యువి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ సినిమా విశ్వంభర. మెగాస్టార్ నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి దర్శకుడు వశిష్ట. ఈ భారీ బడ్జెట్ సినిమా ఓవర్ సీస్ హక్కులు అమ్ముడైపోయాయి.
సినిమా ఈ మధ్యనే ప్రారంభమైంది. మెగాస్టార్ ఇంకా సెట్ మీదకు రాలేదు. ఇవ్వాళో రేపో సెట్ లోకి అడుగు పెడతారని వార్తలు వున్నాయి. అప్పుడే ఓవర్ సీస్ హక్కులకు గిరాకీ వచ్చింది. సరిగమ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ హక్కులు తీసుకుంది.
విశ్వంభర ఓవర్ సీస్ హక్కులను 18 కోట్లకు సరిగమ సంస్థ తీసుకుంది. ఇది మంచి రేటు కిందే లెక్క. సీనియర్ హీరోల సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ అంతగా లేదు. మెగాస్టార్ చిరంజీవి దీనికి కొంత వరకు మినహాయింపు. పైగా యువి సంస్థ భారీగా నిర్మిస్తున్న సినిమా అన్న ట్యాగ్ లైన్ కూడా కలిసి వచ్చింది.
ఈ సినిమా షూట్ ఈ నెల నుంచి చకచకా జరుగుతుందని, 2025 సంక్రాంతికి విడుదల అన్నది టార్గెట్ అని వార్తలు వున్నాయి. సిజి వర్క్ చాలా ఎక్కువ వుందీ సినిమాకు. అందువల్ల టార్గెట్ రీచ్ కావాలంటే చాలా తీవ్రంగా వర్క్ చేయాల్సి వుంటుంది.