టిడిపి గెలిస్తే జనసేన కథ ముగిసిన‌ట్టే..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తోంది ఒకటే చర్చ. తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయా? ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? టిడిపి,`జనసేన మాత్రమే కలుస్తాయా? ఇటువంటి చర్చ జోరుగా సాగుతోంది.…

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తోంది ఒకటే చర్చ. తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయా? ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? టిడిపి,`జనసేన మాత్రమే కలుస్తాయా? ఇటువంటి చర్చ జోరుగా సాగుతోంది. బిజెపి వచ్చినా రాకున్నా టిడిపి-`జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమన్న భావన మాత్రం అటు తెలుగుదేశం కార్యకర్తల్లోనూ, అటు జనసేన శ్రేణుల్లోనూ బలంగా వుంది.

రాష్ట్రంలో పొత్తులపై ఎంత గందరగోళమున్నా….రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు తెలిసిన వారు మాత్రం జరుగుతున్న పరిణామాలపై సరైన అంచనాతోనే వున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన కలిస్తే అది పవన్‌కు, రాష్ట్రంలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాపు సామాజిక వర్గానికి మరణ శాసనమే అవుతుంద‌నేది రాజ‌కీయ పండితుల అంచ‌నా. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అధికార పీఠంపై పవన్ కల్యాణ్‌ శాశ్వతంగా ఆశలు వదులుకోవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని కులాలున్నా….రెడ్డి, కమ్మ, కాపు కులాల మధ్యే ఆధిపత్యపోరు సాగుతోంది. మిగిలిన కులాలన్నీ ఈ కులాలకు సపోర్టుగా వుండటం తప్ప అధికార పీఠాన్ని దక్కించుకునే సత్తాలేదు. తెలుగుదేశం పార్టీతో కమ్మ సామాజికవర్గం అధికారాన్ని చెలాయించిది. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో రెడ్డి సామాజికవర్గం ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. ఇక మిగిలింది కాపు సామాజికవర్గమే.

కాపుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని చేరుకోగల ఏకైక నాయకుడిగా పవన్ కల్యాణ్‌ కనిపిస్తున్నారు. గతంలో వంగవీటి మోహన్‌రంగా, ముద్రగడ పద్మనాభం వంటివారు కాపులకు నాయకత్వం వహించినా ముఖ్యమంత్రి పీఠం దాకా వెళ్లలేదు. ఆ తరువాత చిరంజీవి ఆశాకిరణంలా కనిపించారు. ప్రజారాజ్యంతో ఆయన ముఖ్యమంత్రి అవుతారని కాపులతో పాటు అందరూ భావించారు. ఆఖరికి ప్రజారాజ్యం 18 స్థానాలకు పరిమితం కావడం, ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని నడపలేకపోవడం, కాంగ్రెస్‌లో విలీనం చేయడం, మెల్లగా రాజకీయాలకే దూరం కావడం వరుస పరిణామాలు. దీంతో కాపు సామాజిక వర్గం చిరంజీవిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.

ఆ తరువాత పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీతో దూసుకొచ్చారు. గత ఎన్నికల్లో స్వయంగా పార్టీ అధినేత పోటీ చేసిన రెండు చోట్లా జనసేన ఓటమిపాలయింది. అయినా పవన్‌ ఆత్మనిబ్బరంతో రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల తరువాత బిజెపితో పొత్తుపెట్టుకుని ఆచితూచి వ్యవహరిస్తూ, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ దూకుడుగా అడుగులేస్తున్నారు.

రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కంచుకోగలనన్న నమ్మకం పవన్‌లో ఎంతవుందోగానీ, ఆయనలో ఆ సత్తా వుందని కాపులు మాత్రం కొండంత‌ నమ్మకంతో వున్నారు. పవన్ కాకుంటే ఈ తరానికి కాపులను ఏకం చేయగల నాయకుడు ఇక రాలేడని కూడా చెబుతున్నారు. కాపులకు అధికారం వస్తే ఇప్పుడు తప్ప ఇంకెప్పటికీ రాద‌నే భావనతో కాపు సామాజికవర్గంలో వుంది.

