తిరుపతి వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం డ్రామాలు అన్నీఇన్నీ కావు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని అక్కడి నుంచి మార్చి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తిరుపతి సిటింగ్ ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడుకు పంపారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో తిరుపతిలో నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి ఎంపీ అభ్యర్థి ఆదిమూలం గైర్హాజరు కావడం గమనార్హం.
ఆదిమూలం కుమారుడు, నారాయణవణం జెడ్పీటీసీ సభ్యుడు కోనేటి సుమన్ సత్యవేడు ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఐ ప్యాక్ ప్రతినిధులు సత్యవేడు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఆత్మీయ సమావేశానికి రావాలని బతిమలాడగా, చివరి నిమిషంలో ఆయన దయతలచి కుమారుడిని పంపినట్టు సమాచారం. సత్యవేడుకు తనను ఇన్చార్జ్గా నియమించడంతో ఎమ్మెల్యే ఆదిమూలం ఆశీస్పులు తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించినా, ఆయన కలిసేందుకు ఇష్టపడక తప్పించుకు తిరుగుతున్నారని తెలిసింది.
తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని కొనసాగించకుండా, సత్యవేడుకు పంపాలని అనుకోవడమే ఒక పనికిమాలిన నిర్ణయమని లోకం కోడై కూస్తోంది. మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్టే తనకు కావాలని ఆదిమూలం పట్టుపట్టారు. సత్యవేడులో తిరిగి కొనసాగించకపోవడంతోనే ఆయన అలకబూనారు. తిరుపతి ఎంపీ సీటు ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు.
ఎన్నికల సమయంలో కీలకమైన ఆత్మీయ సమావేశాలకు కూడా హాజరు కాకుండా, తన ఇష్టానుసారం తప్పించుకుని తిరుగుతుంటే, వైసీపీ అధిష్టానం ప్రేక్షకపాత్ర పోషించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థి మంత్రి గుమ్మనూరు జయరాం అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి ఎటో వెళ్లిపోయారు. దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి. నరసారావుపేటలోనూ ఇదే పరిస్థితి.
బాగా పని చేసుకుంటున్న ఎంపీలను ఊరికే మారుస్తుండడం వల్ల కోరి తలనొప్పుల్ని వైసీపీ తెచ్చుకుంటోంది. కోనేటి ఆదిమూలం లాంటి వారిని ఎంపీగా గెలిపించుకున్నా, రేపు పార్టీలోనే వుంటారన్న నమ్మకం ఏంటి?