జగన్ వచ్చాక చెత్త పన్ను కొత్తగా విధించారు
ధరలు పెరిగాయి
గ్యాస్, పెట్రోలు ధరలు పెరిగాయి
విద్యుత్ చార్జీలు పెరిగాయి
ఇవీ ప్రతిపక్షంతో పాటు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఏ సభలో అయినా వల్లె వేస్తున్న సంగతులు. సరే, అందరికీ తెలిసినవే చెబుతున్నారో, తెలిసేలా చేస్తున్నారో, తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారో. దీన్నీ పవన్ మరో యాంగిల్ లో ఎందుకు చెప్పకూడదు.
తమ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం, ఎందుకంటే సింగిల్ ఎలాగూ అధికారంలోకి రాదు. అందులో వాదనకు తావు లేదు. తెలుగుదేశంతో కలిసి అధికారంలోకి రావాల్సిందే. అందువల్ల దాన్ని సంకీర్ణ ప్రభుత్వమే అంటారు. అది కనుక అధికారంలోకి వస్తే..
పెట్రోలు రేట్లు, గ్యాస్ రేట్లు 2019 నాటి స్థాయికి తీసుకువస్తాం
నిత్యావసర వస్తువుల ధరలను 2019 నాటి స్థాయికి తీసుకువస్తా
చెత్త పన్ను పూర్తిగా ఎత్తేస్తాం
పెరిగిన ఆస్తి పన్నులను తగ్గించేస్తాం.
పెరిగిన టోల్ గేట్ చార్జీలను వెనక్కు మళ్లిస్తాం
మద్యం రేట్లను 2019 స్థాయికి మార్చేస్తాం
ఇలా జగన్ ప్రభుత్వం మీద పవన్, చంద్రబాబు, వారి వారి అనుకుల మీడియా కలిసి ఆరోపణలు చేసే బదులు, ఇలా రివర్స్ చేస్తామని చెప్పడం ఎక్కువ ఎఫెక్టివ్ గా వుంటుంది. జనం కచ్చితంగా రెస్పాండ్ అవుతారు.
2019 లో రేట్లు ఇవీ…ఇప్పుడు రేట్లు ఇవీ..అందువల్ల తమకు అధికారం అందిస్తే 2019 రేట్లకు తీసుకువస్తాం. అది ఏవైనా పెట్రోలు, గ్యాస్, మందు, ఇంటిపన్ను, సిమెంట్, ఐరన్, ఇలా ఏదైనా వెనక్కు మారుస్తాం. ఎందుకంటే ఇవన్నీ జగన్ కారణంగానే అని కదా పవన్, చంద్రబాబు చెపుతున్నారు.
లోకేష్ పాదయాత్రలో కావచ్చు… పవన్ వారాహి యాత్ర కావచ్చు. వెళ్లిన ప్రతి ఊళ్లో ఓ బోర్డు. ఆ ఊరికి జగన్ వచ్చిన తరువాత జరిగిన అన్యాయం ఇదీ. జనాలకు జరిగిన అన్యాయం ఇదీ. పెరిగిన రేట్లు ఇవీ. అని ఓ బోర్డు పెట్టడం. ఆ పక్కనే 2019 ముందు రేట్లు ఇవీ..జరిగిన న్యాయం ఇదీ అని మరో బోర్డు పెట్టడం. తాము అధికారంలోకి వస్తే అన్నీ ఇలా రివర్స్ చేస్తామని హామీ ఇవ్వడం.
ఇలా ప్రతి ఊరిలో చేయండి. ఎందుకు అధికారం రాదో చూద్దాం. గెలిచిన వెంటనే పాత ధరలు జనాలకు అందుబాటులోకి రావాలి. అది మద్యం అయినా, పెట్రోలు, గ్యాస్, ఆస్తిపన్ను, ఏదైనా.
చెత్త పన్ను లేకుండానే ఇంటింటికి వచ్చి ఫ్రీగా…నూటికి నూరుశాతం ఫ్రీగా చెత్తను తీసుకుపోవాలి.
అపార్ట్ మెంట్ల నుంచి చెత్తను ఫ్రీగా తీసుకుపోవాలి.
ఇలాంటి పరిస్థితిని ప్రతి ఊళ్లో బోర్డులు పెట్టి మరీ మాట ఇవ్వాలి. ఇప్పుడు జగన్ మీద చేస్తున్న ప్రతి రేటు ఆరోపణ కరెక్ట్ అని, ఇలా తగ్గించామని రుజూపించాలి. అప్పడు జగన్ పార్టీ అసలు వుంటుందా?
మూడు రాజధానులు మా విధానం కాదు..అమరావతి ఒకటే రాజధానిగా వుంటుంది. ఎవరూ ఏ జోక్ లు వేసుకోవద్దు..విశాఖ, కర్నూలు ఏ విధమైన రాజధానులుగా వుండవు. కేవలం అమరావతిలోనే అన్ని కార్యాలయాలూ వుంటాయి. అమరావతే రాజధాని అని ఓ బోర్డు పెట్టేయండి.
పనిలో పని పల్లె టూరి దగ్గర నుంచి పట్నం వరకు ఒక్క రేప్ జరగదని, ఎక్కడా ఏ అఘాయిత్యమూ జరగదని, అంతెదుకు ఇప్పుడు రోజూ అను‘కుల’ మీడియా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానిని జగన్ కే ముడిపెడుతున్నారో, అవన్నీ ఇక జరగవని అలా జరిగితే పవన్, లోకేష్, చంద్రబాబే బాధ్యత తీసుకుని పదవని నుంచి తప్పుకుంటామని బోర్డులు పెట్టాలి.
అప్పుడు అనకూడదు కానీ తమ పార్టీ తరపున చోటా మోటా ఎవర్ని నిల్చో పెట్టినా గెలుస్తారు. డబ్బుల ఖర్చు అవసరం లేదు.
చేయాల్సింది ఒక్కటే. జగన్ తప్పు అని ఏది చెబుతున్నారో అవన్నీ, ప్రతి ఒక్కటీ రివర్స్ చేసి తీరుతామని, రివర్స్ చేసి చూపిస్తామని ప్రతి మండల కేంద్రంలో బోర్డుల రూపంలో శాశ్వతంగా అవి అమలు అయ్యే వరకు పెట్టండి. జగన్ నవరత్నాలు రాలిపోయి వుండొచ్చు. అవి అమలు చేయలేదని ఎందుకు చెప్పడం, మీ బోర్డులు రాలిపోకుండా అమలు చేసి తీరుతాం అని చెప్పితే చాలు. ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా గెలిచేయవచ్చు. జగన్ డబ్బులు జల్లినా, జగన్ వెనుక ఏ సపోర్ట్ పాయింట్లు వున్నా గెలవమన్నా గెలవలేడు.
కానీ ఒక్కటే 2019 రేట్లు అన్ని విధాలుగా 2014లో వుండాలి. వుండి తీరాలి.