తన తండ్రి హంతకులను శిక్షించాలని ఐదేళ్లుగా దివంగత మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అనేక పోరాటాలు చేస్తున్నారు. న్యాయ పోరాటం చేసే క్రమంలో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ ఐదేళ్లలో సునీతను పరామర్శించి, అండగా నిలవాలన్న ఆలోచన, స్పృహ షర్మిలకు లేకపోయింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి, తన అన్న వైఎస్ జగన్‌పై పోరాటం మొదలు పెట్టిన తర్వాతే సునీత గుర్తుకు రావడం విశేషం.
ఈ నేపథ్యంలో ఇవాళ ఇడుపులపాయలో దివంగత వైఎస్ ఘాట్ సాక్షిగా, జగన్ టార్గెట్‌గా షర్మిల, సునీత భేటీ కానున్నారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సునీత ఇప్పటి వరకూ జగన్‌పై బహిరంగ విమర్శలు చేయలేదు. తన తండ్రిని చంపిన నిందితుల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పాత్రల గురించి కోర్టులకు సమర్పించిన అఫిడవిట్లలో మాత్రమే పొందుపరిచారు.
అంతకు మించి ఆమె ఏనాడూ మీడియా ముందుకొచ్చి, వివాదాస్పద కామెంట్స్ చేయలేదు. కోర్టులో కేసు నడుస్తున్నందున బహిరంగంగా మాట్లాడనని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలో సునీత చేరి, కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా జరిగింది. అయితే రాజకీయాల్లోకి రావడానికి సునీత ఆసక్తిగా లేరని సమాచారం. ఈ క్రమంలో షర్మిల, సునీత భేటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే చర్చకు తెరలేచింది.
జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు సునీత చేయూతనిస్తారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే షర్మిలతో సునీతకు సన్నిహిత సంబంధాలు లేవని అంటున్నారు. షర్మిల తన ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి పెడుతుందని, అందుకే ఆమెతో కలవడానికి సునీత ఇష్టపడక పోవచ్చని వైఎస్ వివేకా అభిమానులు అంటున్నారు.
ఏది ఏమైనా జగన్‌ను గద్దె దించడానికి ఇడుపులపాయ కేంద్రంగా షర్మిల రాజకీయం చేయడం వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.