చెత్తను నెత్తిన వేసుకుని ఏం సాధించాలని?

ఏనుగు నెత్తిన చెత్త వేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అది తన నెత్తిన  తానే చెత్తను వేసుకుంటుంది అని పెద్దలు అంటుంటారు. ఏనుగు అంటే అదేదో మహా గొప్పది అనే భావంతో కాకుండా, అంత…

ఏనుగు నెత్తిన చెత్త వేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అది తన నెత్తిన  తానే చెత్తను వేసుకుంటుంది అని పెద్దలు అంటుంటారు. ఏనుగు అంటే అదేదో మహా గొప్పది అనే భావంతో కాకుండా, అంత తెలివితక్కువది మరొకటి ఉండదు అని చెప్పే ఉదాహరణ ఇది.

ఇప్పుడు ఏపీ రాజకీయాలను పరిశీలించినప్పుడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి వచ్చి తీరాలని అనుకుంటున్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ల వైఖరి కూడా ఈ ఉదాహరణ మాదిరిగానే కనిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన అక్కడ చెత్తగా నిరూపణ అయిన నాయకులను తెచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగడానికి వీరు ఉత్సాహపడుతున్నారు. జగన్ తిరస్కరించిన వారికి పెద్దపీట వేయడానికి సిద్ధం అవుతున్నారు.

వైసీపీ వద్దనుకున్న నాయకులందరినీ తెలుగుదేశం, జనసేనల్లో చేర్చుకుంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డిశ్రీధరరెడ్డి దగ్గరినుంచి ఈ పని తెలుగుదేశం ఎప్పటి నుంచో చేస్తోంది. విపరీతంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉండవిల్లి శ్రీదేవిని కూడా చేర్చుకున్నారు.

తెలుగుదేశంలో చేరడానికి ఎంతటి అవినీతి పరులు, దుర్మార్గులు అయినా పర్లేదు.. వైఎస్సార్ కాంగ్రెస్ తిరస్కరించిన చరిత్ర ఉంటే చాలు అన్నట్టుగా వీరి వైఖరి సాగుతోంది. తాజాగా జగన్ కేబినెట్ సహచరుల్లోనే అత్యంత అవినీతి పరుడిగా ముద్రపడిన మంత్రి గుమ్మనూరు జయరాం ను కూడా తెలుగుదేశంలో చేర్చుకున్నారు.

పవన్ కల్యాణ్ కూడా వైసీపీ తిరస్కరించిన వారిని జనసేనలో చేర్చుకుంటూ ఉండడం గమనించవచ్చు. బాలశౌరి, చిత్తూరు నుంచి శ్రీనివాసులు అంతా ఈ కోవకే చెందుతారు. గూడూరు వరప్రసాద్ ను కూడా చేర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వారినందరినీ చేర్చుకోవడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే సంగతిని మాత్రం ఆ పార్టీల నేతలు గుర్తించడం లేదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సిటింగు ఎమ్మెల్యేలకు స్థానికంగా ఎలాంటి ప్రజాదరణ ఉన్నదనే విషయాన్ని సర్వేల ద్వారా అంచనా వేసి.. వారిలో కొందరిని  పక్కన పెట్టడం, కొందరిని ఇతర నియోజకవర్గాలకు మార్చడం చేస్తూ వచ్చారు. ఈ ప్రయత్నాలను చంద్రబాబు పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఒకచోట చెల్లని కాయిన్ మరొక చోట చెల్లుతుందా అంటూ జోకులు వేశారు. ఇప్పుడు వారికి ప్రజల నుంచి అదే ప్రశ్న ఎదురవుతోంది.

గెలిచే అవకాశం లేదని, అత్యంత అవినీతి పరులని ఎవరెవరినైతే జగన్ పక్కన పెట్టారో.. వారు తెలుగుదేశంలోనో, జనసేనలోనో చేరినంత మాత్రాన పవిత్రులు అయిపోతారా? వారికి ప్రజలు పట్టం కడతారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. మరి ఇలాంటి తిరస్కృతులను చేరదీసి వారు ఏం సాధిస్తారో చూడాలి.