ఒకే పార్టీ.. ఒకే కులం.. సోషల్ వార్!

నాయకుల మధ్య ఐక్యతకు ఒకే పార్టీ కావడం గానీ, ఒకటే కులం కావడం గానీ ప్రాతిపదికలుగా ఉపయోగపడతాయని అనుకుంటే పొరబాటే. నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థం ముందు మరే ఫ్యాక్టర్ కూడా పనిచేయదు.…

నాయకుల మధ్య ఐక్యతకు ఒకే పార్టీ కావడం గానీ, ఒకటే కులం కావడం గానీ ప్రాతిపదికలుగా ఉపయోగపడతాయని అనుకుంటే పొరబాటే. నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థం ముందు మరే ఫ్యాక్టర్ కూడా పనిచేయదు. అదే సంగతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది.

విజయవాడ సెంట్రల్ సీటును ఆశిస్తున్న ఇద్దరు ఒకే కులానికి చెందిన నాయకులు.. ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకునే ప్రయత్నాల్లో ఉండడం.. ఒకరిని ఒకరు భ్రష్టు పట్టించేలా సోషల్ మీడియాలో విమర్శల యుద్ధం చేసుకుంటూ ఉండడం, బురద చల్లుకుంటూ ఉండడం, ఇదంతా కూడా తమ పేరు బయటకు రాకుండా దొంగచాటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండడం జరుగుతోంది. తెలుగుదేశానికి చికాకు కలిగిస్తున్న ఆ ఇద్దరు నాయకులు వంగవీటి రాధా, బోండా ఉమా కావడం విశేషం. 

వీరిద్దరూ కూడా విజయవాడ సెంట్రల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వంగవీటి రాధాకు వ్యతిరేకంగా ఏడు ప్రశ్నలతో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రత్యక్ష్యం అయ్యాయి. వీటిని బోండా ఉమా వర్గీయులే ప్రచారంలోకి పెట్టినట్టుగా రాధా వర్గీయులు భావించారు. ఈలోగానే.. బోండా ఉమాకు ఏకంగా 17 ప్రశ్నలు సంధిస్తూ మరి కొన్ని పోస్టులు కూడా ప్రత్యక్షం అయ్యాయి. ఇదంతా రాధా వర్గం పని అని కూడా అనుకుంటున్నారు. 

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోనే అసంతృప్తితో ఉన్నారా? అనే ప్రచారం ఇటీవలి కాలంలో విస్తృతంగా జరుగుతోంది. ఆయన తెలుగుదేశాన్ని వీడేది లేదని ప్రెస్  మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ.. ఆయన జనసేనలో చేరుతారని మచిలీపట్నం ఎంపీగా పోటీచేస్తారని ఏడాదిగా వినిపించింది. తీరా అక్కడ సిటింగ్ ఎంపీ వైసీపీకి చెందిన బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో ఇక రాధాకు ఎంపీ చాన్స్ లేనట్టే. లేదా కాకినాడ ఎంపీగా పంపాలని కూడా ఆలోచన ఉన్నట్టు ఒక ప్రచారం ఉంది.

విజయవాడ సెంట్రల్ ఆశిస్తున్న వంగవీటి రాధా ఆ సీటు దక్కకపోతే.. జనసేనలోకి వెళ్లి, ఆ సీటు కోసం టీడీపీపై ఒత్తిడి పెంచవచ్చునని ఒక ప్రచారం ఉంది. మరొకవైపు వంగవీటి రాధా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది. ఆయన తమ పార్టీలోకి వస్తే గనుక.. ఇప్పటికే నియమించిన ఇన్చార్జిలను కూడా మార్చి ఆయనకు కట్టబెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. 

అవన్నీ పక్కన పెడితే.. ఒకే పార్టీలోని ఒకే కులానికి చెందిన ఇద్దరు నాయకులు సోషల్ మీడియాలో ద్వంద్వయుద్ధం సాగిస్తుండడం గమనించాలి. కొడాలి నాని, వల్లభనేని వంశీల ప్రయోజనాలకు అనుకూలంగా వంగవీటి పనిచేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి తెలుగుదేశం అంతర్గత రాజకీయాల్లో వీరిలో ఎవరు నెగ్గుతారో చూడాలి.