రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో ఆ మాధ్యమానికి అన్ని రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఏ వ్యవస్థలోనైనా మంచీ, చెడూ వుంటాయి. ఇందుకు సోషల్ మీడియా కూడా అతీతం కాదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల యాక్టివిస్టులు వికృత చేష్టలకు దిగుతున్నారు. తద్వారా తమ పార్టీ అధినేతలు, పెద్దల దృష్టిని ఆకర్షించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే…. సమాజ భవిష్యత్ ఆందోళన కలిగిస్తోంది. రాజకీయాలు సమాజ పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా రాజకీయ కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరికిబిక్కిరి అవుతోంది. పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యర్థి పార్టీల కుటుంబాల్లోని మహిళలను లాగుతున్నారు. ఇది ఘర్షణలకు దారి తీస్తోంది.
అయితే ప్రత్యర్థుల కుటుంబాల్లోని మహిళలపై నీచమైన పోస్టులు పెట్టడం, వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అవాస్తవాలతో కూడిన వీడియోలు చేయడం, ఇతరత్రా అభ్యంతరకరమైనవి ప్రచారం చేస్తుండడంతో వివాదం తలెత్తుతోంది. ఇదంతా సులువుగా రాజకీయాల్లో ఎదగాలనే ఔత్సాహిక పోకిరీలతో తలెత్తిన సమస్యగా అర్థం చేసుకోవచ్చు. వీరిలో ప్రధానంగా మహిళలు కూడా ఉండడం గమనార్హం. నిజానికి క్షేత్రస్థాయిలో ప్రజానీకంతో పోకిరీ యాక్టివిస్టులకు ఎలాంటి సంబంధం ఉండదు.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రత్యర్థులపై ఇష్టానుసారం చెలరేగిపోతూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వినసొంపుగా మాట్లాడుతూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఇలాంటి వారి దుశ్చర్యలకు వైఎస్ భారతి, షర్మిల, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, రేణూదేశాయ్, అన్నా లెజ్నెవా తదితర రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులు బాధితులుగా మిగిలారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ రాత్రికి రాత్రే పొలిటికల్ సెలబ్రిటీలు అవుతున్నారు.
రెండు మాటలు నేర్చితే చాలు… అలాంటి వారిని రాజకీయ పార్టీలు చేరదీసే పరిస్థితి వుంది. తమ అనుకూల టీవీ చానెళ్లు, అలాగే సొంత యూట్యూబ్ చానెళ్లు, ఫేస్‌బుక్‌లలో మాట్లాడుతూ ప్రత్యర్థులపై కారుకూతలు కూస్తున్నారు. ఇలాంటి వారికి రాజకీయ పార్టీలు కూడా ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. కేవలం సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఒక మహిళకు వైసీపీ ప్రభుత్వం మహిళా కమిషన్‌లో కీలక పోస్టు కట్టబెట్టింది.
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునమ్
దొనరగ బట్టము గట్టిన
వెనకటి గుణ మేల మాను.? వినరా సుమతీ.! …అనే చందాన ఆ మహిళా వ్యవహార శైలి వుంది. మహిళా కమిషన్‌లో కీలక పదవిలో వుంటూ నారా లోకేశ్ భార్య బ్రాహ్మణిపై అభ్యంతరకర పోస్టు పెట్టారామె. విమర్శలు రావడంతో ఆ పోస్టును తొలగించిన సంగతి తెలిసిందే.
ఇక చంద్రబాబు తక్కువేం తినలేదు. సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై నిత్యం అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే శ్వేతాచౌదరికి ఏకంగా ఫోన్ చేసి వత్తాసు పలికారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా శ్వేతాచౌదరికి అండగా వుంటానని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం అబద్ధాలతో వీడియోలు చేసే ఒకాయనను టీడీపీలో చేర్చుకుని, ఇటీవల అధికార ప్రతినిధి పదవిని కూడా కట్టబెట్టారు.
ఇక జనసేన సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జనసేనానికే నోటి శుద్ధి వుండదు. ఇక ఆయన సైన్యానికి సంస్కారం ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎదుటి వాళ్లపై బురదచల్లడంలో జనసేన తర్వాతే ఏ పార్టీ అయినా అనే అభిప్రాయం వుంది.
సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీల యాక్టివిస్టులు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నామనే సాకుతో ప్రత్యర్థుల భార్యలు, కుమార్తెలు, ఇతరులపై నీచమైన కూతలు కూస్తున్నారు. వీటికి కౌంటర్ల పేరుతో అటు వైపు వారు కూడా ప్రత్యర్థుల కుటుంబ సభ్యులనే టార్గెట్ చేస్తున్నారు. అంతిమంగా బాధితులు రాజకీయ పార్టీల అధినేతలు, వారి కుటుంబ సభ్యులే.
సోషల్ మీడియా ద్వారా ఎదుటి వాళ్లను మానసికంగా దెబ్బతీసి, తద్వారా రాజకీయ, వ్యక్తిగత లబ్ధి పొందేందుకు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థులను ఎంత దారుణంగా తిడితే, అంత బాగా మాట్లాడినట్టు ప్రశంసలు అందుకుంటున్నారు. బాగా మాట్లాడ్డం అంటే అర్థం మారిపోతోంది. నోటికి అడ్డూఅదుపూ లేకుండా, బూతులు తిట్టడమే మంచి స్పీచ్‌కు కొలమానమైంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ధోరణులు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడో విదేశాల్లో వుంటూ, ఏపీలోని తమ ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు తిట్టడం చూస్తున్నాం. ఇందులో వైసీపీ, టీడీపీ, జనసేన అనే మినహాయింపులేవీ లేవు. తమ వాళ్లను తిడుతుంటే, తామెందుకు నోర్మూసుకుని కూచుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేసేవాళ్లు అసలు గుర్తింపునకు నోచుకోవడం లేదు.
కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో లేదా తరచూ పోస్టులు పెడుతూ పార్టీ పెద్దల గుర్తింపునకు నోచుకుంటున్నారు. దీంతో రాజకీయాలంటే సోషల్ మీడియా ద్వారా చేయడమే అనే నిర్ణయానికి చాలా మంది వచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్ని గాలికి వదిలేసి, సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు, పార్టీ పెద్దల ఆశీస్సులు పొందొచ్చనే భావజాలం పెరిగింది. ఇదే అన్ని రాజకీయ పార్టీలకు భవిష్యత్‌లో ప్రమాదకరంగా పరిణమించనుంది.