ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆశలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పురందేశ్వరి కోరిక. జనసేనతో ఇప్పటికీ పొత్తులో ఉన్నట్టు పురందేశ్వరి చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ-జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంటే పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందొచ్చని కొంత మంది బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
కానీ టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ జాతీయ నాయకత్వం ససేమిరా అంటోంది. ఈ విషయాన్ని పురందేశ్వరే చెప్పడం విశేషం. పొత్తుల గురించి ఎవరైనా ముందుకొస్తే మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నట్టు ఏపీ వ్యవహారాల బీజేపీ ఇన్‌చార్జ్ శివప్రకాశ్ అన్నట్టు ఆమె తెలిపారు. అయితే పొత్తు గురించి తమతో మాట్లాడ్డానికి ఎవరూ రాలేదని ఆయన చెప్పడం గమనార్హం. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని శివప్రకాశ్ తమకు దిశానిర్దేశం చేసినట్టు పురందేశ్వరి వెల్లడించడం చర్చనీయాంశమైంది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ఎక్కువ సమయం కూడా లేదు. ఇప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి టీడీపీ నుంచి సరైన ప్రతిపాదన రాలేదని చెప్పడం గమనార్హం. బీజేపీతో కలిసి వెళ్లడానికి జనసేన ఇష్టపడరు. ఎందుకంటే బీజేపీతో పొత్తులో వెళితే ఎన్నికల్లో గెలవలేమనేది ఆయన భయం.
టీడీపీతో కలిసి వెళ్తేనే కనీసం తానైనా అసెంబ్లీలో అడుగు పెట్టగలనని పవన్ నమ్ముతున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు పొత్తుపై మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం, మరోవైపు ఆ దిశగా ఎవరూ ముందుకు రాలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే పురందేశ్వరి, అలాగే చంద్రబాబు అనుకూల నేతలకు గట్టి షాక్ ఇచ్చినట్టైంది.