చంద్రబాబునాయుడి తీవ్రమైన నాన్చివేత ధోరణితో టీడీపీ నేతలు విసుగ్గా ఉన్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థులను జగన్ వేగంగా ప్రకటిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగడుతున్నారు. ఈ పరిస్థితి టీడీపీలో కనిపించడం లేదు. పైగా టీడీపీలో చాలా నియోజకవర్గాల్లో బహు నాయకత్వం వుంది. టికెట్ ఎవరికి వస్తుందో చెప్పలేని అయోమయం.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఓపిక నశించి తనకు తానే అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు, ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా తన పేరుతో పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లను పట్టణమంతా అంటించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ఆయన వాల్‌పోస్టర్లను అంటించడంతో మిగిలిన నేతల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తోంది.
ప్రొద్దుటూరు టికెట్‌ను మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్‌నాయుడు తదితరులు ఆశిస్తున్నారు. ఈ మేరకు వాళ్లంతా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ప్రవీణ్ ఏకపక్షంగా తనకు తానుగా అభ్యర్థిగా ప్రకటించుకుని విస్తృతంగా ప్రచారం చేసుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. తమకు టికెట్ దక్కకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవీణ్‌ను ఓడించి తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు తీవ్ర జాప్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి నష్టం వాటిల్లుతోందన్న ఆందోళన నెలకుంది. మారిన రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు చంద్రబాబు మారకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందన్న ఆవేదన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇలా ఒకర్ని చూసి మరొకరు అభ్యర్థులుగా తామంటే తామని ప్రకటించుకుని, చివరికి దక్కకపోతే పార్టీకి వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతారనే మాట వినిపిస్తోంది.