కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాటలకు, చేతలకు పొంతన వుండదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వసంత కృష్ణప్రసాద్ ఆరిపోయారని టీడీపీ నేతలే ఘాటు విమర్శలు చేస్తున్నారు. మైలవరం టికెట్ విషయంలో వైసీపీలో ఉన్నప్పుడు పెద్ద డ్రామానే నడిపారాయన. చంద్రబాబునాయుడితో టచ్‌లో ఉన్నాడని తెలుసుకోలేని వైసీపీ నేతలు, ఆయన్ను మరోసారి మైలవరం నుంచే పోటీ చేయించాలని ఏవేవో లెక్కలేసుకున్నారు.
చివరికి వసంత కృష్ణప్రసాద్ చేరాల్సిన చోటికి చేరారు. అయితే ఆయనకు మైలవరంలో సొంత పార్టీ నుంచి తగిన ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కుటుంబంలో ఈ రోజు నుంచి తన అడుగులు పడతాయన్నారు. వైసీపీలో తాను ఉన్నప్పుడు కొందరు టీడీపీ నాయకులు ఇబ్బంది పడ్డారని, అలాంటి వారికి క్షమాపణలు చెబుతున్నట్టు ఆయన వెల్లడించారు.
వైఎస్సార్ చేసిన అభివృద్ధి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద లేదని విమర్శించారు. సంక్షేమం ఒక్కటే కాదని, అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేయటం లేదని ఆయన ఆరోపించారు. విలువలుతో కూడిన రాజకీయాలు చేయటం తనకు అలవాటని చెప్పుకొచ్చారు. విలువల గురించి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుందని నెటిజన్లు అంటున్నారు.
గతంలో వసంత కృష్ణప్రసాద్ చేసిన కామెంట్స్‌ను తెరపైకి తెచ్చారు. తన తుది శ్వాస వరకూ వైసీపీలోనే వుంటానని ఆయన గతంలో చెప్పారు. లేదంటే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని వసంత కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు టీడీపీలో చేరి జగన్ సర్కార్‌ను విమర్శిస్తూ విలువల గురించి ధర్మోపన్యాసాలు చేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చాల్లే వసంతా… ఎవరైనా వింటే బాగుండదని వెటకరిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నాయకుడిగా నీతి సూత్రాలు వసంత చెబితే, మనమంతా వినాల్సిన ఖర్మ పడుతోందని నెటిజన్లు చురకలు అంటించడం గమనార్హం.