ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతోంది. ఈ సమాచారం అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందింది. ఇటీవల చంద్రబాబునాయుడు ప్రకటించిన జాబితాలో మహిళా నాయకురాలికి సీటు ప్రకటించారు. నిజానికి ఆమెకు టికెట్ రాదని అంతా అనుకున్నారు. అదృష్టవశాత్తు ఆమెకు చంద్రబాబు అవకాశం కల్పించారనే చర్చకు తెరలేచింది.
అయితే ఇంట్లోనే టికెట్ పోరు మొదలైనట్టు సమాచారం. తనకు టికెట్ కావాలని, ఈ విషయాన్ని చంద్రబాబు దగ్గరికెళ్లి చెప్పాలని సదరు మహిళా నాయకురాలిపై భర్త ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందుకు ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతోందని సమాచారం.
“నీ వైపు కుటుంబ సభ్యులంతా నిన్ను వదిలేశారు. మిగిలింది నా సామాజిక వర్గం మద్దతే. అది కూడా నన్ను చూసి వాళ్లంతా ఉన్నారు. ఆర్థిక, అంగబలం నావే. నీ భవిష్యత్ కోసం ఇంత కాలం ఓపికతో ఇక్కడే ఉన్నాను. ఇక నా వల్ల కాదు. టికెట్ నాకు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేం” అంటూ సదరు మహిళా నాయకురాలిపై భర్త నోరు పారేసుకున్నట్టు తెలిసింది.
మరోవైపు సదరు మహిళా నాయకురాలిపై అత్త కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది. రాజకీయ బాధ్యతలు తన కుమారుడికే అప్పగించాలని, పిల్లోడి భవిష్యత్ దృష్ట్యా నువ్వు హైదరాబాద్‌కు రావాలని అత్త ఆదేశించినట్టు తెలిసింది. అయితే ఆమె ఎవరినీ లెక్క చేసి రకం కాదు. అందుకే భార్యాభర్తల మధ్య గొడవ ఓ రేంజ్‌లో జరుగుతోందని కుటుంబ సన్నిహితుల ద్వారా తెలిసింది. సదరు మహిళా నేత భర్త పేరులో రాముడే తప్ప, చేష్టల్లో మాత్రం ఆ లక్షణాలేవీ వుండవు.
ఆ మహిళా నేత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మహిళా నేత దగ్గరి బంధువు రెండు రోజుల క్రితం వైసీపీలో చేరారు. దీంతో వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు ఆమెకు సొంత కుటుంబం నుంచి నిరాదరణ ఎదురైంది. ఇదే అలుసుగా తీసుకున్న ఆమె భర్త, తనకు సీటు కావాలని ఒత్తిడి చేయడం చర్చనీయాంశమవుతోంది.