నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబునాయుడు తీవ్ర నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుంటారు. ఇది ఆయన బలహీనత. అయితే ఇదే తన బలమని ఆయన అనుకుంటుంటారు. చివరి వరకూ తేల్చకుండా ఉండడం చంద్రబాబు పని విధానం. దీన్ని ఎవరూ ఏమీ చేయలేరు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నాయకుడు కూడా పంథా మార్చుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటుంటారు. కానీ తాను మారని నాయకుడినే అని బాబు నిరూపించుకోవడానికే ఇష్టపడతారు.
తాజాగా అభ్యర్థుల ఎంపికపై కూడా బాబు తీవ్ర నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఈ వైఖరిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అసహనంగా ఉన్నారు. మరోవైపు బాబు ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి 58 మంది వరకూ ఎంపిక చేశారు. ఇవన్నీ కూడా మార్పులుచేర్పుల జాబితా కావడం గమనార్హం.
కొత్త వారిని ఎంపిక చేయాలనుకునే చోట ఆ పని చకచకా చేశారు, చేస్తున్నారు. దీని వల్ల ఎన్నికల నాటికి అసమ్మతులు సర్దుబాటు అవుతాయనేది జగన్ వ్యూహం. కానీ చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ జాబితా విడుదల చేయనని అంటున్నారని సమాచారం. దీంతో టీడీపీ ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కనీసం క్లియర్‌గా ఉన్న చోటైనా అభ్యర్థులను ప్రకటిస్తే నష్టం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అసలే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ కేటాయిస్తారనే సంగతి తెలియక… ఇరుపార్టీల నేతలు జుత్తు పీక్కుంటున్నారు. చివరి వరకూ సీట్లు, అభ్యర్థులను తేల్చకపోతే రాజకీయంగా వైసీపీ లాభపడుతుందనే భయం ఇరు పార్టీల నేతల్లో నెలకుంది.
జగన్‌ను చూసైనా చంద్రబాబు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదని బాబును బాగా అభిమానించే సీనియర్ నేతలు కూడా అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల చివరి రోజు వరకూ అభ్యర్థులను ప్రకటిస్తూ పోతే, ఇక ప్రచారం చేసుకునేదెప్పుడు? అసంతృప్తులను చల్లబరుచుకునేదెన్నడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.