‘వేటు’ పంచాయతీ.. ఇప్పట్లో ఒక కొలిక్కి రాదా?

రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో ఎటువంటి చాన్స్ తీసుకోకుండా ఉండడానికి, వీలైనంత వరకు బలాబలాలను దృఢం చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ‘వేటు వ్యూహం’ అంత తేలికగా ఫలించే వాతావరణం కనిపించడం లేదు.…

రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో ఎటువంటి చాన్స్ తీసుకోకుండా ఉండడానికి, వీలైనంత వరకు బలాబలాలను దృఢం చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ‘వేటు వ్యూహం’ అంత తేలికగా ఫలించే వాతావరణం కనిపించడం లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేటు చేస్తారనే అనుమానంతో, ప్రత్యర్థి తెలుగుదేశానికి ఏమాత్రం బలం లేకపోయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యలుగా ఫిరాయింపు ఆలోచన ఉన్న వారిపై వేటు వేసేయాలనే సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రారంభించిన కసరత్తు అనుకున్నట్టుగా సాగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సంజాయిషీ చెప్పుకోవాలంటూ.. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకరు జారీ చేసిన నోటీసులకు వారు రాసిన ప్రత్యుత్తరం గమనిస్తే ఇలాగే అనిపిస్తుంది.

మూడు రాజ్యసభ స్థానాలకు ఏపీ అసెంబ్లీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నారు. ఒక్కో ఎంపీకి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. 151 సీట్లున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు కేవలం 132 ఓట్లు చాలు. ఎట్టి పరిస్థతుల్లోనూ మూడు సీట్లను వారు గెలుచుకునే చాన్సుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చాన్స్ తీసుకునే ఉద్దేశంతో లేరు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన నలుగురు వైసీపీ ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయించాలనే అనుకున్నారు. స్పీకరు సీతారాం వారికి నోటీసులు ఇవ్వగా, తాజాగా వారు ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. సమాధానం ఇవ్వడానికి తమకు 30 నుంచి అరవై రోజుల సమయం కావాలని వారు స్పీకరుకు రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈలోగా.. రాజ్యసభ ఎంపీ ఎన్నికలపర్వం పూర్తయ్యే అవకాశం ఉన్నదని బహుశా వారి ఆశగా కనిపిస్తోంది. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లేఖలు రాయగా, మేకపాటి చంద్రశేఖర రెడ్డి లేఖకు డాక్టరు సర్టిఫికెట్ కూడా జోడించడం తమాషా.

వీళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నంత మాత్రాన.. టీడీపీ రాజ్యసభ ఎంపీని నెగ్గుతుందనే గ్యారంటీ లేదు. కానీ వారు ఎంపీ ఎన్నిక పూర్తయ్యే దాకా సాగదీయాలనుకుంటున్నారు. ఇంకొందరు వైసీపీ ఎమ్మెల్యేలనుంచి తమకు ఓట్లు బదిలీ కావొచ్చుననేది చంద్రబాబు వ్యూహం.

వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకరుకు రాసిన లేఖలో.. తమకు ఇచ్చిన నోటీసును నిర్ధరించుకోవాలని అన్నారు. పేపర్, వీడియో క్లిప్పింగులను కూడా కన్ఫర్మ్ చేసుకోవాలని అన్నారు. తమపై ఫిర్యాదుచేసిన వారు ఇచ్చిన ఆధారాల్ని, ఒరిజినల్స్ ను, సోషల్ మీడియా పోస్టింగుల ఐపీ అడ్రసుల్ని కూడా వారు అడిగారు. ఈ పర్వం మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఐపీ అడ్రసులు కూడా ఇవ్వడం వెంటనే జరగదు. అంతా జరిగినా.. వారు మరో మడత పేచీతో ముందుకు రావొచ్చు. ఒకవేళ దూకుడుగా నిర్ణయం తీసుకుని స్పీకరు వారి మీద వేటు వేసినా కూడా.. వారు హైకోర్టుకు వెళతారు.

హైకోర్టులో కేసు తేలేవరకు తమను ఎమ్మెల్యేలుగానే గుర్తించాలని.. రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో ఓటు అవకాశం ఉండాల్సిందేనని కోరుతారు. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి గనుక.. వారిపై వేటు వేయాలనుకున్న పంచాయతీ ఇప్పట్లో ఒక కొలిక్కి రాదని పలువురు అంచనా వేస్తున్నారు.