వ్రతం చెడగొట్టుకోవడం, ఫలితం దక్కకపోవడం అంటే ఇదే. ఒక స్టాండ్ మీద వుండకుండా అటు ఇటు మారడం వల్ల రెండు తరహాల నష్టపోతున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణలో చిరకాలంగా రెడ్లదే అధికారం. అలాంటిది తెలంగాణ వేరుగా రాష్ట్రంగా ఏర్పడిన తరువాత వారికి అధికారం దూరం అయింది. అయినా కూడా కేసీఆర్ వారికి ఏమీ తక్కువ చేయలేదు. ఇవ్వాల్సిన గౌరవం, పదవులు, టికెట్ లు అన్నీ ఇస్తూనే వున్నారు. పైగా ఆంధ్రలో ప్రభుత్వంతో సఖ్యతగా వుండడంతో రెడ్లు కూడా కేసీఆర్ పట్ల సానుకూలంగా వుంటూ వస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, హడావుడి మొదలు పెట్టారు. అప్పుడు కూడా రెడ్ల ఓట్లు పోలరైజ్ కాలేదు. రేవంత్ రెడ్డి వెనకాల తెలుగుదేశం వుంది అనే అనుమానం వుండడంతో కాస్త దూరంగానే వుంటూ వస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ సీన్ మారుతూ వస్తోంది. ఇలాంటి టైమ్ లో సెటిలర్లలోని కమ్మ సామాజిక వర్గం నేరుగా, ఓపెన్ గా రేవంత్ రెడ్డి వెనుక చేరింది. మద్దతుగా ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఎందుకోసం ఇదంతా? కేసీఆర్ గెలిస్తే మళ్లీ జగన్ కు ఎక్కడ సాయం చేస్తాడో అన్న అనుమానంతో.
ఇలాంటపుడు కేసీఆర్ పార్టీ చేయాల్సింది ఏమిటి? ఇప్పటి వరకు తన వైపే వున్న రెడ్ల ఓట్లను కొంతయినా కాపాడుకోవడం. సెటిలర్లలోని జగన్ అనుకూల ఓట్లను తన వైపు వుండేలా చూసుకోవడం. కానీ సెటిలర్ల ఓట్లు అన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ కు వెళ్లిపోతున్నాయి అనే ప్రచారం మాయలో కేసీఆర్, కేటీఆర్ అండ్ కో పడిపోయారు. సెటిలర్లను మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అంత వరకు బాగానే వుంది.
కానీ ఈ క్రమంలో జగన్ పాలనను విమర్శించడం, జగన్ పద్దతులను విమర్శించడం, సెటైర్లు వేయడం, ఇలా మొదలు పెట్టారు. మొదట హరీష్ ఆపై కేసీఆర్, అలా అలా మెల్లగా మంత్రుల వరకు వచ్చింది ఇతంతా.
కానీ బీఆర్ఎస్ జనాలు గమనించాల్సింది ఏమిటంటే వాళ్లు ఎంత బతిమాలి బామాలినా, కమ్మ సామాజిక వర్గం ఓట్లు పడవు కాక పడవు. కానీ ఆ ఓట్ల కోసం తాపత్రయ పడుతూ జగన్ ను విమర్శించడం ద్వారా వైకాపా అనుకూల జనాల ఓట్లు, రెడ్ల ఓట్లు కూడా దూరం చేసుకుంటున్నారు.
అసలే అధికారం చాన్నాళ్ల తరువాత తమ సామాజిక వర్గం చేతిలోకి వస్తుందేమో అన్న ఆశతో అటు ఇటు ఊగుతున్నారు రెడ్లు. ఇప్పుడు భారాస జనాలు మాట తీరు వల్ల నిజంగా అటే వెళ్లిపోయేలా వున్నారు. ఈ పరిస్థితి వల్ల అటు కమ్మ.. ఇటు రెడ్డి.. సెటిలర్ల ఓట్లు అన్నీ కాంగ్రెస్ వెళ్లిపోయే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.