విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉక్కు కార్మిక సంఘాలతో సమావేశం అయ్యారు. ఉక్కు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎటూ రాష్ట్రంలో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
అంతె కాకుండా విశాఖ ఉక్కు అంశాన్ని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పెడతామని గంటా చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని గంటా అంటున్నారు. ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం అన్యాయం అని గంటా పేర్కొన్నారు.
గంటా మూడేళ్ళ క్రితం విశాఖ ఉక్కు విషయంలో రాజీనామా చేశారు. అది ఇటీవల ఆమోదం పొందింది. ఒక వైపు తన రాజీనామా ఎలా ఆమోదిస్తారు అంటూ న్యాయ పోరాటం చేస్తామని మీడియా ముందు మాట్లాడిన గంటా ఇపుడు ఉక్కు పోరాటానికి మద్దతు అని ముందుకు వచ్చారు.
రాజీనామా ఆమోదం తరువాత ఉక్కు కర్మాగారం గుర్తుకు వచ్చిందా అని వైసీపీ నేతలు మాజీ మంత్రిని ఎద్దేవా చేస్తున్నారు. ఉక్కు ప్రైవేట్ కాకుండా కాపాడతామని చెబుతున్న మాజీ మంత్రి రేపటి రోజున బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఆ విషయం పెట్టించగలరా అని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ ఈ విషయంలో ఏ సంగతీ చెప్పకుండా పొత్తులు పెట్టుకుంటారా అని మేధావుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ ఇప్పటిదాకా పెద్దగా పోరాటాలు చేయలేదని కూడా అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో విశాఖ ఉక్కు కార్మికుల మద్దతు కోసం ఈ విధంగా ఆ పార్టీ ముందుకు వస్తోందని అంటున్నారు.