వాళ్లు మనుషులు కాదా చంద్రబాబూ?

‘అసలు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అంటూ ఆ వర్గాలను నీచంగా పరిగణిస్తూ అసెంబ్లీ సాక్షిగా చులకన వ్యాఖ్యలు చేసిన అపసవ్యపు ఆలోచన సరళి చంద్రబాబునాయుడిది. అలాంటి చులకన మాటల ద్వారా.. ఆ వర్గాలకు…

‘అసలు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అంటూ ఆ వర్గాలను నీచంగా పరిగణిస్తూ అసెంబ్లీ సాక్షిగా చులకన వ్యాఖ్యలు చేసిన అపసవ్యపు ఆలోచన సరళి చంద్రబాబునాయుడిది. అలాంటి చులకన మాటల ద్వారా.. ఆ వర్గాలకు చెందిన ప్రజలను ఆయన ఎంతో క్షోభకు గురిచేశారు. ఆ మాటల ద్వారా తనలోని కుల అహంకారాన్ని ఆయన బయటపెట్టుకున్నారు.

చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ అలాంటి పనే చేశారు. చిన్న చిన్న వృత్తులలో ఉపాధులలో స్థిరపడే వారిని ఉద్దేశించిన చులకన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 3వేల రూపాయల భృతి ఇస్తాం అంటున్న చంద్రబాబు.. తమ ప్రభుత్వ హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. వైసీపీ వాళ్లు మటన్, ఫిష్ మార్కెట్, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. తెదేపాకు- వైకాపాకు తేడా మీరే గమనించండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే ఆయన అహంకారానికి, ధనమదానికి తాజా నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సామాజిక విలువల ప్రకారం చూసినప్పుడు యువతరం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ల మీద నిలబడడం, చిరుద్యోగాలనైనా తిరస్కరించకుండా స్వీకరించడం అనేది ముఖ్యం. అంతో ఇంతో చదువుకున్న వాళ్లయినా సరే.. తమ చదువులకు తగిన ఉద్యోగాలు వచ్చే వరకు చిరుద్యోగాలను, పనులను చేసుకుంటూ క్రియాశీలంగా ఉండడం తప్పేమీ కాదు. పెద్ద ఉద్యోగాలకు తగినంత చదువు లేని వారికి ఖచ్చితంగా చిన్న చిన్న సంపాదన మార్గాలు అవసరం కూడా. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది కూడా అదే. అయితే దానిని చంద్రబాబు హేళన చేయడం లేకిగా ఉంది.

తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు అటున్నారు. ఇంజినీరింగ్ వంటి పెద్దచదువులు చదివిన వారి గురించి తప్ప.. మిగిలిన నిరుద్యోగ యువతరం గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని, ఆయన దృష్టిలో వారెవ్వరూ మనుషులు కానే కాదని ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోంది.

వాలంటీర్ల గురించి కూడా చంద్రబాబు ఇదే విధంగా చులకనగా మాట్లాడారు. వాలంటీర్లను మభ్యపెట్టడానికి మీకు నైపుణ్యాలు పెరిగేలా శిక్షణలు ఇప్పించి.. మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం అంటున్నారు. వాలంటీర్లను యువతరం ఎవ్వరూ కూడా యావజ్జీవితానికీ సరిపోయే ఉద్యోగంగా భావించడం లేదు.

ప్రభుత్వం కూడా వారికి ఇచ్చే సొమ్ములను గౌరవవేతనంగా పరిగణిస్తోంది. ఇతర ఉద్యోగాలకు చాలినంత విద్యార్హతలు లేని వారితో పాటు, బాగా చదువుకున్న వారు కూడా ఈ పనుల్లో ఉన్నారు. అయితే.. తమకు తాము తమ అర్హతలకు తగిన ఉద్యోగాలకు అప్లయి చేసుకుంటూ.. ఖాళీగా ఉండకుండా వాలంటీర్లుగా చేస్తున్నారు. అక్కడికి అవేదో తక్కువస్థాయి ఉద్యోగాలు అయినట్టుగా చంద్రబాబు మాట్లాడడం తమాషా.

అదే తరహాలో లిక్కర్ , మటన్, ఫిష్ షాపుల్లో పనిచేసే యువతరాన్ని చులకన చేస్తూ తాజా మాటలు అన్నారు ఆయన. ఎవరైనా దళితులుగా పుట్టాలని అనుకుంటారా? అని కుల అహంకారాన్ని ప్రదర్శించిన చరిత్ర ఆయనది. ఇప్పుడు ఈ పనులను చులకన చేస్తూ ధనమదాన్ని ప్రదర్శించారని విమర్శలు వస్తున్నాయి.