టీడీపీ- జ‌న‌సేన‌ల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది!

తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య‌న సీట్ల వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది? అద‌స‌లు ముందుకు వెళ్తోందా? లేక ఈ బంధం రివ‌ర్స్ అయ్యిందా? ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేని నేప‌థ్యంలో ఈ పొత్తుల వ్య‌వ‌హారం…

తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య‌న సీట్ల వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది? అద‌స‌లు ముందుకు వెళ్తోందా? లేక ఈ బంధం రివ‌ర్స్ అయ్యిందా? ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేని నేప‌థ్యంలో ఈ పొత్తుల వ్య‌వ‌హారం అమితాస‌క్తిదాయ‌కంగా మారింది. ఒక‌వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల జాబితాలో ముందుకు వెళ్తోంది.

గ‌త ప‌ర్యాయంతో పోలిస్తే ఈ సారి సార్వ‌త్రిక ఎన్నిక‌లు కాస్త ముందుగా రావొచ్చ‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతూ ఉంది. ఐదేళ్ల కిందట మార్చి నెల‌లో షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. ఈ సారి ఫిబ్ర‌వ‌రిలోనే అది జ‌ర‌గొచ్చ‌నే అంచ‌నాలున్నాయి. ఒక‌వేళ మార్చి లోనే షెడ్యూల్, నోటిఫికేష‌న్ విడుద‌ల అయినా.. దానికేమంత స‌మ‌యం లేదు! స‌రిగ్గా మ‌రో రెండు నెల‌ల్లో పోలింగ్ కూడా పూర్త‌యినా పెద్ద ఆశ్చ‌ర్యంలేని ప‌రిస్థితి ఉంది. మ‌రి ఇలాంటి నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ టీడీపీ- జ‌న‌సేన పొత్తుల వ్య‌వ‌హారం ఒక కొలిక్కిరాక‌పోవ‌డంతో ఇరు పార్టీల్లోనూ ఆందోళ‌న రేపే అంశంగా మారుతోంది.

అస‌లు జ‌న‌సేన‌కు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంద‌నే అంశం గురించి చాన్నాళ్లుగా చ‌ర్చ చ‌ర్చ‌గానే కొన‌సాగుతూ ఉంది. ప‌దోప‌ర‌క సీట్ల‌ను ఇచ్చి జ‌న‌సేన‌కు ముడేయొచ్చ‌ని మొద‌ట్లో చంద్ర‌బాబు భావించిన‌ట్టుగా ఉన్నారు. ఇప్ప‌టికీ చంద్ర‌బాబు లెక్క‌లు మారి ఉండ‌క‌పోవ‌చ్చు కూడా! వీలైనంత త‌క్కువ సీట్ల‌కు తెగ్గొట్ట‌డం, ఆ పై కేటాయించిన సీట్ల‌లో త‌ను చెప్పిన అభ్య‌ర్థుల‌నే పోటీ పెట్టాల‌న‌డం, మాట విన‌క‌పోతే టీడీపీ రెబల్స్ ను బ‌రిలోకి దించ‌డం, అదీ కాదంటే.. తెలుగుదేశం పార్టీ బీఫారాల‌ను అక్క‌డ ఇచ్చేయ‌డం.. కూడా చంద్ర‌బాబుకు అల‌వాటైన ప‌నే! మరి అలాంటి చంద్ర‌బాబుతో ఎన్నిక‌ల పొత్తుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ రెడీ అయ్యారు చాన్నాళ్ల కింద‌టే! పోలింగ్ కు మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ఉంద‌నుకుంటే.. ఇప్ప‌టికీ ఇంకా ఎవ‌రికీ ఏ సీటో కూడా క్లారిటీ లేదు!

