బిజెపి వారు 4 రాష్ట్రాలలో అధ్యక్షులను మార్చారు. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణలో ఎగ్రెసివ్‌గా ఉండే బండి సంజయ్ స్థానంలో సాఫ్ట్‌గా ఉంటూ అందరి చేత మర్యాదస్తు డనిపించుకునే 59 ఏళ్ల కిషన్ రెడ్డిని, ఆంధ్రలో సోము వీర్రాజు స్థానంలో ప్రస్తుతం తీరికగా ఉన్న 64 ఏళ్ల పురందేశ్వరిని నియమించారు. బండి సంజయ్‌ను మారుస్తారనీ లేదనీ చాలాకాలంగా ఊహాగానాలున్నాయి కానీ ఎవర్ని వేస్తారో తెలియలేదు. కిషన్ రెడ్డి విముఖత కూడా తేటతెల్లంగా తెలియడంతో ఆయన్ను ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక సోము వీర్రాజు మార్పు గురించి చర్చ రాలేదు. ఆంధ్ర బిజెపిని అధిష్టానం గాలికి వదిలేసిందని అనుకుంటూండగా హఠాత్తుగా పురందేశ్వరి తెరపైకి వచ్చారు. ఏ అసెంబ్లీ ఎన్నికల కైనా ఏడాది ముందే ప్లాన్ చేసి పెట్టుకునే బిజెపి తెలంగాణ విషయంలో ఐదు నెలల ముందు అధ్యక్షుణ్ని ఎందుకు మార్చిందో, ఆంధ్రలో కాడి పారేసి, హైదరాబాదులోనే మకాం పెట్టిన పురందేశ్వరిని ఎందుకు ఎంపిక చేశారో ఎవరూ సరిగ్గా చెప్పలేక పోతున్నారు. ఎవరి ఊహాగానాలు వారివి. మన వంతు గానం మనమూ చేద్దాం.
ముందుగా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే (ఆంధ్ర గురించి ‘‘పురందేశ్వరి నియామకం’’ అని వేరే వ్యాసం రాస్తాను) అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఐదు నెలలుండగా బండిని మార్చడానికి బలమైన కారణమే ఉండాలి. కర్ణాటక బిజెపి అధ్యక్షుడు నళిన్ కుమార్ పదవీకాలం 2022 ఆగస్టులో అయిపోయినా ‘జస్ట్ 9 నెలల్లో, అంటే 2023 మేలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి కదా’ అంటూ మార్చలేదు. మరి తెలంగాణలో అంతకంటె సగం వ్యవధే ఉన్నా మార్చేశారు. ఆంధ్రలో సోము వీర్రాజు మూడేళ్ల పదవీకాలం యీ జులైతో ముగిసింది. ఆయనకు ముందున్న కన్నా లక్ష్మీనారాయణను పదవీకాలం ముగిసేందుకు 10 నెలల ముందుగానే మార్చేశారు. సోమును మర్యాదగానే సాగనంపారు. కర్ణాటకలో చేసినట్లు 2024 మే ఎన్నికల కోసం సోమును కంటిన్యూ చేద్దామని అనుకోలేదు. తనను దింపేసినందుకు సోము అసంతృప్తి వెల్లడించలేదు. తెలంగాణలో బిజెపిది బహునాయకత్వ సమస్యయితే, ఆంధ్రలో నాయకుల కొరత సమస్య.
