ఆహా.. అక్క‌డికి పోతే మ‌నోభావాలు దెబ్బ‌తిన‌వా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఒక ర‌కంగా అదృష్ట‌వంతుడు. ఇంత కాలం త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్న చెత్తంతా.. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు ద‌గ్గ‌రికి పోతోంది. ఐదేళ్ల పాటు మంత్రి ప‌ద‌వి అనుభ‌వించిన గుమ్మ‌నూరు జ‌య‌రాంకు ఇప్పుడు సీఎం…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఒక ర‌కంగా అదృష్ట‌వంతుడు. ఇంత కాలం త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్న చెత్తంతా.. ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు ద‌గ్గ‌రికి పోతోంది. ఐదేళ్ల పాటు మంత్రి ప‌ద‌వి అనుభ‌వించిన గుమ్మ‌నూరు జ‌య‌రాంకు ఇప్పుడు సీఎం జ‌గ‌న్ న‌చ్చ‌డం లేదు. ఎందుక‌య్యా అంటే… త‌న‌ను క‌ర్నూలు ఎంపిగా పోటీ చేయ‌మ‌న‌డ‌మే అని ఆయ‌న అంటున్నారు.

క‌ర్నూలు ఎంపీగా పోటీ చేస్తే ఆలూరు ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ తింటాయ‌ని ఆయ‌న చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నారు. గుమ్మ‌నూరు జ‌య‌రాం చెప్పిందే నిజ‌మైతే… మ‌రి అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లుకు ఎలా వెళ్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. త‌మ‌కిష్టం వ‌చ్చిన‌ట్టు సీఎం జ‌గ‌న్ న‌డుచుకోక‌పోతే చెడ్డోడు, లేదంటే మంచోడు. ఇదీ వైసీపీకి చెందిన కొంద‌రి నేత‌ల ప్ర‌వ‌ర్త‌న‌.

ఇవాళ వైసీపీకి, మంత్రి ప‌ద‌వికి గుమ్మ‌నూరు జ‌య‌రాం రాజీనామా చేశారు. టీడీపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి బీసీ జ‌యహో స‌భ‌లో టీడీపీలో చేర‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా గుమ్మ‌నూరు జ‌య‌రాం మీడియాతో మాట్లాడుతూ ఆలూరు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 12 ఏళ్లు వైసీపీ జెండా మోశాన‌న్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లుగా మంత్రిగా ప‌ని చేసిన‌ట్టు చెప్పారు.

ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని తాను కోరుకున్న‌ట్టు జ‌య‌రాం చెప్పారు. అయితే క‌ర్నూలు ఎంపీ పదవి వద్దన్నానని తెలిపారు. త‌నను ఇక్క‌డే వుండాల‌ని ఆలూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని జ‌య‌రాం చెప్పారు. త‌మ కులం ఎక్కువ‌గా రెండు జిల్లాల్లోనే వుంద‌న్నారు. గుంత‌క‌ల్ నుంచి పోటీ చేయ‌డానికి తాను స‌ముఖంగా ఉన్న‌ట్టు ఆయ‌న చెప్ప‌డం విశేషం.

త‌న స్వ‌స్థ‌లం గుంత‌క‌ల్ స‌మీపంలో ఉంద‌ని, అందువ‌ల్ల అక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు గుమ్మ‌నూరు తెలిపారు. గుమ్మ‌నూరు రాజ‌కీయ అవ‌కాశ వాదానికి ఇంత కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఒక‌వైపు ఆలూరు ప్ర‌జ‌లంతా ఇక్క‌డే వుండాల‌ని కోరుకుంటున్నార‌ని చెబుతూనే, మ‌రోవైపు గుంత‌క‌ల్ నుంచి పోటీ చేయాల‌ని ఉంద‌న‌డం ఆయ‌న స్వార్థ రాజ‌కీయాన్ని చూపుతోంది.