జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎందుకు అంత ప్రేమగా దగ్గరకు తీసారు? పవన్ వెనుక కాపు ఓట్లు వున్నాయనే కదా. లేకుంటే దగ్గరకు తీస్తారా? ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
ఇదిలా వుంటే బిసిల డిక్లరేషన్ అంటూ ఓ జాబితా వదిలారు. ఇప్పటికే రక్షణ చట్టాలను కొంత మంది తప్పుగా వినియోగిస్తున్నారనే విమర్శ వుంది. ప్రభుత్వమే ఊ అంటే అట్రాసిటీ కేసులు బనాయిస్తోందనే విమర్శలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బిసిలకు కూడా అట్రాసిటీ చట్టం లాంటిది తీసుకువస్తామంటున్నారు. దీని వల్ల మరిన్ని కేసులు పెరుగుతాయి తప్ప, జరిగే దాడులు, గొడవలు జరుగుతూనే వుంటాయి. అది వేరే సంగతి.
బిసి లకు ఇంత చేస్తాం అంత చేస్తాం అని చంద్రబాబు చెబుతుంటే పవన్ దానికి వంత పాడుతున్నారు. అంతా కలిసి బిసిల ఓట్లు ఎలాగైనా వైకాపా నుంచి లాక్కోవాలి అని కిందా మీదా పడుతున్నారు. కానీ 2019లో బిసి ల ఓట్లు ఎక్కువగా వైకాపా కు ఎందుకు పడ్డాయి. కాపుల కోసం జనసేన వుంది. ఆ జనసేనతో తేదేపాకు పరోక్ష పొత్తు వుంది అన్న సంగతి బిసి లు గమనించడం వల్ల. బీసి లకు జగన్ విపరీతంగా రాజకీయ అవకాశాలు ఇవ్వడం వల్ల.
మరి ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వడం వల్ల బిసి లు తెలుగుదేశం వైపు వస్తారో.. రారో అన్న సంగతి అలా వుంచితే కాపుల సంగతి ఏమిటి? జగన్ బిసి జపం చేసి, చంద్రబాబు బిసి జపం చేస్తే, వాళ్లతో పాటు తమ నాయకుడు అనుకున్న పవన్ కూడా అదే జపం చేస్తున్నారు అంటే ఏమనుకుంటారు కాపు సోదరులు?
తమ ఓటు టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అనుకోరా? బిసి లకు రాజకీయ అవకాశాలు పెంచుతాం అంటే మరి కాపుల పరిస్థితి? ఇప్పుడే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఆందోళన చెందుతున్నారు. తమ పేరుతో కాపులు అవకాశాలు తీసేసుకుంటున్నారని. తూర్పు కాపులు బిసి ల కేటగిరీకి వస్తారు. అప్పుడు వాళ్లకే అవకాశం ఇస్తే ఇక ఉత్తరాంధ్రలో కాపులు సైలంట్ కావాల్సిందే.
లేదా, ఏ రోటి కాడ ఆ పాట అన్నట్లుగా, మరో సభ పెట్టి కాపుల డిక్లరేషన్ ఇస్తారేమో?