2019లో ఎంపీ అయ్యాకనే బండి పేరు రాష్ట్రస్థాయిలో వినబడసాగింది. 2014లో, 2018లో అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన ఓడిపోయాడు. 2020 మార్చిలో రాష్ట్రాధ్యక్షుడు కావడంతో యిక విజృంభించాడు. అదే ఏడాది డిసెంబరులో జరిగిన హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో బిజెపి బలం 4 నుంచి 48కి పెరగడంతో బండి ఆత్మవిశ్వాసం బండిచక్రమంత అయిపోయింది. అట్టహాసం పెరిగి, బిజెపిలో తనే ఏకైక నాయకుణ్ని అనుకోసాగాడు. 2021 హుజూరాబాద్ ఉపయెన్నికలో ఈటెల తన స్వయం ప్రతిభతో గెలిస్తే తన కారణంగానే అనుకున్నాడు, అదే సమయంలో నాగార్జున సాగర్ ఉపయెన్నికలో బిజెపి ఘోరపరాజయం పొందిందని మరిచాడు. 2022 మునుగోడు ఉపయెన్నికలో రాజగోపాల రెడ్డి ఓడిపోయినా గట్టి పోటీ యివ్వడానికి తనే కారణమనుకున్నాడు. పోనుపోను తనను తాను కెసియార్‌కు ప్రత్యామ్నాయంగా ఊహించుకో సాగాడు.
ఈ యాటిట్యూడ్ వలననే బండికి పార్టీలో కూడా శత్రువులు పెరిగారు. అతని వివాదాస్పద వ్యాఖ్యలు, అతి హిందూత్వ వాదం సాధారణ ప్రజలకు చికాకు కలిగించసాగింది. ఎగ్రెసివ్‌గా ఉండడం చేతనే కార్యకర్తల్లో హుషారు కలిగించగలనని అతను నమ్మాడు. పార్టీలో తక్కినవారిని పక్కకు నెట్టి, తననే ప్రొజెక్టు చేసుకోవడం మొదలెట్టాడు. అది ఏ మేరకు వెళ్లిందో ఒక ఉదాహరణ చెప్తాను. 2021 జూన్‌లో సామవేదం షణ్ముఖశర్మ గారి శిష్యులు ఆయన రఘువంశంపై యిస్తున్న ఉపన్యాసాలను యూట్యూబ్‌లో లైవ్ యిచ్చారు. ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పరచి వారందరికీ లింకు పంపిస్తూ లైవ్‌లో చూస్తూ వ్యాఖ్యలు చేసే వెసులుబాటు కల్పించారు. శర్మగారిని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు పెట్టేవారి మధ్య బండి సంజయ్ అనుచరులు చొరబడ్డారు. జై శ్రీరామ్, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కామెంట్లు పెట్టి భక్తులందర్నీ విసిగించేశారు.
ఈ తరహా కాంపెయినింగ్ వలన బిజెపిలో కూడా కాంగ్రెసు మార్క్ అంతఃకలహాలు పొడసూపాయి. ఎప్పణ్నుంచో తెలంగాణలో బిజెపిని నిలబెడుతున్న నాయకులందరికీ ‘వెనక వచ్చిన కొమ్ములు వాడి’ అనే తరహాలో బండి వ్యవహరించడం యిబ్బందిగా మారింది. ఇతని దగ్గర్నుంచి సముచిత గౌరవం లభించక పోయినా కానీ అధిష్టానం బ్యాకింగ్ ఉంది కదా అని మౌనంగా భరించారు. ఇక కొత్తగా పార్టీలోకి వచ్చిన రఘునందన్, ఈటెల, రాజగోపాల రెడ్డి మాట చెప్పనే అక్కరలేదు. స్వయం ప్రతిభ కల వీరికి ముఖ్యమైన పనులు అప్పచెప్పి ఉంటే ఎంతో కొంత విలువుండేది. సర్వం తానే అన్నట్టు ఉండేది బండి శైలి. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్‌తో తర్వాతి సిఎం తనే అనే స్టయిల్లో హంగామా జరిగింది. అందుకే రఘనందన్ అడిగాడు, 2019కి ముందు ఠికాణా లేని నీకు యాడ్స్కై రూ.100 కోట్లు ఎక్కణ్నుంచి వచ్చాయని. బిజెపి అధిష్టానం యిప్పటివరకు రఘునందన్‌పై చర్య తీసుకోలేదంటే అతని ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉందనేగా! ప్రతిపక్షంలో ఉండగానే యిన్ని ఆరోపణలు మూటగట్టుకుంటే, యిక ముఖ్యమంత్రి అయితే ఎన్ని మూటలు కడతాడో అని భయం వేసింది.
