జర్నలిజంలో కొన్ని విలువలు, ప్రమాణాలు ఉంటాయి. (ఉండేవి అంటే బాగుంటుందేమో) కానీ ఇప్పుడు కేవలం లక్ష్యాలు మాత్రమే ఉంటున్నాయి. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు తమకు తాము నిర్ణయించుకుంటున్న లక్ష్యాలను గమనిస్తోంటే ఏం అనిపిస్తోందంటే.. కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న చవకబారు సంస్థలు చాలా గొప్పవి అనిపిస్తోంది.
ధనం కాకుండా వక్ర రాజకీయ ప్రయోజనాలను లక్ష్యిస్తున్న సంస్థలు.. చాలా దిగజారిపోతున్నాయి. విచక్షణలేని రాతలు వాటికి అలవాటుగా మారిపోయింది. చివరికి సభ్యతను కూడా విస్మరించి వార్తలు వేస్తున్నాయి. ఈ విషయంలో అగ్ర దినపత్రికగా చెప్పుకునే ఈనాడు కూడా అదే గాటన ఉండడం విశేషం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇప్పుడు ఈనాడు దినపత్రికకు అతిపెద్ద సెలబ్రిటీలలో ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే.. అక్షరం పొల్లుపోకుడా ప్రచురించడానికి వారు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆయన మాటలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఇరికించేందుకు ఉద్దేశించినట్లుగా ఉంటే.. మరింత ప్రయారిటీతో కూడా ప్రచురిస్తారు. వారికి జగన్ వ్యతిరేక ప్రచారం అనే లక్ష్యం తప్ప ఇతర విచక్షణ ఎంత మాత్రమూ ఉండదు. తాజాగా సభ్యతను కూడా మర్చిపోయారు.
వివేకా హత్య వెనుక వైఎస్ జగన్ హస్తం ఉన్నదని, అందుచేత ఆయనకు పులివెందులలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని దస్తగిరి కడపలో ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్పారు. ఈ సందర్భంగా.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి తనను కడప సెంట్రల్ జైల్లో బెదిరించారని కూడా ఆరోపణలు చేశారు. ఇవి కొత్త ఆరోపణలు కాదు. వీటిపై కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ, విచారణ నడుస్తోంది.
తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అడిగారని, అందుకు 20 కోట్లు ఆఫర్ చేశారని అన్నారు. ‘నేను చెప్పినట్లు వినకపోతే ప్రాణాలతో ఉండవు. జైల్లో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేదంటే అవినాష్ రెడ్డి మేము కలిసి నిన్ను నరికేస్తాం నా కొడకా’ అంటూ హెచ్చరించినట్టుగా ఆరోపణలు చేశారు. ఈ డైలాగును యథాతథంగానే ఈనాడు ప్రచురించింది. ‘నిన్ను నరికేస్తాం’ అన్నంత వరకు ప్రచురించినా సరిపోయేది. దస్తగిరి చల్లదలచుకున్న బురద వారికి అంటుకునేది. కానీ.. ‘నా కొడకా’ అనే పదాన్ని కూడా ప్రచురించడంలో ఈనాడు సభ్యతా ప్రమాణాలు ఎక్కడికెళ్లాయి. ఎందుకింత దిగజారిపోతున్నారు.. అనేది ప్రశ్న.
రాజకీయ ఎజెండాలు పత్రికలకు ఉండడం కొత్త కాదు. అందుకోసం వారు ప్రమాణాల పరంగా ఎంతగా దిగజారినా ప్రజలు పట్టించుకోవడం లేదు. కానీ.. చవకబారు యూట్యూబ్ ఛానెళ్లు పెట్టే బూతు హెడింగుల్లాగా అసభ్యపదాలను కూడా పత్రికల్లో తీసుకువచ్చేస్తోంటే.. ఈనాడు ఆ పనిచేస్తోంటే.. ఎలా అర్థం చేసుకోవాలి.