ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్‌కి బోణీ నిల్?

కాంగ్రెస్ ఒకనాడు జాతీయ పార్టీ. ఇప్పుడు మాత్రం ఏపీలో కుదేల్ అయిన పార్టీ. ఆ పార్టీకి వైఎస్సార్ కుమార్తె షర్మిల నాయకత్వం వహిస్తున్నారు అని జనంలోకి కొత్తగా వచ్చే ప్రయత్నం జరుగుతోంది. షర్మిల ఇలా…

కాంగ్రెస్ ఒకనాడు జాతీయ పార్టీ. ఇప్పుడు మాత్రం ఏపీలో కుదేల్ అయిన పార్టీ. ఆ పార్టీకి వైఎస్సార్ కుమార్తె షర్మిల నాయకత్వం వహిస్తున్నారు అని జనంలోకి కొత్తగా వచ్చే ప్రయత్నం జరుగుతోంది. షర్మిల ఇలా వచ్చీ రాగానే భారీ ఎత్తున చేరికలు వలసలు కాంగ్రెస్ లో ఉంటాయని భావించారు.

అయితే దానికి భిన్నంగా పరిస్థితి ఉంది. నాయకులు కూడా టికెట్ కోసం వైసీపీలో చోటు లేకపోతే టీడీపీ- జనసేన కూటమి వైపు చూస్తున్నారు. రేపటి రోజున బీజేపీ పొత్తు కలిస్తే ఆ వైపు వచ్చేందుకు మరి కొందరు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి పోటీ చేశామన్న ఆనందం తప్ప గెలుపు దిశగా అడుగులు పడవని అందరికీ తెలుసు.

అందుకే పాత కాపులు మాజీలు అంతా కూడా కాంగ్రెస్ కి దూరం పాటిస్తున్నారు. ఒకనాడు ఉత్తరాంధ్రా జిల్లాలు కాంగ్రెస్ కి పెట్టని కోట. ఈ జిల్లాలలో కాంగ్రెస్ నుంచి చాలా మంది గెలిచిన వారు ఉన్నారు. చక్రం తిప్పిన వారు ఉన్నారు. అయితే వారిలో ఇప్పుడు ఎవరూ కూడా కాంగ్రెస్ వైపు చూడటం లేదు.

పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్రా వైపే చూశారు. ఇక్కడే కాంగ్రెస్‌ని పటిష్టం చేయాలనుకున్నారు. ఆమె ఇచ్చాపురం నుంచి కార్యక్రమం మొదలెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ లో పనిచేసి వేరు వేరు పార్టీలలో ఉన్న పలువురు నాయకులను కదిపి చూశారని అంటున్నారు. అయితే వారంతా సానుకూలంగా స్పందించలేదు అని అంటున్నారు.

కాంగ్రెస్ లో పనిచేసి వైసీపీలో ఉన్న వారు టీడీపీ గూటికి చేరిన వారు ఉన్నారు. అక్కడ టికెట్ రాకపోయినా వారు అక్క‌డే ఉండేందుకే రెడీ అయ్యారు తప్ప కాంగ్రెస్ వైపు వచ్చేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడంలేదు అని అంటున్నారు

దాంతో కాంగ్రెస్ నేతలు కొంతమంది ఫోన్లు చేసి ఆహ్వానించినా వారి నుంచి ఇదే రకమైన రియాక్షన్ వచ్చింది అని అంటున్నారు. వైఎస్సార్ కి ఆప్తమిత్రుడిగా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ ఇంటికి స్వయంగా షర్మిల వెళ్లారు. ఆయనతో మాట్లాడారు. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన కొణతాల జనసేనలో తాను చేరుతున్నట్లుగానే మాట్లాడారు.

ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నారు కూడా. దాంతో షర్మిల ప్రయత్నం ఫలించలేదని అంటున్నారు. విశాఖ నుంచి కాంగ్రెస్ లో చేరాలని ఆసక్తిని చూపిస్తున్న వారిలో మాత్రం వైసీపీ నుంచి మూడేళ్ల క్రితం సస్పెండ్ అయిన ఒక నేత ఉన్నారని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని తెలుస్తోంది.

ఇలా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చూసే వారు ఒక మాదిరి నాయకులను చేర్చుకునే ప్రయత్నంలో అయితే కాంగ్రెస్ ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో అయితే కాంగ్రెస్ కి సరైన బోణీ అయితే పడలేదని అంటున్నారు.