ఇక ఈటెల మంచి నాయకుడు. సాత్వికుడు, పరోపకారి. ఏ పదవి యిచ్చినా చక్కగా నిర్వహించాడు. బిజెపిలోకి వచ్చాక పనే లేదు. చేరికల కమిటీ చైర్మన్ అని ఖాళీ కౌంటర్లో కూర్చోబెడితే ఎలా? బండి తీరు కారణంగా పార్టీలో చేరేవారే లేరు. ఎవరి దగ్గరకైనా వెళ్లి చేరమంటే, చేరి నువ్వేం సాధించావు చెప్పు అంటే ఈటెల వద్ద సమాధానం లేదు. అదే బహిరంగంగా చెప్పుకుని వాపోయాడు. రాజగోపాల రెడ్డిదీ అదే పరిస్థితి. అతను అంతిమంగా ఓడిపోయినా, ఆ నియోజకవర్గంలో తనొక పెద్ద ఫోర్స్ అని నిరూపించుకున్నాడు. అలాటివాడికి సమీప జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నిర్మించే పని అప్పగించాలి కదా! కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి బాగా నెగ్గితే తన ప్రతిభ అని చెప్పుకున్న బండి, మరి ఉపయెన్నికలలో ఓటమికి బాధ్యత వహించి రాజీనామా ఆఫర్ చేయాలిగా!
బండి స్టయిల్ నచ్చక మార్చమని యితర బిజెపి నాయకులు చాలాకాలంగా అడుగుతున్నా అధిష్టానం మెదలకుండా కూర్చుంది. తెలంగాణలో బండి తరహా దూకుడు రాజకీయాలే సరైనవని నమ్మింది కాబోలు. ఈటెల వగైరాలు వలస నాయకులు, బండి సంఘీయుడు. కానీ సాటి సంఘీయులు, ఎప్పణ్నుంచో తెలంగాణలో బిజెపిని నడిపిస్తున్న డా. లక్ష్మణ్ వంటి అనేకమంది నాయకులున్నారు కదా. వారికి కూడా ప్రాధాన్యత యివ్వకుండా కేవలం బండితోనే బండి లాగించేద్దామని, కెసియార్‌ని ఢీ కొట్టడానికి దక్షిణాది యోగి ఆదిత్యనాథ్‌గా అవతరిస్తున్న బండికి మాత్రమే సామర్థ్యం ఉందని బిజెపి అధిష్టానం అనుకుంటూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకుని వస్తున్నా తొందర పడలేదు. ఇంతలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఉత్తరాది తరహా విభజన రాజకీయాలు దక్షిణాదిన పని చేయవని బిజెపికి తోచింది. హిందూత్వ ఎంతోకొంత స్థాయిలో కొన్ని దశాబ్దాలుగా పని చేసిన కర్ణాటకలోనే యీసారి గెలుపు నీయలేక పోవడంతో అది సందేహంలో పడింది.
తెలంగాణలో హిందూత్వ ఎన్నడూ బలంగా లేదు. మత రాజకీయాలు మజ్లిస్‌కే, అదీ కొన్ని నియోజకవర్గాలకే పరిమితం. దశాబ్దాల రాజకీయం తర్వాత కూడా దానికి దక్కేది ఒకే ఒక్క పార్లమెంటు సీటు, 7 అసెంబ్లీ సీట్లు, 3% ఓట్లు. మజ్లిస్ నాయకులు మళ్లీమళ్లీ ఎన్నుకోబడడానికి కారణం మతం కంటె, వాళ్లు ఓటర్లకు అందుబాటులో ఉండడమే కారణమనే వాదన ఉంది. ఎందుకంటే ఇస్లాం ఎజెండాతో ముందుకు వచ్చిన యితర ముస్లిం పార్టీలను ఓటర్లు ఆదరించలేదు. ఇక హిందూ పార్టీగా పేరు బడిన బిజెపి కూడా 2019 పార్లమెంటు ఎన్నికలలో 4 సీట్లు గెలవడం తప్పిస్తే గొప్పగా ఎప్పుడూ పెర్ఫామ్ చేయలేదు. 2014లో టిడిపి పొత్తుతో 5 అసెంబ్లీ సీట్లు గెలిస్తే 2018లో ఒంటరిగా పోటీ చేస్తే దానికి 1 వచ్చింది. 7% ఓట్లు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైనా, తర్వాత తెలంగాణలో నైనా నెగ్గిన బిజెపి వారు సొంత యిమేజితో ఓటర్లలో ఉన్న పలుకుబడితో గెలిచారు. కేవలం హిందువులని కాదు.
