Advertisement

Advertisement


Home > Politics - National

ఇండియా విచ్ఛిన్నానికి దీదీ పునాది!

ఇండియా విచ్ఛిన్నానికి దీదీ పునాది!

జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం, కేంద్రంలో మోడీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో రూపుదిద్దుకున్న ఇండియా కూటమి కి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది.

ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడనే లేదు. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా జరగలేదు. ఆ రకంగా వ్యవహారాలు ఒక కొలిక్కి రానేలేదు. అంతలోనే కూటమి ఐక్యతకు గండి పడింది. పశ్చిమబెంగాల్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా మాత్రమే పోటీచేయనున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

ఇం.డి.యా. కూటమిలో అత్యంత కీలక పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉంటుంది. అదే సమయంలో ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఆశిస్తున్న వారిలో మమతా దీదీ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అయితే కూటమి ఐక్యత ను పణంగా పెట్టి అయినా.. తన సొంత పార్టీకి మెజారిటీ సీట్లు దక్కించుకునే విషయంలో మాత్రం ఆమె ఏమాత్రం రాజీపడడం లేదు.

42 సీట్లున్న పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెసు పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తాం అని ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీని హేళన చేస్తూ మాట్లాడడం ఆమె వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోకి అడుగుపెట్టిన రాహుల్ న్యాయ్ యాత్రను కూడా ఆమె చులకన చేసి మాట్లాడుతున్నారు.

మమతా దీదీ ఏకపక్ష పెత్తందారీ ధోరణులు ఇండియా కూటమిని దెబ్బతీసేలాగానే కనిపిస్తున్నాయి. 42 సీట్లున్న వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెసు పార్టీకి కేవలం రెండే సీట్లు కేటాయిస్తామని అనడం ఆమె అహంకారానికి నిదర్శనంగా ఆ పార్టీ వ్యాఖ్యానిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకుంది. 2019లు వారి గెలుపు రెండు సీట్లకే పరిమితమైంది. వారి బలం ఉన్నది రెడు సీట్లే గనుక.. ఆ రెండు మాత్రమే కేటాయిస్తాం అనేది మమతా ప్రతిపాదన. అలాగని ఆమె పార్టీ మిగిలిన 40 సీట్లలో విజయం సాధించిందేమో అనుకుంటే పొరబాటే.

2014 ఎన్నికల్లో 34 సీట్లు కలిగిఉన్న తృణమూల్ బలం, 2019 ఎన్నికల్లో కేవలం 22 కు పడిపోయింది. 2014లో కేవలం 2 సీట్లు కలిగిఉన్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 18 స్థానాలకు ఎగబాకింది. తమకు ప్రస్తుతానికి 22 సీట్లే ఉన్నప్పటికీ.. మొత్తం 40 కోరుకుంటూ, కాంగ్రెసుకు మాత్రం సిటింగ్ 2 సీట్లు చాలని మమతా భావించడం ఐక్యతకు గొడ్డలిపెట్టుగా మారుతోంది.

ఆమె అహంకారాన్ని ధిక్కరించి.. ఒంటరిగా పోటీచేసి నెగ్గడం ఎలాగో తమకు తెలుసునని కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. బహుశా వామపక్షాలతో వారి ఐక్యత అక్కడ కూడా కొనసాగవచ్చు. ఇలా కీలక కూటమి పార్టీలు విడివిడిగా పోటీచేస్తే.. బిజెపి ఖచ్చితంగా ఎడ్వాంటేజీ సొంతం చేసుకుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?