ఒక పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేసి ఇంకొక పార్టీలో చేరిపోయి రాజకీయం చేసే హక్కు ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఉంటుంది. అందుకు పార్టీలు మారే వాళ్లని తప్పుపట్టాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ రాజకీయ పార్టీ అంటే దానికి కొన్ని విధానాలు, సిద్ధాంతాలు ఉంటాయని తెలిసి.. వాటిని అభిమానించి ఆ పార్టీలో చేరే వారు ఇవాళ్టి రోజుల్లో ఎందరున్నారు?
తమ స్వప్రయోజనాల కోసం పార్టీల్లో చేరడం, అయినంత వరకు ప్రయోజనాలు పొందడం, ఇక అవి నెరవేరవని, అక్కడ తమ పప్పులు ఉడకవని అర్థంకాగానే పార్టీని విడచి వెళ్లిపోవడం మాత్రమే జరుగుతోంది. ఉన్న పార్టీని ఎవ్వరు ఎన్నిసార్లు విడిచిపోయినా పెద్ద నష్టం లేదు గానీ.. ఆ పార్టీ కారణంగా అనుభవిస్తున్న పదవుల్ని కూడా వదులుకుంటే.. పరువుగా ఉంటుంది. పార్టీ వద్దు.. వారు అందించిన పదవుల వైభవం మాత్రం కావాలి అని కక్కుర్తిపడుతూ.. తమ పరువు తామే తీసుకుంటూ.. మళ్లీ తన పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటూ గప్పాలు కొట్టడం కొందరు నాయకులకు మాత్రమే చెల్లుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూ, పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన సి.రామచంద్రయ్య ఇప్పుడు అదే పనిచేస్తున్నారు.
కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సి,రామచంద్రయ్య వైసీపీపార్టీని విడిచిపెట్టారు తప్ప.. ఆ పార్టీ దయతో తనకు లభించిన ఎమ్మెల్సీ పదవిని విడిచిపెట్టలేదు. తెలుగుదేశంలో చేరిపోయినా, ఆ పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నారు. ‘మీరు పార్టీ మారినట్లు మీ ప్రవర్తన వల్ల తెలిసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వండి’ అంటూ శాసనమండలి నుంచి తనకు నోటీసులు వచ్చాయని ఇది ఏకపక్ష ధోరణి అని ఆయన అంటున్నారు.
నేను పార్టీకి విధేయుడిగా ఉండాలా? లేదా రాజ్యాంగానికి బద్ధుడిగా ఉండాలా? అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాజ్యాంగానికి విలువ ఇచ్చే మనిషే అయితే గనుక.. వచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాలి కదా. పార్టీ మారిన వ్యవహారం నా వ్యక్తిగతం, ఎమ్మెల్సీ పదవికి దానికి సంబంధం లేదు అని ధైర్యంగా చెప్పవచ్చు కదా. ఇంతటి సీనియర్ నాయకుడు.. సమాధానం ఇవ్వడానికి తన వ్యక్తిగత సిబ్బంది అందుబాటులో లేరని, తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని జవాబు రాయడానికి గడువు కావాలని రకరకాల సాకులు చెబుతున్నారు.
అయినా సి.రామచంద్రయ్య వంటి సీనియర్ నాయకుడు.. రాజ్యాంగం గురించి కబుర్లు చెప్పడమేనా? రాజకీయాల్లో నైతిక విలువలు కూడా ఉంటాయని, తనకు పదవి ఇచ్చిన పార్టీని వీడితే.. ఆ పదవిని కూడా వీడాలనే కామన్ సెన్స్ ఉండదా అని ప్రజలు అనుకుంటున్నారు.
వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి ఎంపీలు వెళ్లిపోతున్నారు. వాళ్లంతా పార్టీతో పాటు, తమ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నారు. పార్టీని మాత్రం వదలి, పదవిని అంటిపెట్టుకుని వంకర సమర్థింపు, డబాయింపు మాటలు మాట్లాడడం లేదు అని ప్రజలు అంటున్నారు.