మీడియాలో ఎంత హడావుడి చేసినా బిజెపి యీ ఏడాది తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పరిశీలకులెవరూ నమ్మరు. కానీ పార్టీ సొంతంగా ఎదిగి, బలమైన ప్రతిపక్షంగా, తెరాస (అదే లెండి భారాస)కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని అధిష్టానం ప్లాను. తన మాట ఎలా ఉన్నా కాంగ్రెసును ప్రధాన ప్రతిపక్షం స్థానం నుంచి దింపాలని దీక్ష పట్టింది. కవిత మద్యం కేసులో యిరుక్కున్న కారణంగా కెసియార్ మోదీతో రాజీ పడ్డారని, తెరాస-బిజెపికి మైత్రీ బంధం కుదిరింది కాబట్టి కెసియార్‌పై ఒంటికాలుపై లేచే బండిని తప్పించివేశారనే విశ్లేషణను నేను ఆమోదించను. ప్రస్తుతానికి రాజీ కుదిరినంత మాత్రాన ఎవరైనా తమ పార్టీని బలహీన పరచుకుంటారా? కాలూనడానికి చోటు లేని త్రిపురలో, ఈశాన్య ప్రాంతాల్లో కూడా కమలాన్ని వికసింప చేసే పట్టుదల, చాకచక్యం ఉన్న మోదీ-అమిత్‌లు ఎంతో కొంత బలం ఉన్న తెలంగాణను కెసియార్‌కు ధారాదత్తం చేస్తారా?
ఎవరితోనైనా బేరాలాడాలంటే బలాన్ని సంతరించుకుని వెళ్లాలని మోదీకి తెలియదా? పార్టీని బలోపేతం చేయడమే మోదీ లక్ష్యం. బండి వలన అది కాదని, అతన్ని కొనసాగిస్తే కాంగ్రెసుకు గతంలో కంటె ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసి, తెలంగాణలో బిజెపి బలాబలాలు క్షుణ్ణంగా తెలిసిన, అట్టడుగు కార్యకర్తలతో కూడా సంపర్కం గల కిషన్ రెడ్డిని తెచ్చారని నా అభిప్రాయం. కిషన్ రెడ్డి వివాదరహితుడు. కలుపుగోరు మనిషి. రాజకీయంగా విభేదించే వాళ్లు సైతం అతన్ని ఏమీ అనరు. ఎన్నో ఏళ్ల పరిశ్రమ అనంతరం కేంద్రమంత్రి అయి, మరింత హుందాతనం తెచ్చుకున్నాడు. నాలుగేళ్ల క్రితం దాకా ఎవరికీ తెలియని బండి వంటివాడు కాదు. బండికి ఓర్పు తక్కువ, పదవుల కోసం తొందర ఎక్కువ. తన అధ్యక్ష పదవి ముగిసిపోయాక ‘జీవితంలో కొన్ని అధ్యాయాలకు ముగింపు ఉండదంతే’ అని వాపోయాడు. దీని భావమేమిటో ఆయనకే తెలియాలి.
