హనీమూన్ పేరిట అయోధ్యకు.. ఆ తర్వాత?

అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. దీంతో అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో క్యూ కడుతున్నారు. భోపాల్ కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు.…

అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. దీంతో అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో క్యూ కడుతున్నారు. భోపాల్ కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. కానీ అతడి భార్యకు అది నచ్చలేదు. విడాకులకు అప్లయ్ చేసింది.

భోపాల్ కు చెందిన ఈ జంటకు గతేడాది మే నెలలో వివాహం జరిగింది. ఇద్దరూ ఐటీ ఉద్యోగులు కావడంతో, పెళ్లయిన వెంటనే హనీమూన్ కు వెళ్లలేకపోయారు. మొత్తానికి ఎలాగోలా టైమ్ సెట్ చేసుకొని హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. డబ్బుకు లోటు లేకపోవడంతో విదేశాలకు వెళ్లాలనేది ప్లాన్.

కానీ భర్త అందుకు ఒప్పుకోలేదు. భారత్ లోనే గోవా లేదా దక్షిణ భారతదేశాన్ని సందర్శిద్దామన్నాడు. ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. అంతలోనే భర్త ప్లాన్ మార్చేశాడు. భార్యకు చెప్పకుండా అయోధ్య, వారణాసికి ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేశాడు.

సరిగ్గా ప్రయాణానికి ముందురోజు భార్యకు ఈ విషయం చెప్పాడు. అయోధ్యను దర్శించాలనేది తన తల్లిదండ్రుల కోరిక అని, కాబట్టి అయోధ్యకు వెళ్దామని అన్నాడు. జరిగిన మార్పునకు భార్య షాక్ అయింది. అయినా మారుమాట్లాడకుండా వారణాసి, అయోధ్యకు వెళ్లి వచ్చింది.

ఇంటికొచ్చిన తర్వాత ఈ అంశంపై మరోసారి వాదన జరిగింది. అప్పటికే మానసికంగా తీవ్రంగా హర్ట్ అయిన భార్య, నేరుగా భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. జరిగినదంతా చెప్పి, తనకు విడాకులు కావాలని కోర్టును కోరింది. దీంతో భర్త షాక్ అయ్యాడు ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు.