సినిమాల్లో హీరోలని చూస్తుంటాం. సిన్సియర్ ఆఫీసర్స్ గా నటిస్తారు. అన్యాయంపై తిరగబడతారు. ఆ ప్రోసెస్ లో ఆ హీరోపై ఎందరో పలుకుబడి ఉన్నవాళ్లు ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగరు. ఆ సీన్స్ చూసి జనం ఈలలు వేసి వాళ్లని స్టార్స్ ని చేస్తారు. “కర్తవ్యం”లో విజయశాంతి పోషించిన అలాంటి పాత్ర వల్ల ఆమెని లేడీ అమితాబ్ అని కూడా కొనియాడారు. దశాబ్దాలుగా తెలుగుతెర మీద చూసిన ఇలాంటి సినిమాలు కోకొల్లలు. అలాంటి సినిమా తీసిన నిర్మాతలంతా ఆదర్శవంతమైన చిత్రాలందించామని కాలరెగరేసి చెప్పుకున్నవాళ్లే.
అయితే అలాంటి హీరోయిజం ఉన్న వ్యక్తులు సమాజంలోకొస్తే ఈ హీరోలు, నిర్మాతలు ఎలా ప్రవర్తిస్తారు? అక్షరాలా విలన్స్ లాగానే ప్రవర్తిస్తారు. ఇదేదో జోస్యమో, అభిప్రాయామో చెప్పడం కాదు..గతించిన కాలంలో ఒక ఆఫీసర్ కథే ఇది.
కొన్నేళ్ల క్రితం ధనలక్ష్మి అనే ఆఫీసర్ పేరు తరచూ వినిపిస్తూ ఉండేది. ఆమె సెన్సార్ బోర్డ్ కమీషనర్ గా పనిచేసారు. ప్రతిదీ రూల్ ప్రకారం నడుచుకునే వారు. ఏ నిర్మాత యొక్క పలుకుబడికి, డబ్బుకి లొంగేవారు కాదు. ఆమె నిబద్ధత చూసి అసలు సెన్సార్ బోర్డ్ ఇంత పవర్ఫుల్లా అని అటు ప్రభుత్వం వైపు మనుషులు, ఇటు సినీరంగ ప్రముఖులు అనుకునేవారు. ఎందుకంటే అలాంటి ఆఫీసర్ వాళ్లకి తగల్లేదు మరి.
సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ సర్టిఫికేట్ తప్పనిసరి. తాము తీసిన సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలో, బూతులో, హింసాత్మక దృశ్యాలో ఉంటే వాటిని కట్ చేసి పట్టుకురమ్మంటారు సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్. ఆ కట్స్ అన్నీ జరిగాక కమీషనర్ సంతకం పెట్టాక సెన్సార్ సర్టిఫికేట్ బయటికొస్తుంది.
అయితే సినిమాని సెన్సారాఫీసు వరకు తీసుకువెళ్లడం, నమోదు చేయడం, మెంబర్స్ చూసాక కట్స్ తెలుసుకుని ఎడిట్ రూం కి తీసుకురావడం, కట్స్ అయ్యాక మళ్లీ తీసుకువెళ్లడం, సర్టిఫికేట్ వచ్చే వరకు పడిగాపులు కాసి తీసుకురావడం…ఈ పనులన్నిటికీ ఏజెంట్స్ నో, ప్రొడక్షన్ వాళ్లనో పెట్టుకుని నడిపించేవాళ్లు బడా నిర్మాతలు. కానీ రూల్ ప్రకారం నిర్మాత స్వయంగా సెన్సారాఫీసుకొచ్చి పెట్టాల్సిన సంతకాలు కొన్నుంటాయి. ఆ పనికి నిర్మాతల్నే రమ్మనేవారు ధనలక్ష్మి. ఆమె ఇచ్చిన టైముకి రాకపోతే ఫైల్ పక్కనపెట్టేవాళ్లు. ఆ ప్రక్రియలో కొందరు బడానిర్మాతల, హీరోల ఈగోలు దెబ్బతిన్నాయి. తెర మీద హీరోలుగా నటించిన వాళ్లు, ఆ తరహా సినిమాలు తీసిన వాళ్లు సైతం ఆమె పాలిటి విలన్లైయారు. ఆమెపై హరాస్మెంట్ కేసులు పెట్టారు. ఆమె మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. డబ్బు ఇవ్వజూపినా, కేసులుపెట్టినా, మరోలా భయపెట్టినా ఆమె అస్సలు ఖాతరు చేయకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