ఆయన తన అభీష్టానికి వ్యతిరేకంగానే పదవి వదులుతున్నాడని ఆ వ్యాఖ్య వలన మనకు తెలిసింది. కిషన్ రెడ్డి కూడా తన అభీష్టానికి వ్యతిరేకంగానే పదవి చేపడుతున్నాడనీ తెలియవచ్చింది. ఇలా వెళ్లేవాడు, వచ్చేవాడూ యిద్దరి మనసులనూ కష్టపెట్ట వలసిన అగత్యమేమొచ్చింది బిజెపి అధిష్టానానికి? వీళ్ల మనోభావాల మాట ఎలా ఉంటేనేం, ‘మార్పు మంచిదే’ అని నమ్మడం చేతనే వీళ్ల మెడలు వంచింది. రాష్ట్రంలో 30 సీట్లలో బిజెపికి ఛాన్సుందని కేంద్ర యింటెలిజెన్స్ వర్గాలు చెప్పాయనే వార్త చదివాను. అది ఎప్పటిదో తెలియదు. కర్ణాటక ఫలితం తర్వాత అక్కడ బిజెపిలో నిస్పృహ ఆవరించింది. ఎన్నికలకు ముందు కూడా నాయకుల మధ్య అంతఃకలహాలున్నాయి. ఇప్పుడు ఓటమికి కారణం నువ్వంటే నువ్వనుకోసాగారు. రచ్చకెక్కి కొట్టుకుంటున్నారు. అలాటి 11 మంది బిజెపి నాయకులను గుర్తించిన అధిష్టానం వారిని దారికి తెచ్చే పనిని యెడియూరప్పకు అప్పగించింది.
పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఫలితాలు వచ్చి రెండు నెలలవుతున్నా కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుణ్ని నియమించ లేకపోయారు. కర్ణాటక అధ్యక్షుడి పదవీకాలం ముగిసి 11 నెలలవుతున్నా, కొత్తవాణ్ని వేయలేక పోయారు. ఇప్పుడు నాలుగు చోట్ల మార్చారు కదా, కర్ణాటకలోనూ మారుస్తారని ముందులో వార్తలు వచ్చాయి కానీ సయోధ్య సాధించక పోవడం చేత ఎవర్నీ నియమించ లేక పోయారు. 2024 పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ యిది బిజెపికి తలనొప్పిగా ఉంది. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ బిజెపి నాయకుల్లో సయోధ్య కొరవడింది. కిషన్ వచ్చి ఏదైనా సాధిస్తే తప్ప 30 సీట్లు బిజెపి గెలుస్తుందంటే నమ్మశక్యంగా లేదు. అసలు అంతమంది గట్టి అభ్యర్థులున్నారా అని సందేహం. దిల్లీలో కేంద్ర మంత్రిగా హాయిగా ఉంటున్న నాకు ఎందుకొచ్చిన పీడరా బాబూ యిది అనుకుంటూ వస్తున్న కిషన్ ఏ మేరకు చేయగలరో చూడాలి.