జ‌న‌సేన‌కు ప‌ది సీట్లే ఇస్తారా, ఇర‌వై సీట్ల‌తో స‌రిపెడ‌తారో కానీ.. ఆ వ్య‌వ‌హారంపై క్లారిటీ లేక‌పోవ‌డం తెలుగుదేశం, జ‌న‌సేన రెండింటికీ న‌ష్టం చేకూర్చే అంశ‌మే! మ‌ధ్య‌లో కాపు సంఘం నేత‌లు జోక్యం చేసుకోవ‌డం, జ‌న‌సేన‌కు క‌నీసం 60 సీట్లు అయినా కేటాయిస్తేనే ఇరుప‌క్షాల‌కూ లాభం ఉంటుంది త‌ప్ప లేక‌పోతే ప్ర‌యోజ‌నం లేద‌ని వారు తేల్చి చెప్ప‌డం తో వ్య‌వ‌హారం మ‌రింత ర‌స‌కందాయ‌కంలో ప‌డింది. కాపు కుల నేత‌ల వాద‌న‌లోనూ నిజం లేద‌న‌లేం. జ‌న‌సేన‌కు త‌గిన‌న్ని సీట్ల‌ను కేటాయించ‌డం, సీఎం సీటులో వాటాను ప్ర‌క‌టించ‌డం జ‌రిగితే త‌ప్ప కాపుల ఓట్లు గంప‌గుత్త‌గా ఈ కూట‌మికి ప‌డే అవ‌కాశం లేద‌ని వారు తేల్చి చెబుతున్నారు. మ‌రి తెలుగుదేశం పార్టీ ప‌వ‌న్ తో పొత్తును ప్ర‌బ‌లంగా కోర‌కుంటే అందుకు రెడీ అనాలి!

60 సీట్ల‌కు కాక‌పోయినా.. క‌నీసం 45 సీట్ల‌ను అయినా న్యాయంగా కేటాయిస్తే ఈ పొత్తు విచ్చుకోవ‌చ్చు కూడా! 45 అసెంబ్లీ సీట్లు, క‌నీసం ఐదారు ఎంపీ సీట్లు, సీఎం సీటు విష‌యంలో కూడా ప‌వ‌న్ కు క‌నీసం రెండేళ్ల అవ‌కాశం ఇస్తే.. తెలుగుదేశం పార్టీ ఈ పొత్తుకు ఊపిరి ఊదిన‌ట్టే! అయితే..ఇందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా అయితే క‌న‌ప‌డ‌టం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. త‌మ కూట‌మి అధికారంలోకి వ‌స్తే త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడే సీఎం అని లోకేష్ స్ప‌ష్టం చేశారు. అలాగే ప‌వ‌న్ కు క‌నీసం డిప్యూటీ సీఎం ఇస్తారా.. అంటే, అది కూడా చంద్ర‌బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో తేలుస్తుందంటూ లోకేష్ తేల్చి చెప్పాడు!

అప్పుడే జ‌న‌సేన‌- తెలుగుదేశం పొత్తుకు ఇరుసు విరిగింది! లోకేష్ మాట‌ల ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సానుకూలంగానే ఉండొచ్చు! త‌ను సీఎం కావాల‌నే కోరిక కానీ, కాపుల కోరిక కానీ త‌ను తీర్చాల‌ని ప‌వ‌న్ అనుకోక‌పోవ‌చ్చు. కేవ‌లం జ‌గ‌న్ ను దించ‌డ‌మే త‌న ల‌క్ష్యమ‌న్న‌ట్టుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. అలాంట‌ప్పుడు లోకేష్ మాట‌లు ప‌వ‌న్ ను పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌క‌పోవ‌చ్చు. కానీ జ‌న‌సైనికులంతా అలా ఆలోచించాల‌ని లేదు, చంద్ర‌బాబును ఇంకోసారి సీఎంగా చేయ‌డానికి కాపులు ముందుకు రాక‌పోనూ వ‌చ్చు!

ఇలాంటి నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కూడా పొత్తు ధ‌ర్మం అనే మాట‌ను ఎత్తుకున్నాడు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కూ వెళ్తుంది? అనేది ఒక ప్ర‌శ్న అయితే, ఇంత‌టితో పొత్తు వీగిపోక‌పోయినా.. ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేని ఈ ప‌రిణామాల్లో ఇదంతా ఎప్ప‌టికి ఒక కొలిక్కి వ‌చ్చేను అనేది పొత్తులే విజ‌యాన్ని ఇస్తాయ‌నే లెక్క‌ల‌తో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌నైనా, ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌నే ఉత్సాహంతో ఉన్న వారికైనా నిర్వేదాన్నే మిగుల‌స్తాయన‌డంలో వింత లేదు!