ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానిది చెరగని ముద్ర. సంక్షేమ, అభివృద్ధి పాలనకు వైఎస్సార్ ఓ బ్రాండ్. వైఎస్సార్ వారసుడిగా జగన్ జనంలోకి వెళ్లారు. ప్రజల ఆశీస్సులు దక్కించుకున్నారు. సీఎం కావాలన్న తన కలను ఆయన సాకారం చేసుకున్నారు. అయితే వైఎస్సార్ కుమార్తె షర్మిలకు అన్నతో విభేదాలొచ్చాయి.
అన్నపై కోపంతో తెలంగాణ వెళ్లి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ తెలంగాణ సమాజం ఆమెను అక్కున చేర్చుకోలేదు. దీంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్ని ఆమెకి అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి దానికీ అమ్మే సాక్ష్యం అంటూ తల్లిని తన రాజకీయాల్లోకి లాగేందుకు ఆమె విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
విజయమ్మ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కానీ తన తల్లి విజయమ్మ రానున్న ఎన్నికల్లో జగనన్న తరపున ప్రచారానికి వెళుతున్నారని సలహాదారుడైన ఎల్లో మీడియాధిపతి వద్దకెళ్లి షర్మిల శోకాలు పెట్టుకున్నారు. అందుకే జగన్ తరపున విజయమ్మ ప్రచారానికి వెళ్లే వార్తను వ్యంగ్యంగా ఎల్లో పత్రికలో రాయడాన్ని చూడొచ్చు. తనపై చెల్లి అవాకులు చెవాకులు పేలుతున్నా, జగన్ మాత్రం సంయమనం పాటిస్తున్నారు.
చంద్రబాబు తరపున మరికొందరు స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ పరోక్షంగా చురకలు అంటించే వరకే పరిమితం అయ్యారు. ఇటీవల ఎడ్యేకేషన్ సమ్మిట్లో జాతీయ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మాత్రమే ఆయన స్పందిస్తూ… కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని, నాడు తన చిన్నాన్న వివేకాను, ఇప్పుడు సోదరిని అడ్డు పెట్టుకుని కుటుంబంలో చీలిక తెచ్చిందని మండిపడ్డారు. నిన్నటి ఎన్నికల శంఖారావంలో చెల్లి గురించి అసలు ఆయన పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ద్వారా, కుటుంబం ఎవరి వైపు ఉందో సంకేతాలు జనానికి ఇవ్వడానికి విజయమ్మ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జగన్ తరపున ప్రచారం చేయడం ద్వారా షర్మిల విమర్శలకు విలువ లేకుండా చేయడమే విజయమ్మ లక్ష్యంగా కనిపిస్తోంది.
తనయుడిపై కూతురి అవాకులు చెవాకులు పేలడాన్ని విజయమ్మ జీర్ణించుకోలేక పోతున్నారని తెలిసింది. అందుకే జగన్కు అండగా నిలబడాలని నిర్ణయించుకోవడం ద్వారా, షర్మిల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని విజయమ్మ ఆలోచన. అన్న తరపున విజయమ్మ ప్రచారానికి వెళితే, ఏపీలో కూడా తన రాజకీయానికి నూకలు చెల్లినట్టే అని షర్మిల భయపడుతోంది.