2017, డిసెంబర్ 23న పవన్‌కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. అదేంటంటే…
కులాలని కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతని విస్మరించని జాతీయ వాదం, ఇది దేశ పటిష్టతకి మూలాలు….అని పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు సీరియస్‌గా స్పందించారు. అన్ని పార్టీలు ఇలాగే వాగ్దానం చేస్తాయని, అధికారంలోకి వచ్చాక అన్నీ ఒకటే అని ఒక యాక్టివిస్టు రీట్వీట్ చేశారు. అలాగే మరొక నెటిజన్ …ఈ సిద్ధాంతాలు ఓట్లు పడే వరకు మాత్రమే. ఆ తర్వాత యధారాజా తథాప్రజ అని స్పందించారు.
తాజాగా పవన్‌కల్యాణ్ మతం ప్రాతిపదికన ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్ని చూస్తుంటే, అసహ్యం వేస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ఈ దఫా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నించారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ క్రిస్టియన్ మతాన్ని విశ్వసించడాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయనపై మత పరంగా విద్వేషాన్ని వెళ్లగక్కారు. మన సమాజంలో అత్యధికులు హిందువులు కావడంతో, వారి విశ్వాసాలను జగన్ అవమానిస్తున్నారనే ప్రచారానికి తెరలేపడం గమనార్హం.
ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నాయకులు హిందూ మతాన్ని అగౌరపరుస్తున్నారని పవన్ అన్నారు. వైసీపీ పాలనలోనే రామతీర్థం విగ్రహాలను నరికేశారని, అంతర్వేదిలో రథం తగలబెట్టినా పట్టించుకున్న నాథుడే లేడని ఆయన వాపోయారు. ఇప్పుడు అన్నవరంలో పురోహితులకు వేలం పాట పెట్టారని ధ్వజమెత్తారు. పవన్ అంతటితో ఆగలేదు. జగన్ ఇదే పని ఇస్లాం మతంలో చేయగలవా? క్రైస్తవుల చర్చిల్లో కూడా అమలు చేస్తావా? అంటూ మైనార్టీలను కూడా లాగారు.
ముస్లిం, క్రిస్టియన్ మతాలకు అనుకూలంగా పని చేస్తున్నారని చెప్పడం ద్వారా హిందువుల వ్యతిరేకిగా జగన్‌ను చిత్రీకరించేందుకు ఎలాంటి బెరుకు లేకుండా నేరుగా బహిరంగ విమర్శలకే దిగారు. హిందూ దేవాలయాలపై ఎందుకు పడ్డావని ఒక బీజేపీ నాయకుడిలా ప్రశ్నించారు. కాషాయం కప్పుకున్న బీజేపీ నాయకుడి అవతారం ఎత్తి… హిందూ ధర్మం అంటే అంత చులకనా? అని జగన్‌ను నిలదీశారు. హిందువుల జోలికొచ్చి పిచ్చి వేషాలు వేయడానికి నువ్వు, నీ మంత్రులు ఎవరు? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే జనసేన చూస్తూ ఊరుకోదంటూ భారీ డైలాగ్‌లు కొట్టారు.
కులాలని కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని తన పార్టీ సిద్ధాంతాలుగా చెప్పుకునే పవన్‌కల్యాణ్ నోటి నుంచి ఇలాంటి విమర్శలు రావడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం కేంద్రంగా రాజకీయం చేసిన నాయకులను చూడలేదు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ పుణ్యమా అని ఆ లోటు కూడా తీరిపోయింది.
పవన్‌కల్యాణ్ మత రాజకీయాలపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజానికి పవన్ మంచి చేయకపోయినా, మతం, కులం పేర్లతో విద్వేషాలను నింపొద్దని పౌర సమాజం వేడుకుంటోంది. స్వార్థ రాజకీయాల కోసం మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టించే పనికి మాలిన పనులు చేయవద్దని ప్రజానీకం వేడుకుంటోంది.