కాంగ్రెస్ పార్టీలోకి వృద్ధ నాయకులు వెళ్లే అవకాశం ఉంది. రాజకీయం అంటే మత్తులాంటిది. రాజకీయాలకు అలవాటు పడిన నేతలు… ఊరికే ఉండలేరు. పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటేనే వారికి మనశ్శాంతి. వయసు పైబడి, ప్రజాదరణ కోల్పోయిన నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో ఒక వేదిక కనిపిస్తోంది.
అంతేకాకుండా, దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు వహిస్తుండడంతో కొందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలలో టికెట్లు దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అసలే ఎన్నికల సీజన్ కదా ఇది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక పార్టీ, గుర్తు కావాలని కోరుకునే వారికి కాంగ్రెస్ బెటర్ అనిపిస్తోంది.
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేని సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిల నాయకత్వం వహిస్తుండడంతో ఎంతోకొంత ప్రయోజనం ఉండకపోతుందా? అనేది ఆ నాయకులు నమ్మకం. ఇప్పటికే కాంగ్రెస్‌లో మాజీ మంత్రి, కడప సీనియర్ నాయకుడు అహ్మదుల్లా చేరారు. రానున్న ఎన్నికల్లో ఆయన కడప నుంచి పోటీ చేయనున్నారు.
తాజాగా కాంగ్రెస్‌లో చేరతారని మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డి, అలాగే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ దక్కని పక్షంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వీళ్లంతా దివంగత వైఎస్సార్‌కు సన్నిహిత నేతలుగా గుర్తింపు పొందారు.
తన తండ్రికి ఆప్తులైన సీనియర్ నేతలపై షర్మిల దృష్టి సారించారు. విశాఖ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికెళ్లి మరీ ఆయన్ను కలుసుకున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీలో టికెట్ దొరక్కపోవడం, కాంగ్రెస్ పార్టీ ఖాళీగా కనిపిస్తుండడంతో అదే బెటర్ అని ఆలోచించే నేతలు లేకపోలేదు.