కిషన్ ఎంపికలో కులసమీకరణ కూడా ఉందంటున్నారు. తెలంగాణలో రాజకీయంగా ప్రధానమైన కులాలు రెడ్డి, వెలమ. ఇద్దరి మధ్య పోటీ ఎప్పణ్నుంచో ఉంది. వెలమలకు అనేక ముఖ్య పదవులు దక్కినా, ముఖ్యమంత్రి ఛాన్సు వెంగళరావు తర్వాత కెసియార్‌కు మాత్రమే దక్కింది. ఆయన యిప్పట్లో కదిలేలా లేడు. ఆయన తర్వాత ఆ సీటుపై కూర్చోడానికి కొడుకు సిద్ధంగా ఉన్నాడు. రెడ్లలో యిది అసంతృప్తి కలిగిస్తూ ఉండవచ్చు. వాళ్ల ఓట్లు పొందడానికి గాను రెడ్డి కులస్తుడైన కిషన్‌ను తెచ్చారని ఒక అభిప్రాయం. రేవంత్ రెడ్డిని కాంగ్రెసు అధ్యక్షుడు చేయడంలో కూడా యీ రెడ్డి ఓట్ల ఫ్యాక్టర్ పని చేసిందంటారు. ఉత్తమ్, రెడ్డి అయినా విఫలమయ్యాడు. బండి సంజయ్ మున్నూరు కాపు కులస్తుడు. అతన్ని తొలగిస్తే సంఖ్యాబలం ఉన్న మున్నూరు కాపులకు కోపం రాదా? అంటే ఒకటి రాజకీయంగా వాళ్లు అంత బలమైనవాళ్లు కాదు. రెండు, బండి కులనాయకుడిగా ఎప్పుడూ పేరు తెచ్చుకోలేదు. అతను సంఘీయుడు. అతని బ్రాండ్ అదే! మున్నూరు కాపు సంఘాలు పెట్టి ఉద్యమాలు చేసినవాడు కాదు. తమాషా ఏమిటంటే రెండు రాష్ట్రాలలోనూ నిష్క్రమించిన అధ్యక్షులు కాపు, మున్నూరు కాపు కులస్తులు. వచ్చినవారు రాజకీయంగా ప్రధానమైన కమ్మ, రెడ్డి కులస్తులు.
రెడ్డి కులస్తులు రేవంత్ రెడ్డి కారణంగా యిప్పటికే కాంగ్రెసు పట్ల అనుకూలత చూపిస్తూంటే, వారిని కిషన్ ద్వారా తమ వైపు తిప్పుకోవాలని బిజెపి ఎలా అనుకుంటోంది? రేవంత్ కులరీత్యా రెడ్డి అయినా, రాజకీయబంధం దృష్ట్యా చంద్రబాబు మనిషి. ఆయన ఎప్రూవర్‌గా మారలేదు కాబట్టే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు యిరుక్కోలేదు. బాబే రేవంత్‌ను కాంగ్రెసులోకి పంపారని, యిప్పటికీ సలహా లిచ్చి నడిపిస్తూంటారని చాలా మంది కాంగ్రెసు నాయకుల నమ్మకం. బాబు-రేవంత్ బంధానికి తాజా ఉదాహరణ తానా సభలకు రేవంత్ వెళ్లి, అక్కడ ఎన్టీయార్‌ను పొగిడి జేజేలు అందుకోవడం (వైయస్సార్ గురించి మాటాపలుకూ లేదు). అంతకు మించి మీట్ అండ్ గ్రీట్‌లో అమరావతిని పూర్తి చేయడం తన బాధ్యతగా కాంగ్రెసు భావిస్తుందని అనడం! అక్కడివారికీ అమరావతికీ ఉన్న గాఢానుబంధం గురించి వేరే ఎవరూ చెప్పనక్కర లేదు.
అన్నిటికన్న విచిత్రం విద్యుత్ విషయంలో బాబుకి క్లీన్ చిట్ యిచ్చి ఆ పాపాన్ని కెసియార్‌పై తోయడం! విద్యుత్ విషయంలోనే కెసియార్ ఉన్న పదవి వదులుకుని, అప్పట్లో చండప్రచండంగా వెలుగొందుతున్న చంద్రబాబుతో తలపడే రిస్కు తీసుకున్న వైనం అందరికీ తెలిసినా రేవంత్ యిలా మాట్లాడాడు. ఇలాటి రేవంత్‌ను బాబును వ్యతిరేకించే రెడ్లు ఆమోదించరని, వారిని ఆకర్షించడానికి మరో రెడ్డి కులస్తుడైన కిషన్ పనికి వస్తాడని బిజెపి అధిష్టానం భావించి ఉండవచ్చు. కిషన్ సమర్థుడే కానీ యీ క్లిష్ట పరిస్థితులలోంచి బిజెపిని విజయపథం వైపుకి ఎలా తీసుకెళ్లగలడో, పాత కొత్త నాయకుల మధ్య సయోధ్యను ఎలా సాధించగలడో వేచి చూదాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)