గామి తర్వాత కొన్నాళ్ల పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేయనని ఇప్పటికే ప్రకటించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇకపై సినిమాల్లో రిస్కీ షాట్స్ చేయనని కూడా చెప్పుకొచ్చాడు. లైఫ్ రిస్క్ చేసే సన్నివేశాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానంటున్నాడు.
“గామి కోసం గడ్డకట్టిన సరస్సుపై షూట్ చేశాం. ఇంకో రోజు రోప్ లేకుండా కొండ ఎక్కాను. అవసరం లేని రిస్కులు చేసినట్టు అనిపించింది. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేయాలంటారు, నిజమే కానీ, తర్వాత సినిమా చేయాలంటే మనం ఉండాలి కదా. అందుకే ఇకపై కొన్ని రిస్కులు చేయకూడదనుకున్నాను. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే భయమేస్తోంది.”
ఇలా రిస్కీ షాట్స్ కు దూరంగా ఉంటానని ప్రకటించాడు విశ్వక్. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం కూడా అలాంటి రిస్క్ చేసినట్టు వెల్లడించాడు.
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కోసం కూడా లారీ మీద నుంచి నేరుగా రోడ్డుపై పడ్డాను. నేరుగా హాస్పిటల్ కు వెళ్లాను, 2 నెలలు బెడ్ రెస్ట్ తప్పదనుకున్నాను. దేవుడి దయ వల్ల ఏం కాలేదు. కానీ ప్రతిసారి దేవుడు హెల్ప్ చేయడు. రిస్క్ అనుకున్నప్పుడు ఆలోచించి చేయాలి.”
ఇలా బ్యాక్ టు బ్యాక్ రిస్కులు చేస్తూ సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. గామి కోసం మంచు తుపాను వస్తుందని హెచ్చరికలు ఉన్నప్పటికీ కొండపైకి వెళ్లి షూట్ చేశామని, ఆక్సిజన్ కూడా అందని పొజిషన్ లో నటించానని చెప్పాడు.