‘గంటా’కు పార్టీ రాంగ్ సిగ్నల్?

విశాఖ జిల్లాలో సీనియర్ల మాట అంత చెల్లుబాటు అవుతున్నట్లు లేదు. పార్టీ టికెట్ లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించే నారా లోకేష్ టికెట్ల విషయంలో అస్సలు మొహమాట పడకూడదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. Advertisement ఇప్పటికే…

విశాఖ జిల్లాలో సీనియర్ల మాట అంత చెల్లుబాటు అవుతున్నట్లు లేదు. పార్టీ టికెట్ లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించే నారా లోకేష్ టికెట్ల విషయంలో అస్సలు మొహమాట పడకూడదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అయ్యన్న పాత్రుడు తన కుటుంబానికి రెండు టికెట్‌లు కావాలంటే నో అని చెప్పేసారని వార్తలు వినిపించాయి. తడవకు ఓ నియోజక వర్గం మారే అలవాటు వున్న గంటా శ్రీనివాస రావు పరిస్థితి కూడా కాస్త కష్టంగానే వున్నట్లు తెలుస్తోంది.

గంటా తన పోటీ జర్నీలో భాగంగా ఇప్పటి వరకు అనకాపల్లి నుంచి భీమిలి మీదుగా విశాఖ వచ్చారు. ఇప్పుడు చోడవరం వెళ్లాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఇప్పటి వరకు పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. పైగా చిన్న నెగిటివ్ సూచనలు వచ్చాయనే గ్యాసిప్ లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి,

చోడవరం నుంచి పోటీ చేసే విషయమై, పార్టీ పెద్దల అభిప్రాయం, అనుమతి గంటా శ్రీనివాసరావు కోరినట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి చోడవరం నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ స్పీడప్ చేయవచ్చు అన్నది గంటా ప్లాన్. కానీ దానికి సరైన సమాధానం, సానుకూల స్పందన రాకపోగా, ‘చూద్దాం అది కాకుంటే చాలా ఆప్షన్లు వున్నాయి’ అనే విధమైన సమాధానం లోకేష్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ‘చాలా ఆప్షన్లు’ అనే దానికి చాలా అర్ధాలు వున్నాయి. వేరే నియోజకవర్గాలు అనే అర్ధంతో పాటు, ఎమ్మెల్యే కాకుంటే ఎమ్మెల్సీ, కాకుంటే మరోటి అనే అర్థాలు కూడా వున్నాయి. దాంతో గంటాకు పక్కాగా టికెట్ వస్తుందా అనే డిస్కషన్లు పార్టీలో వినిపిస్తున్నాయి.

గత అయిదేళ్లలో గంటా రకరకాలుగా వుంటూ వచ్చారు. పార్టీ విషయంలో యాక్టివ్ గా లేకపోవడం అందులో ఒకటి. ఒకసారి రాజీనామా చేసారు. అది కూడా పార్టీకి పెద్దగా నచ్చలేదని వార్తలు వినవచ్చాయి. గంటా విషయంలో విశాఖ పార్టీ జనాలు కాస్త అసంతృప్తిగానే వున్నారు. ఇవన్నీ కలిసి గంటాను టికెట్ కు దూరం చేస్తాయోమో అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.