ఎక్కడి నుంచి పోటీయో.. అంతా అయోమయం

టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో డిసైడ్ చేసుకోలేక పోతున్నాడు. జాప్యం జరుగుతున్నకొద్దీ ఆయన పోటీపై అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. వాటిల్లో ఏవి నిజమో, ఏది అబద్దమో…

టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో డిసైడ్ చేసుకోలేక పోతున్నాడు. జాప్యం జరుగుతున్నకొద్దీ ఆయన పోటీపై అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. వాటిల్లో ఏవి నిజమో, ఏది అబద్దమో తెలియకుండా ఉంది. జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

రోజుకో నియోజకవర్గం పేరు తెర మీదకు వస్తోంది. అసలు ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండీ, పైగా చేవ చచ్చిన టీడీపీకి మనమే ఊపిరి అని బీరాలు పోయి, అధఃపాతాళానికి ప్రస్తుత ముఖ్యమంత్రిని తొక్కేస్తానని బెదిరించి… ఇన్ని రకాల విన్యాసాలు చేసిన వారిని ఎవరైనా సరే కనీసం పది చోట్ల పోటీ చేసినా గెలుస్తాడేమో అని జనం అనుకునేంత సీను ఉంటుంది‌.

కానీ జనసేనాని వాటన్నిటినీ తుడిచిపెట్టేశాడు. భీమవరం నుంచని ఒకేసారి, కాపులెక్కువ కాబట్టి పిఠాపురం నుంచి అని మరోసారి పీలర్లు వదిలారు.  కానీ, నిజానికి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోవడంలేదు.  ఎక్కడ పోటీ చేసినా లెక్కలు తప్పేట్టు గానే ఉండటంతో ఎటూ తోచని స్థితిలో పడిపోయాడు.  తాజాగా ఆయన భీమవరమూ కాదు పిఠాపురమూ కాదు తిరుపతి నుంచి పోటీ చేస్తాడని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

అంటే పొత్తు నుంచి ఇంకా అభ్యర్థి నిర్ణయమవలేదా? భీమవరం,  పిఠాపురంలో ఆయన ఓడిపోతాడని సర్వేలు చెప్పాయో ఏంటోనన్న అయోమయంలో జనసైనికులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.  ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తాడనే వార్తలు వస్తున్నాయి. 

అయితే పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే జరుగుతున్న ప్రచారం నిజమేనట. కాకపోతే రెండూ అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం కావట. తాజా వ్యూహం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు లోక్ సభ నియోజకవర్గంలో కూడా పోటీచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లో అసెంబ్లీకి, ఉత్తరాంధ్ర నుండి ఎంపీగా పోటీచేయటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీకి పోటీచేయబోయే సీట్లని ఇప్పటికే చాలా నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో పవన్ పోటీచేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో కాకినాడని, తర్వాత భీమవరం నియోజకవర్గాల్లోనే పవన్ పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. 

అయితే ఈ రెండింటిలో కూడా పవన్ పోటీచేయటంలేదని దాదాపు తేలిపోయింది. అందుకనే అందరి దృష్టి ఇపుడు పిఠాపురం మీద పడింది. పిఠాపురంలో పోటీచేయబోతున్నట్లు పవన్ చెప్పలేదు. అయితే రెగ్యులర్ గా పవన్ పేరుతో ఇక్కడ సర్వేలు జరుగుతున్నాయట. 

ఇక రెండో నియోజకవర్గంలో పోటీ అంటే అది పార్లమెంటు నియోజకవర్గమే అని ఇపుడు ప్రచారం ఊపందుకుంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి నుండి ఎంపీగా పోటీచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కారణం ఏమిటంటే మొన్నటివరకు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లిలో ఎంపీగా పోటీచేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు నాగబాబు విత్ డ్రా అయిపోయారని అంటున్నారు. 

అనకాపల్లి అచ్యుతాపురంలో ఇల్లు తీసుకున్న నాగబాబు ఆ ఇంటిని ఖాళీ చేసేశారట. దాంతో నాగబాబు ఇక్కడ పోటీచేయటంలేదనే ప్రచారం పెరిగిపోయింది. నాగబాబు ప్లేసులో పవన్ ఎంపీగా పోటీచేస్తారని అంటున్నారు. ఇదంతా బీజేపీ పెద్దల గేమ్ ప్లానులో భాగంగానే జరుగుతోందని కూడా ప్రచారం జరుగుతోంది. 

ఎన్నికల తర్వాత పవన్ ఎంపిగా గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అందుకనే పార్లమెంటు పోటీకి సేఫ్ సీటును వెతుక్కోమని ముందే చెప్పారట. ఇందులో భాగంగానే అనకాపల్లి పార్లమెంటు సీటును పవన్ రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.