హాస్య‌న‌టుడు బాబుమోహ‌న్ మ‌న‌స్తాపం!

బీజేపీ వైఖ‌రిపై హాస్య న‌టుడు, మాజీ మంత్రి బాబుమోహ‌న్ మ‌న‌స్తాపం చెందారు. ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోనున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు, బీజేపీకి కూడా దూరంగా వుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ…

బీజేపీ వైఖ‌రిపై హాస్య న‌టుడు, మాజీ మంత్రి బాబుమోహ‌న్ మ‌న‌స్తాపం చెందారు. ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోనున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు, బీజేపీకి కూడా దూరంగా వుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ఈ లొల్లి అని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌చ్చే నెల‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

ఇప్ప‌టికే బీఆర్ఎస్ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించి క‌ద‌న‌రంగంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్ కూడా దాదాపు అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేసింది. రెండు ద‌ఫాల్లో 100 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. బీజేపీ మొద‌టి విడ‌త అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. విడ‌త‌ల వారీగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి బీజేపీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాబుమోహ‌న్‌కు టికెట్ ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అందోలు నుంచి బీజేపీ త‌ర‌పున బాబుమోహ‌న్ పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా యాక్టీవ్‌గా కూడా లేరు. తాజాగా మ‌రోసారి ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్‌ను బాబుమోహ‌న్ ఆశిస్తున్నారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాబు మోహ‌న్ త‌న‌యుడు కూడా టికెట్ ఆశిస్తున్నార‌ని తెలిసింది. బీజేపీ అధిష్టానం బాబుమోహ‌న్ త‌న‌యుడిపై మొగ్గు చూపుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ వార్త‌ల‌పై బాబుమోహ‌న్ ఇవాళ స్పందించారు. మీడియాతో బాబుమోహ‌న్ మాట్లాడుతూ టికెట్ ఇవ్వ‌ని విష‌యాన్ని బీజేపీ అధిష్టానం చెప్పొచ్చు క‌దా అని ప్ర‌శ్నించారు. త‌న కుమారుడికి టికెట్ ఇస్తామ‌ని చెప్ప‌డం ద్వారా తండ్రీకొడుకుల మ‌ధ్య విభేదాలు సృష్టించాల‌ని అనుకుంటున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తానంటే ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఇమేజ్ వుంద‌న్నారు. రోడ్డుపై నిలిస్తే నిమిషాల వ్య‌వ‌ధిలో వంద‌లాది మంది త‌న కోసం గుమికూడుతార‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యాన్ని టికెట్లు ఖ‌రారు చేసే వాళ్లు తెలుసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. 

అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఫ‌స్ట్‌, సెకెండ్ లిస్ట్‌లు ఏంటో అర్థం కావ‌డం లేద‌న్నారు. బీజేపీ పాత‌, కొత్త అధ్య‌క్షులైన బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డిల‌కు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. త‌న కొడుకుకా, లేదా త‌న‌కు టికెట్ ఇస్తారా? అనేది బీజేపీ అధిష్టానం తేల్చుకోవాల‌ని ఆయ‌న కోరారు. క‌నీసం ఆ విష‌యం చెప్ప‌క‌పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు. 

ఈ సంద‌ర్భంగా తానొక సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బాబుమోహ‌న్ తెలిపారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు, అలాగే బీజేపీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. బీజేపీ అధిష్టానం నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఆ పార్టీకి రాజీనామా చేయాలా? వ‌ద్దా? అనేది తేల్చుకుంటాన‌ని బాబుమోహ‌న్ స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ రాజీనామా చేయాల్సి వ‌స్తే… త‌న‌కు జ‌రిగిన అవమానాల్ని బ‌య‌ట పెడ‌తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.