సాధారణంగా “ఏ” సర్టిఫికేట్ సినిమాలు కొన్నుంటాయి. రూల్ బుక్ ప్రకారం కొన్ని రకాల సన్నివేశాలుండి అవి కట్ చేయడం కుదరదంటే “ఏ” సర్టిఫికేట్ ఇస్తుంది సెన్సార్ బోర్డ్. సర్టిఫికేట్ ఇవ్వడం సెన్సార్ బోర్డ్ పని. కానీ చట్టాన్ని అమలు చేయడం పోలీసుల పని. “ఏ” సర్టిఫికేట్ సినిమాలకి 18 ఏళ్లకంటే వయసు తక్కువున్న పిల్లలు థియేటర్స్ కి రానీయకూడదు. అసలీ మధ్య కాలంలో పిల్లల్ని రానీయని సినిమాలేవైనా మీకు గుర్తున్నాయా? అంటే “ఏ” సర్టిఫికేట్స్ లేవని కావు. ఉన్నా, లేకపోయినా ఏం ఫరక్ పడట్లేదు. అదీ పరిస్థితి. కానీ అప్పట్లో ధనలక్ష్మి హయాములో ఎన్నో సినిమాలకి “ఏ” ఇవ్వడమే కాకుండా హాలుదగ్గర పోలీసుల్ని పెట్టించి మరీ చట్టాన్ని అమలు చేయించేవారు. ఆఖరికి నాగార్జున “రభస” కూడా ఆ పరిస్థితి ఎదుర్కుంది. పిల్లల్ని హల్లోకి రానీవకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఇలా మొత్తం సినీరంగాన్ని డిసిప్లైన్లో పెట్టే పని పెట్టుకుందామె. ఆమె ఉన్నంతకాలం సినీరంగం అటెన్షన్లోనే ఉంది. ఏ సీన్ పెడితే ఏం గోలో అని జాగ్రత్తగా నడుచుకోవడం మొదలుపెట్టిన దర్శకహీరో నిర్మాతలున్నారు అప్పట్లో. కొందరికి ఇంకా అహంకారం అణగాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఆమె ట్రాన్స్ఫర్ అయ్యింది. పరిస్థితులన్నీ మళ్లీ యథాస్థితికి వచ్చేసాయి. సెన్సార్ బోర్డును “ధనలక్ష్మి ముందు- ధనలక్ష్మి తర్వాత” అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ముందు, ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న ఎవరి పేరు పెద్దగా తెలీదు.
ఈమధ్యన వస్తున్న సినిమాల్లో బూతులు పెరిగిపోయాయి. వాటికి మొక్కుబడిగా మ్యూట్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. పైగా అమెరికాకి వెళ్లే ప్రింట్లలో అసలా కట్సే ఉండట్లేదు. దానికి తోడు యూ.ఏ సర్టిఫికేట్టే తప్ప “ఏ” లు లేవు. ఉన్నా ఏం తేడా లేదు.
అసలు సెన్సార్ బోర్డుని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ఏమనాలి? దీనిపై పెద్దగా ఎవ్వరూ గొడవచేయట్లేదు కాబట్టి ఆ వ్యవస్థలన్నీ వేరే పని చేస్కుంటున్నాయల్లే ఉంది.
ఏమన్నా అంటే ఓటీటీల్లో హింస, అశ్లీలం రెచ్చిపోతుంటే ఇంకా హాల్లో వచ్చే సినిమాల గురించి వాపోతారేంటని అనవచ్చు. అలాంటప్పుడు అసలు సెన్సార్ బోర్డునే ఎత్తేస్తే సరిపోతుంది. లేదా ఓటీటీలకి కూడా సెన్సార్ పెట్టాలి. అంతే తప్ప సగం సగం పనులెందుకు? ప్రస్తుతానికి సినిమాలకి సెన్సార్ బోర్డంటూ ఉంది కాబట్టే ఈ వ్యాసం. తప్పొప్పులు చెప్పాల్సిన పవర్ ఉన్న చోట కూడా కఠినంగా లేకపోతే ఏ రంగంలోనైనా అరాచకవాదం బయలుదేరుతుంది.
ఏం తీసినా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో ప్రతీదీ దర్శకనిర్మాతల విజ్ఞతకి వదిలేయలేం. ఎందుకంటే ఎవరి వికారాలు వాళ్లకుంటాయి. ఇలాగే వదిలేస్తే కల్ట్ చిత్రాల పేరుతో విశృంఖలత్వం, అసభ్యపదజాలం జనబాహుళ్యంలోకి తర్వాతి తరాలకి యాక్సెప్టెబుల్ రేంజుకి వెళ్లిపోతాయి. అప్పుడు పార్లమెంటులో కూడా “అన్ పార్లమెంటరీ వర్డ్” అని అరవడానికి ఉండకపోవచ్చు. అంతటి దిగజారుడుతనం మన దేశానికి అవసరంలేదు.
– శ్రీనివాసమూర్తి