తెలంగాణ రాజకీయాల్లో తనకు భవిష్యత్ లేదని ఆంధ్రప్రదేశ్ బాట పట్టిన షర్మిల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు షర్మిల, నర్రెడ్డి సునీతలను పోల్చుకుంటూ, ఎవరు బెటరో చర్చించుకుంటున్నారు. ఏ రకంగా చూసినా డాక్టర్ సునీత హూందాగా ప్రవర్తిస్తున్నారనే టాక్ వినిపించడం గమనార్హం.
డాక్టర్ నునీత తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన దోషులకు శిక్ష పడాలనే పట్టుదలతో న్యాయ పోరాటం చేస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు. కానీ షర్మిల ఎవరి కోసం, ఎందుకోసం నానా యాగీ చేస్తున్నారో అర్థం కావడం లేదనే మాట వినిపిస్తోంది. పైగా వివేకా కుమార్తె సునీత ఏనాడూ నోరు తెరిచి కేసుకు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదని, అది కూడా న్యాయ పోరాటానికే పరిమితం అయ్యారని అందరూ చెప్పే మాట.
రాజకీయాల గురించి సునీత ఎప్పుడూ మాట్లాడలేదని, ముఖ్యంగా తన పెదనాన్న కుమారుడు వైఎస్ జగన్కు నష్టం కలిగించేలా ఆమె ప్రవర్తించలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఇదే షర్మిల విషయానికి వస్తే అతి చేస్తోందన్న విమర్శ ఎదుర్కొంటున్నారు.
వైఎస్సార్ కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా తెలంగాణకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా మూతి పళ్లు రాల్చుకొచ్చారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి, ఉనికే లేని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించగానే, నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారనే చర్చ నడుస్తోంది.
ఇదంతా ఏ లక్ష్యం కోసం చేస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. కానీ సునీత ఎప్పుడూ ఇలా మాట్లాడని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. షర్మిల అతి మామూలుగా లేదని, రానున్న రోజుల్లో మరింతగా ఆమె నోటికి పని చెబుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు.