పవన్ తో బంధంపై అప్పుడే మొహం మొత్తిందా?

గత ఎన్నికల సమయానికి బంధం లేదు. తర్వాత బంధం ఏర్పడింది. కానీ కలిసి వేసిన అడుగులు మాత్రం లేవు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ వారికి గొప్పగా కనిపించారు. ఆయనతో…

గత ఎన్నికల సమయానికి బంధం లేదు. తర్వాత బంధం ఏర్పడింది. కానీ కలిసి వేసిన అడుగులు మాత్రం లేవు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ వారికి గొప్పగా కనిపించారు. ఆయనతో కలిసి పోటీచేయాలని ఉబలాటపడ్డారు. ఆయనతో తమ అభ్యర్థులకు కూడా ప్రచారం చేయించుకోవాలని ఆరాటపడ్డారు. ఆయనతో పొత్తులు పెట్టుకున్నారు. సీట్లు పంచారు. కానీ ఫలితం మాత్రం లేదు.

తీరా రెండు నెలలు కూడా గడవక ముందే.. పవన్ కల్యాణ్ తో కలిసి నడవడం వేస్ట్, ఆయనతో బంధం యూజ్ లెస్ అనే నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ రాజకీయాల వర్తమాన పరిస్థితి ఇది. ఈ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని, ఎలాంటి పొత్తులు ఉండవని ఆ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ తేల్చి చెప్పేశారు.

జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఆయన పరువు తీసే వ్యవహారం ఇది. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమిలో చేరిపోయి.. నేను మోడీ జట్టులో భాగస్వామిని అని ప్రతిసారీ పవన్ రొమ్ము విరుచుకుని చెప్పుకుంటూ ఉండేవారు గానీ.. తెలంగాణలో ఆ పార్టీ ఆయనను ఎన్నడూ ఖాతరు చేయలేదు. పైగా పవన్ తో పొత్తులు ఏపీ వరకే పరిమితం అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు.

తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు.. పవన్ ఫ్యాక్టర్ తమకు లాభిస్తుందని అనుకున్నారేమో.. హఠాత్తుగా పొత్తులు పెట్టుకున్నారు. కమల నేతలు ఆయన ఇంటికి వెళ్లి డీల్ కుదుర్చుకున్నారు. 119లో 30 సీట్లు కావాలని బేరం ప్రారంభించిన పవన్, చివరికి మరీ ఘోరంగా 8 సీట్లు పుచ్చుకుని బరిలోకి పార్టీని దింపారు. ఆయనతో బంధం, భాజపా గెలిచిన 8 సీట్లలో వారికి ఏమేరకు లాభించిందో తెలియదు. కానీ.. పవన్ జనసేన పోటీచేసిన 8 సీట్లలో ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది.

అప్పటికి గానీ.. ఆయన సొంత బలం మీద కమలదళానికి క్లారిటీ వచ్చినట్టు లేదు. రెండు నెలలు గడవకముందే ఆ బంధానికి కటీఫ్ చెప్పేశారు. ఎంపీ ఎన్నికలకు పవన్ ను పక్కన పెట్టేస్తున్నారు. ఒకవైపు ఏపీలో చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి తనకు తోడుగా కమలనేతలను కూడా జట్టులోకి తీసుకోవాలని పవన్ ఆరాటపడుతూ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ కే విలువలేదనే స్పష్టతతో కమలదళం తమ సొంత రాజకీయం తాము చేసుకుంటోంది. తెలంగాణలో ఈ అవమానాన్ని పవన్ ఎలా స్వీకరిస్తారో చూడాలి. లేదా, మమ్మల్ని వాళ్లు గెంటేయడంలో ఒక వ్యూహం ఉంటుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారో ఏమో చూడాలి.