ఈ పరిస్థితుల్లో పవన్ వేస్తున్న అడుగులు, వ్యూహాల గురించే కాపుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బలంగా వున్న టిడిపి, వైసిపి పార్టీల్లో ఏదో ఒకటి కనుమరుగైతే తప్ప జనసేనకు బలపడే అవకాశం లేదు. ఎందుకంటే….రాష్ట్రంలోని అన్ని కులాలను ఈ రెండు పార్టీలు పంచేసుకున్నాయి. బిసిలు టిడిపితో వుంటే, దళితులు, మైనారిటీలు వైసిపితో వున్నారు. కాపులకు ఇతర కులాలు తోడైతే తప్ప అధికారం సాధ్యం కాదు.

ఈ పూర్వరంగంలో పవన్ కళ్యాణ్‌ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయమే కీలకం కానుంది. 2019 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా మారిన తెలుగుదేశం పార్టీ ఆ తరువాత కూడా పెద్దగా కోలుకున్నది లేదు. వాస్తవంగా అధికార పార్టీ దెబ్బకు టిడిపి బెంబేలెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి చేతులెత్తేసింది. కనీసమైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒంటరిగా వైసిపిని ఎదుర్కోగల సత్తా లేదని ఆ పార్టీ అధినేత మాటల్లోనే వ్యక్తమవుతోంది. అందుకే జనసేన పొత్తును టిడిపి గట్టిగా కోరుకుంటోంది. పవన్‌ సహకారంతో 2023 ఎన్నికల్లో గట్టెక్కగలమన్న ఆశతో వుంది. ఈ క్రమంలోనే జనసేన,`బిజెపి మధ్య ఇప్పటికే పొత్తువుండటం వల్ల అవి కూడా తమతో కలసి వస్తే ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తోంది.

తెలుగుదేశం పార్టీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యూహం రచించాల్సిన పవన్ కల్యాణ్‌…అందుకు భిన్నంగా, తొందరపాటుతో తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుండగానే…ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వబోను అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనను ప్రభుత్వంతో అడ్డుకోవడం, ఆ సమయంలో చంద్రబాబు వెళ్లి సంఫీుభావం ప్రకటించడం….ఇలా వరుస పరిణామాల్లో పవన్‌ కల్యాణ్‌ తనకు తెలియకుండానే టిడిపికి దగ్గరైపోయారు. టిడిపితో కలసి పోటీ చేయబోతున్నామనే భావన కలిగేలా అనేక పర్యాయాలు మాట్లాడారు. టిడిపితో కలసి వెళ్లేలా బిజెపిని ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

అదే విధంగా ముఖ్యమంత్రి పదవి అడగడానికి నాకు తగిన బలం ఎక్కడుంది అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. జనసేన గెలుపు కంటే వైసిపి ఓటమి, తెలుగుదేశం గెలుపు కోసమే పవన్‌ పని చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. వ్యూహం మరచిన పవన్ కల్యాణ్‌, ఎన్నికలకు చాలా ముందుగానే అవసరమైనదాని కంటే ఎక్కువగా టిడిపికి దగ్గరవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక విధంగా చులకనైపోయారు. ‘మాతో రాకుండా ఇంకెక్కడికి పోతాడులే’ అనే భావన టిడిపి శ్రేణుల్లో ఏర్పడింది. ఈ పరిస్థితిని కాపులు జీర్ణించుకోలేకపోయారు. ఒక విధంగా ఆందోళనకు గురయ్యారు.  

జనంతో చరిష్మా వున్నప్పటికీ పవన్‌ ఎత్తుగడలు, వ్యూహాల్లో తీవ్రమైన లోపాలున్నాయన్న విమర్శలు కాపుల నుంచే వినిపిస్తున్నాయి. రాజకీయాలను పరిశీలించే ఎవరికైనా పవన్‌ చేస్తున్న తప్పులేమిటో తేలిగ్గానే అర్థమవుతాయి. ముందే చెప్పినట్లుగా టిడిపి, వైసిపిల్లో ఏదో పార్టీ కనుమరుగైతే తప్ప జనసేనకు భవిష్యత్తు లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసిపి కంటే టిడిపి దెబ్బతింటేనే జనసేనకు ఎక్కువ ప్రయోజనం వుంటుంది.

ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న టిడిపి ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే…దాని మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. చంద్రబాబు నాయుడు తప్పితే ఆ పార్టీని నడిపించగల నాయకుడు లేడు. ఆ పార్టీని నమ్ముకున్న కమ్మ సామాజికవర్గం, బిసి కులాలు ప్రత్నామ్నాయం చూసుకోవాల్సి వుంటుంది. అప్పుడు బిజెపి మద్దతు వున్న జనసేన రంగంలో వుంటే ఆ పార్టీవైపు ఈ వర్గాలు అనివార్యంగా అడుగులేస్తాయి. ఎందుకంటే….సంప్రదాయంగా తెలుగుదేశంతో వున్నవారు కాంగ్రెస్‌ వ్యతిరేకులు. అదేవిధంగా వైసిపి అంటే పొసగని వారు. వీరంతా కాంగ్రెస్‌లోకి వెళ్లలేరు. వైసిపిలో చేరలేరు.

అదే రానున్న ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలై, పార్టీగా నిలబడలేని పరిస్థితి వచ్చినా….ఆ పార్టీతో వున్న రెడ్డి సామాజికవర్గం, దళితులు, మైనారిటీలు బిజెపి మద్దతున్న జనసేనలో చేరే అవకాశాలు తక్కువ. ఆ వర్గాలు సంప్రదాయంగా మద్దతిచ్చిన కాంగ్రెస్‌ పంచన చేరే అవకాశాలుంటాయి. అప్పుడు జనసేనకంటే కాంగ్రెస్‌ బలపడుతుంది. దీనివల్ల జనసేనకు ఒరిగేదేమీ వుండదు. పైగా కాంగ్రెస్‌ బలపడటం బిజెపికి నష్టం. కాంగ్రెస్‌ జానెడంత పెరగడాన్ని కూడా బిజెపి సహించదు.

ఈ వ్యూహాల నేపథ్యంలో తెలుగుదేశంతో కలవడానికి బిజెపి ససేమిరా అంటోంది. పవన్‌కూ అదే చెబుతోంది. తెలుగుదేశంతో వెళ్లది లేదని తేల్చి చెప్పిన తరువాతే పవన్‌ మాటల్లో మార్పు వచ్చింది. నేనే ముఖ్యమంత్రిని అవుతానంటున్నారు, అధికార వైసిపిపై అనేక విధాలుగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా జనసేన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాలంటీర్లపైన విమర్శలు చేసినా, సచివాలయాలకు వ్యతిరేకంగా మాట్లాడినా అందులోని అంతరార్థం అదే.

బిజెపి కింది స్థాయి నాయకులు ఏమి మాట్లాడినా…జాతీయ నాయకత్వం మాత్రం చాలా స్పష్టంగా వుంది. తెలుగుదేశంతో కలవడం కంటే విడిగా వుండటమే మేలని భావిస్తున్నది. అందుకే బెంగళూరులో జరిగిన ఎన్‌డిఏ భాగస్వాముల సమావేశానికి కూడా టిడిపిని ఆహ్వానించలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా బిజెపి నాయకులు పట్టించుకోలేదు.

అందుకే…టిడిపి ఎంత నష్టపోతే జనసేన అంతగా లాభపడుతుంది. ఆ మేరకు బిజెపికీ మేలు జరుగుతుంది. టిడిపి పునాదుల్లోనే జనసేన బలోపేతానికి పునాదులు పడతాయన్న వాస్తవం పవన్‌కూ అర్థమయింది. అందుకే పవన్‌ కూడా రూటు మార్చారు. తన వ్యూహాన్ని పవన్‌ బహిరంగపరచకపోయినా అంతర్గతంగా జరుగుతున్నది ఇదే. జనసేన బిజెపి వ్యూహాన్ని టిడిపి పసిగట్టిందో లేదోగానీ జనసేనాని పవన్‌ మాత్రం తన వ్యూహం వైపుగా దూకుడుగా అడుగులేస్తున్నారు.

– ఆదిమూలం శేఖర్‌, సీనియర్‌ జర్నలిస్టు