో ఎన్నికల్లో తలపడిన కాంగ్రెసు పార్టీ ప్రధానంగా ధరణి మీదనే దాడి సాగించింది. అది లోపభూయిష్టం అని దమ్ముగా చెప్పగలిగింది.

తాము అధికారంలోకి వస్తే సమూలంగా మార్పుచేర్పులు చేస్తాం అని చెప్పగలిగింది. ప్రజలను నమ్మించింది. అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా.. జగన్ నిర్ణయాలలో ఏ ఒక్కదానినైనా తప్పుబట్టి, తాము అధికారంలోకి రాగానే దానిని మార్చేస్తాం, తొలగిస్తాం అని చెప్పగల స్థితిలో ప్రతిపక్షాలు లేవు. ఒకవేళ వారి మదిలో ఏదైనా ఒకటీ అరా అంశాలు అలాంటివి ఉన్నప్పటికీ ఆ మాట బయటకు చెబితే.. విపక్షాలు అధికారంలోకి రాగానే జగన్ పథకాలు అన్నీ తొలగించేస్తారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి.. మొత్తానికి పుట్టి మునుగుతుందనే భయం వారిలో హెచ్చుగా ఉంది.

అంటే ఏమిటన్న మాట.. జగన్ బాటలోనే నడవడానికి, కాకపోతే ఆయన మీద బురద చల్లడం ద్వారా అధికారం లాక్కోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నమాట. పచ్చమీడియా బలుపుతో వక్ర వ్యూహాలను అనుసరిస్తున్నాయన్నమాట!

సామాజిక న్యాయం ఇది కదా!

గెలుపుమీద నమ్మకం ఉంది. అభ్యర్థుల బలాలకంటె పార్టీ బలమే కీలకం అనే విశ్వాసం ఉంది. అలాగని ప్రతి ఒక్క సిటింగ్ అభ్యర్థిని మార్చేయాలనే దూకుడు లేదు. సర్వేల ఆధారంగా స్థానిక సమీకరణాలు, సామాజిక సమీకరణాలు ప్రధానంగా పరిగణిస్తూ జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తుది జాబితాలు సిద్ధమయ్యే సమయానికి సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం వైఎస్సార్ కాంగ్రెస్ తీరులో కనిపించబోతున్నదనే విశ్లేషణలు సాగుతున్నాయి. అంతకంటె మిన్నగా గమనించాల్సింది ఏంటంటే.. ప్రతిపక్షాలు కూడా ఒంటెత్తు పోకడలకు పోకుండా, జగన్ బాటలోనే.. సామాజికన్యాయం పాటిస్తూ తమకు అలవాటు లేని సమీకరణాలను అనుసరించాల్సి ఉంటుంది.

ఒక్క ఉదాహరణ గమనిద్దాం. నరసరావు పేట ఎంపీ స్థానం ఉంది. ఆ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీ సీటు వైసీపీ చేతిలో ఉంది. ఇటీవలే పార్టీకి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమ్మవారికి 2, రెడ్డి వర్గానికి 3, కాపులకు 2 సీట్లు కేటాయించింది. అదే సమయంలో తెలుగుదేశం సమీకరణాలను పరిశీలిస్తే.. కమ్మవారికి 5, రెడ్డి వర్గానికి 1, కాపులకు 1 ఇచ్చేలా సిద్ధం చేసుకున్నారు.

నిజానికి ఈ పార్లమెంటు పరిధిలో బీసీలకు అవకాశం కల్పించడానికి ఏ సెగ్మెంటులోనూ కుదరలేదు. కేవలం ఆ ఒక్క కారణంతోనే.. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎంపీ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని అనుకున్నారు. ఇంతకంటె సామాజిక న్యాయం పాటించడం మరెక్కడ ఉంటుంది. అసెంబ్లీ సీట్లలో అవకాశం లేదు గనుక.. బీసీలకు పార్లమెంటును కట్టబెడుతున్నారు. తెదేపాలో ఒకే కులానికి 7లో 5 సీట్లు కట్టబెడుతున్న తీరు సామాజిక న్యాయం అని ఎలా అనిపించుకుంటుంది? ఈ నియోజకవర్గంలో కులాల సమతూకం గురించి జగన్ తాను ఇచ్చిన ప్రాధాన్యాలను ఉదాహరిస్తూ మాట్లాడడం మొదలెడితే.. తెలుగుదేశం ఏం జవాబు చెప్పగలుగుతుంది? అందుకే వారు కూడా కులాల సమతూకం విషయంలో జగన్ బాటను అనుసరించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

కేవలం బీసీ వర్గానికి అక్కడ పెద్దపీట వేయడం కోసమే లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నియోజకవర్గానికి మారాల్సిందిగా జగన్ కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. జగన్ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ పార్లమెంటు పరిధిలోని కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ను కలిసి.. లావును నరసరావుపేటలోనే కొనసాగించాలని, ఆయనను మారిస్తే తమ ఎమ్మెల్యే విజయావకాశాలపై ప్రభాపవం పడుతుందని మొరపెట్టుకున్నా కూడా జగన్ పట్టించుకోలేదంటే.. ఆయన సామాజిక న్యాయానికి, కులాల సమతూకానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో.. అదే సమయంలో, వ్యక్తుల కారణంగా కాదు.. పార్టీ పరిపాలన కారణంగా మనం గెలవబోతున్నాం అనే నమ్మకంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. 

ఆర్థిక అర్హతలు పరిమితమే!

పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆశావహుల ఆర్థిక వనరులకు, ధనబలానికి పెద్దపీట వేస్తుంటారనే ఒక ప్రచారం నడుస్తూ ఉంటుంది. రాజకీయం ఎన్నికల స్వరూప స్వభావాలే రూపురేఖలు పూర్తిగా మారిపోయిన ఇవాళ్టి రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏమాత్రం ఆర్థిక వనరులు లేని నిరుపేదల్ని మోహరించి నెగ్గడం సాధ్యం అవుతుందా? ఊహించగలమా? అనేది ప్రశ్న. ఇతర పార్టీలు ఏమైనా పార్టీ టికెట్లను పప్పులుబెల్లాలు పంచినట్లుగా పంచిపెడుతున్నాయా? అనేది మరో ప్రశ్న!

ఏ పార్టీ అయినా సరే.. ఆర్థికంగా బలంగా ఉండి, ఎన్నికల బరిలో ఖర్చు పెట్టుకోగలడు అనిపించే వారిని మాత్రమే ఎంపిక చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ టికెట్ కోరుతున్న వారిని ముందుగానే 20 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ గా డిపాజిట్ చేస్తే తర్వాత పరిశీలిస్తామని చెబుతున్నట్టుగా కూడా గుసగుసలు ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఆర్థిక బలాబలాలను పరిగణనలోకి తీసుకోవడం అబద్ధమూ ఆశ్చర్యకరమూ కాదు. కానీ.. కేవలం అదొక్కటే ప్రాతిపదిక కాకుండా.. జగన్ పూర్తిగా ప్రజాబలం, సామాజిక సమీకరణాల మీదనే ఆధారపడుతున్నారనే మాట వాస్తవం. ఆ మాటకొస్తే.. జగన్ అభ్యర్థుల ఎంపికను కాస్త లోతుగా, సానుకూల దృక్పథంతో పరిశీలిస్తే గనుక.. ఆయన ఎంపికలో ఆర్థిక బలం అనేది చిట్టచివరి అర్హత మాత్రమే అనే సంగతి మనకు బోధపడుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంటిలో ఉండే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. ఆ విషయాన్ని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటోంది. జగన్ కూడా అలాంటి ధోరణి కనబరుస్తున్నారు. మడకశిరలో ఈర లక్కప్పను కేవలం ప్రజాదరణతోనే ఇవాళ పార్టీ ఇన్చార్జి అయ్యారు. ఆయన తెల్లరేషన్ కార్డున్న, కించిత్తు ఆస్తులు లేని ప్రజల మనిషి. అలాంటి వారిని జగన్ ఎంపిక చేయడం విశేషం. 

జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా ప్రత్యర్థులను ఒక రకంగా డిఫెన్స్ లోకి నెడుతున్నారు. ‘అభ్యర్థుల ఎంపిక పర్వం పూర్తయ్యే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలు సామాజిక వర్గాల సమీకరణాల పరంగా చక్కటి సమతూకంతో ఉంటుంది అనేది’ అందరూ అంచనా వేస్తున్న సంగతి. మిగిలిన పార్టీలు కూడా ఇదే పద్ధతిని విధిగా అవలంబించాల్సి ఉంటుంది. వారిని జగన్ అలాంటి అనివార్యమైన పరిస్థితుల్లోకి వెళుతున్నారు.

కులాల పరంగా అందరికీ, పేదలకూ న్యాయం చేయడంలో తమ పార్టీ మెరుగ్గా ఉన్నదని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటే ప్రత్యర్ధుల వద్ద కనీసం జవాబు ఉండాల్సిందే. తమకు నచ్చిన కులాలకు సీట్లు కట్టబెట్టు కుని మాటలతో మాయ చేయడానికి కుదరదు. కేవలం కులాలు మాత్రమే కాదు వైసిపి 175 స్థానాలకు ఎంపిక పూర్తి చేసేసరికి అందులో ఈర లక్కప్ప తరహాలో అనేకమంది నిరుపేదలు ఉండవచ్చు అనేది కూడా ఒక అంచనా. ఈ సమీకరణం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో ప్రజాదరణ చూరగొనడానికి దోహదం చేస్తుంది.

నిరుపేదలనైనా సరే అభ్యర్థులుగా మోహరించి గెలవగలను అనే ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ లో పుష్కలంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల కోసం తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీకి వన్నెతెస్తున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు తమలాంటి నిరుపేదను ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహరిస్తే తప్పకుండా ఆదరించి తీరుతారని జగన్ అంచనా వేస్తున్నారు. ప్రతిసారీ ప్రతిచోటా ధన బలం ఒక్కటే అభ్యర్థికి ప్రాతిపదిక అవుతుందనే నమ్మకం ఆయనకు లేదు. అందుకే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. అదే తరహా ప్రయోగాలకు విపక్ష పార్టీలు సిద్ధంగా లేవు. ఓట్లను కొనుగోలు చేసుకోవడం ద్వారా మాత్రమే నెగ్గగలమనే భావనతో ఉన్న పార్టీలు ఆర్థిక వనరులను ప్రాథమిక అర్హతగా పరిగణిస్తున్నారు.

విపక్ష పార్టీల ఈ బలహీనతను పక్కన పెడితే సామాజిక సమీకరణాల పరంగా వారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని బాటను అనుసరించి తేరాల్సిందే. వైయస్ఆర్సీపీ సమతూకానికి తగినట్లుగా తమ పార్టీలో టికెట్లు ఇవ్వకపోతే ఎన్నికల ప్రచారంలో జగన్ వైపు నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని తట్టుకోలేం అని వారికి తెలుసు. ఇన్నిరకాలుగా ప్రతిపక్షాలమీద పైచేయి సాధిస్తున్న నేపథ్యంలో యుద్ధానికి సిద్ధం అని వారు ప్రకటించుకుంటే ఆశ్చర్యం ఏముంది.

..ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?