ప్ర‌త్య‌ర్థుల గుండెల‌దిరేలా జ‌గ‌న్ ఎన్నిక‌ల శంఖారావం

ప్ర‌త్య‌ర్థుల గుండెల‌దిరేలా ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. సిద్ధం నినాదంతో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం సంగివ‌ల‌స బ‌హిరంగ స‌భ‌లో శ‌నివారం సాయంత్రం అత్యంత ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌గ‌న్ స‌మ‌ర శంఖాన్ని…

ప్ర‌త్య‌ర్థుల గుండెల‌దిరేలా ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. సిద్ధం నినాదంతో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం సంగివ‌ల‌స బ‌హిరంగ స‌భ‌లో శ‌నివారం సాయంత్రం అత్యంత ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌గ‌న్ స‌మ‌ర శంఖాన్ని పూరించి, ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరారు.

ఎన్నిక‌ల స‌మ‌రానికి తాను సిద్ధ‌మ‌ని, మీరు సిద్ధ‌మా? అని ప‌దేప‌దే ప్ర‌శ్నిస్తూ వైసీపీ శ్రేణుల్లో స‌మ‌రోత్సాహాన్ని నింపారు. అటువైపు కౌర‌వ సైన్యం ప‌ద్మ వ్యూహాన్ని సిద్ధం చేసి వుంద‌ని, అయితే ఆ వ్యూహంలో చిక్కుకుపోవ‌డానికి తాను అభిమ‌న్యుడిని కాద‌ని, అర్జునుడంటూ ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టేలా వార్నింగ్ ఇచ్చారు. అర్జునుడిలాంటి త‌న‌కు శ్రీ‌కృష్ణుడులాంటి మీరంతా తోడున్నార‌ని శ్రేణుల్ని ఉద్దేశించి జ‌గ‌న్ అన్నారు.

ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో స‌హా అంద‌రినీ ఓడించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని మ‌రోసారి జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. గ‌త నాలుగున్న‌రేళ్లకు పైగా పాల‌న‌లో పేద‌ల‌కు అందించిన సంక్షేమ ప‌థ‌కాలు, అలాగే త‌న పాల‌న స‌మాజంలో తీసుకొచ్చిన మార్పుల్ని జ‌గ‌న్ ఏక‌రువు పెట్టారు. ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు 14 ఏళ్లు పాలించిన‌ప్ప‌టికీ చేసింది చెప్పుకోడానికి ఏదీ లేద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు వ‌య‌సు 75 ఏళ్లంటూ ఆయ‌న ప్ర‌త్యేకంగా గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ ప్ర‌సంగం చివ‌రికి వ‌చ్చే స‌రికి…ప్ర‌తి ఒక్క‌రి రోమాలు నిక్క‌పొడుచుకునేలా స‌మ‌రానికి స‌న్న‌ద్ధం చేసే విధంగా ప్ర‌సంగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…

“ఈ యుద్ధంలో మీరు సిద్ధ‌మా? అని నేను అడుగున్నా. నేను సిద్ధం. దేవుని ద‌యంతో, ప్ర‌జ‌లే అండగా ఒంట‌రి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధ‌మా? అని అడుగుతున్నా. వారికి (ప్ర‌త్య‌ర్థులు) దిక్కులు పిక్క‌టిల్లేలా స‌మ‌ర‌నాథం చేస్తూ , ఎన్నిక‌ల శంఖారావం పూరిస్తూ సిద్ధ‌మ‌ని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది.

మ‌రో 60 నుంచి 70 రోజుల్లోపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల‌కు మీరు సిద్ధ‌మా అని అడుగుతున్నా. దుష్ట చ‌తుష్ట‌యాన్ని, గ‌జ దొంగ‌ల ముఠాను ఓడించేందుకు సిద్ధ‌మా? అని అడుగుతున్నా. వ‌చ్చే ఎన్నిక‌లు పేద‌ల‌కు, పెత్తందారుల‌కు మ‌ధ్య యుద్ధం. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్ర‌త్య‌ర్థుల వంచ‌న‌కు, మ‌న విశ్వ‌స‌నీయ‌త‌కు మ‌ధ్య యుద్ధం” అంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై యుద్ధానికి త‌న పార్టీ శ్రేణుల్ని ముందుకు న‌డిపించేలా జ‌గ‌న్ ఉద్వేగ, ఆవేశ‌పూరిత ప్ర‌సంగం చేశారు.  

మీరు యుద్ధానికి సిద్ధ‌మా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించిన‌ప్పుడు, వైసీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పాజిటివ్ స్పంద‌న వ‌చ్చింది. సిద్ధ‌మంటూ పిడికిళ్లు బిగించి ప్ర‌త్య‌ర్థుల‌పై యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మ‌ని నిన‌దించారు. సెల్‌ఫోన్ల‌ను ఆయుధాలుగా చేసుకుని ఎల్లో మీడియా, అలాగే టీడీపీ సోష‌ల్ మీడియా దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని పిలుపునిచ్చారు.

ప్రసంగం అనంత‌రం జ‌గ‌న్ శంఖారావాన్ని పూరించారు. ఇది ముమ్మాటికీ ప్ర‌త్య‌ర్థుల‌కు భ‌యం పుట్టించేలా మార్మోగింది. వైసీపీ శ్రేణుల్లో 2019 ఎన్నిక‌ల నాటి స‌మ‌రోత్సాహం క‌నిపించింది.