ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. పది రోజుల క్రితం ఉన్న పరిస్థితులు నేడు కనిపించడం లేదు. జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల టీడీపీలో అధికారంపై ధీమా కనిపించింది. నేడు అదే పొత్తు టీడీపీ కొంప ముంచుతోంది. అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా? లేదా? అనే అనుమానం ఇరు పార్టీల శ్రేణుల్లో ఉంది. ఇటీవల చంద్రబాబునాయుడు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు.
బాబు వైఖరి జనసేనాని పవన్‌కల్యాణ్‌కు కోపం తెప్పించింది. పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తారా? అయితే నేను కూడా రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నా అంటూ పవన్‌కల్యాణ్ తనదైన రాజకీయం చేశారు. దెబ్బకు దెబ్బ కొట్టామని జనసేన ముఖ్య నాయకుడు, పవన్ అన్న నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఆగ్గికి ఆజ్యం పోసినట్టైంది.
మరోవైపు నెల క్రితం రెండు పార్టీలు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు ఇరువైపులా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలో చర్చించుకున్నామంటూ ఏవేవో కబుర్లు చెప్పారు. అవన్నీ ఏమయ్యాయో జవాబు చెప్పే దిక్కులేదు.
రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్‌కల్యాణ్ ప్రకటించడంతో అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. జనసేనతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. అధికారికంగా ప్రకటించిన రెండు సీట్లలోనే ఈ పరిస్థితి వుంటే, ఇక పూర్తి స్థాయిలో వెల్లడిస్తే సీన్ ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ జనసేనకు 20కి మించి అసెంబ్లీ సీట్లు ఇస్తే మాత్రం టీడీపీలో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇదే సందర్భంలో 40కి తక్కువ జనసేనకు సీట్లు ఇస్తే, ఆ పార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి బదిలీ కావని కాపు నాయకులు పదేపదే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. దీంతో పొత్తు వల్ల టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో బలపడుతోంది. క్రమంగా అధికారంపై నమ్మకం టీడీపీ నేతల్లో సడలుతోంది.
మరోవైపు భీమిలిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం సూపర్ హిట్ కావడంతో అధికార పార్టీ శ్రేణుల్లో మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమా పెరిగింది. ఏ రకంగా చూసినా టీడీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతుంటే, వైసీపీ గ్రాఫ్ నెమ్మదిగా పెరుగుతోంది. వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి తగ్గి, మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్న పట్టుదల పెరుగుతుండడం తాజా పరిణామం.